ఈ రోడ్ల సొగసు చూడతరమా!

ABN , First Publish Date - 2020-11-23T04:05:15+05:30 IST

ఈ రోడ్ల సొగసు చూడతరమా!

ఈ రోడ్ల సొగసు చూడతరమా!
కంకర తేలిన కొడంగల్‌ మండలంలోని చిన్ననందిగామ రోడ్డు

కంకరతేలిన రోడ్లు.. కాలినడకకూ అవస్థలు 

తరచూ రోడ్డు ప్రమాదాలు

ఏళ్లకాలంగా ప్రజల ఇబ్బందులు

పరిగి: కంకరతేలిన రోడ్లపై ప్రయాణం చేయలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహనాలు అటుంచితే కాలినడకన సైతం అవస్థలు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్లకాలం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు కంకరమయంగా మారింది. పరిగి-షాద్‌నగర్‌ రోడ్డు నుంచి సయ్యద్‌పల్లి గ్రామంలోకి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. గతంతో తారు రోడ్డు మంజూరుకాగా సగం వరకు వేసి వదిలేశారు. కిలోమీటరు దూరం అయితే కంకర తేలి పాదచారులు కూడా నడువలేని దుస్థితికి చేరింది. గ్రామస్థులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామ అభివృద్ధికి గత ఎంపీ రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులతో గ్రామంలో అంతర్గతంగా సీసీ రోడ్లు, మురుగునీటి కాలువల నిర్మాణాలు చేపట్టారు. అయితే గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ గ్రామంలోని దర్గా ఉత్సవాలకు రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు తరచూ వస్తుంటారు. వారంతా ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. అయినా కనీసం రోడ్డు మరమ్మతు గురించి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. రాత్రి పూట రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు అనేకసార్లు కిందపడి గాయాలపాలైన సంఘటనలు కోకొల్లలు. నడిచివెళ్లే వారు కూడా కంకర రాళ్లు తగిలి కిందపడి గాయాలపాలయ్యారు. పక్క నుంచి వెళ్దామన్నా రోడ్డుకు ఇరుపక్కలా పొద లు పెద్ద సమస్యగా మారాయని వాపోతున్నారు. రోడ్డుపై కనీసం మ ట్టయినా వేయించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిఽధులు చొరవ తీసుకోని తమ గ్రామ రోడ్డును బాగు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని పలువురు సయ్యద్‌పల్లి గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.

చిన్ననందిగామ రోడ్డు అధ్వానం

కొడంగల్‌ రూరల్‌ : కొడంగల్‌ మండల పరిధిలోని చిన్ననందిగామ గ్రామానికి ఎన్‌హెచ్‌-163 హైవే రోడ్డు నుంచి గ్రామానికి బీటీ రోడ్డు మంజూరైంది. అయితే కాంట్రాక్టు దక్కించుకున్న గుత్తేదారు కంకరవేసి బీటీ వేయకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో రోడ్డుపై కంకరతేలి పూర్తిగా అధ్వానంగా మారింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్రవాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి రహదారి పనులను వెంటనే పూర్తిచేసేలా చొరవ చూపాలని వారు కోరుతున్నారు.


తారురోడ్డుకు నిధులు మంజూరు చేయాలి

గత కొన్నేళ్లుగా తారురోడ్డు పనులను అర్థంతంరంగా వదిలేశారు. రాకపోకలకు నానా ఇబ్బందులు పడుతున్నాం. రాత్రి పూట అయితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి, తారురోడ్డు నిర్మాణం చేపట్టాలి. అప్పటి వరకు కనీసం మట్టినైనా పోయించాలి.

  - పి.సంజీవ్‌కుమార్‌, సయ్యద్‌పల్లి, పరిగి మండలం

 

Updated Date - 2020-11-23T04:05:15+05:30 IST