- ఆంబూరు వద్ద వ్యాన్- లారీ ఢీ
- ముగ్గురు మహిళలు సహా నలుగురి దుర్మరణం
వేలూరు(చెన్నై): ఆంబూరు సమీపంలోని సోలూరు ఫ్లైఓవర్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బెంగళూరు- చెన్నై రహదారిలో వ్యాన్ - లారీ ఢీకొనడంతో ఓ లెదర్ ఫ్యాక్టరీలో పనిచేసే ముగ్గురు మహిళల సహా నలుగురు దుర్మరణం చెందారు. పదిమందికి పైగా మహిళా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపత్తూరు జిల్లా ఆండూరు కన్నికాపురంలో ప్రైవేటు తోళ్ల కర్మాగారంలో పనిచేసేందుకు ప్రతిరోజూ ఆంబూరు, వాణియంబాడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు వ్యాన్లలో వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వాణియంబాడి పరిసర గ్రామాలకు చెందిన మహిళా కార్మికులను ఎక్కించుకుని ఓ వ్యాన్ ఆ ఫ్యాక్టరీకి బయలుదేరింది. 25 మందికి పైగా కార్మికులున్న ఆ వ్యాన్‌ను రామన్ అనే డ్రైవర్ నడిపాడు. ఆ వ్యాన్ సోలూరు ఫ్లైఓవర్ సమీపంలోని బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిలో వాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని పక్క రోడ్డులోకి దూసుకెళ్ళింది. అదే సమయంలో చెన్నై నుంచి బెంగళూరుకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ వ్యాన్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రామన్, ముగ్గురు మహిళా కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వ్యాన్‌లో ఉన్న పలువురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల మధ్య చిక్కుకుని కేకలు పెడుతున్న వారిని స్థానికులు వెలికి తీసి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకుని ఆంబూరు తాలూకా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అంబులెన్స్‌లో గాయపడినవారిలో కొందరిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి సంఖ్య అధికంగా ఉండటంతో తగినన్ని అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆ మార్గంలో ఖాళీగా వెళ్తున్న లారీలో కొంతమంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ రామన్, ముగ్గురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆంబూరు ప్రబుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కార్మికులు వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా బెంగళూరు - చెన్నై జాతీయ రహదారిలో గంటకుపైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి