ఎంపీకి పుత్రశోకం...

ABN , First Publish Date - 2022-03-11T14:18:36+05:30 IST

డీఎంకే రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ఎన్‌ఆర్‌ ఇళంగోకు పుత్ర వియోగం కలిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమీపంలో కీల్‌పుదుపట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా

ఎంపీకి పుత్రశోకం...

                   - రోడ్డు ప్రమాదంలో ఇళంగో కుమారుడు దుర్మరణం


పుదుచ్చేరి/చెన్నై: డీఎంకే రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ఎన్‌ఆర్‌ ఇళంగోకు పుత్ర వియోగం కలిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి సమీపంలో కీల్‌పుదుపట్టు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా ఆయనకు పుత్రశోకం మిగిలింది. వివరాలిలా.. రాజ్యసభ సభ్యుడు ఎన్‌ఆర్‌ ఇళంగో కుమారుడు రాకేష్‌ (21) తన స్నేహితుడు వేదవికాస్‌తో కలసి గురువారం వేకువజామున చెన్నై నుంచి జీపులో పుదుచ్చేరికి బయలుదేరాడు. వాహనం విల్లుపురం జిల్లా వానూర్‌ సమీపంలోని కీలపుదుపట్టు వద్ద హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో వున్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జు నుజ్జయింది. రాకేష్‌ అక్కడికక్కడే కన్నుమూయగా, వేద వికాస్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో గంటపాటు ట్రాఫిక్‌ నిలిచి పోయింది. కాగా వాహనం నుజ్జునుజ్జు కావడంతో అందులో నుంచి బయటకు రాలేక వేద వికాస్‌ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి శ్రమించినా వికాస్‌ను గానీ, రాకేష్‌ భౌతికకాయాన్ని గానీ బయటకు తీయ లేకపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హూటాహూటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితి గ్రహించి, వెల్డింగ్‌ మిషన్‌ రప్పించి వాహన శకలాలను తొలగించారు. అనంతరం రాకేష్‌ మృతదేహాన్ని పుదుచ్చేరిలోని ప్రైవేటు ఆస్పత్రి మార్చురీకి, వేద వికాస్‌ను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కోటకుప్పం పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. కాగా అన్ని లాంఛనాలు పూర్తయ్యాక మృతదేహాన్ని చెన్నైలోని ఎంపీ నివాసానికి తరలించారు. 


సీఎం పరామర్శ

స్థానిక అన్నానగర్‌లో నివశిస్తున్న ఎన్‌ఆర్‌ ఇళంగో నివాసానికి రాకేష్‌ భౌతికకాయాన్ని తరలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం శోకసంద్ర మైపోయింది. ఇళంగో అభిమానులు, డీఎంకే శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు శేఖర్‌బాబు, సుబ్రమణ్యం తదితరులు కూడా ఇళంగో నివాసా నికి వెళ్లి అతడిని ఓదార్చారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ తీవ్ర సంతాపం తెలిపారు. డీఎంకే కుటుంబంలో ఒకడిగా వుంటూ పార్టీకి సంబంధించిన పలు కేసులను సమర్థవంతంగా వాదిస్తున్న ఇళంగోకు తీరని కష్టవచ్చిపడిం దన్నారు. ఇళంగో సోదరుడు ఇటీవలే కన్నుమూశారని, ఇంతలోనే ఆయన కుమారుడు కూడా చనిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


ఇష్టపడి కొనుగోలు చేసిన వాహనం

రాకేష్‌ నగరంలోని అంబేద్కర్‌ లా కళాశాలలో చదువున్నాడు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన వాహనాన్ని రాకేష్‌ ఎంతో ఇష్టపడి కొనుగోలు చేశాడు. కానీ ఇంతలోనే ఈ ఘటన నెలకొనడం పట్ల కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. 




Updated Date - 2022-03-11T14:18:36+05:30 IST