శుద్ధిజల కేంద్రం ధ్వంసం!

ABN , First Publish Date - 2021-03-08T03:55:18+05:30 IST

ఒకటి కాదు.. రెండు కాదు రూ.12.30 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధిజల కేంద్రం గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ధ్వంసమైంది.

శుద్ధిజల కేంద్రం ధ్వంసం!
ధ్వంసమైన అద్దాలు

మోటార్లు మాయం

రూ.12.30 లక్షలు వృథా

నీరుగారిన ప్రభుత్వ లక్ష్యం

ఉదయగిరి, మార్చి 7: ఒకటి కాదు.. రెండు కాదు రూ.12.30 లక్షలతో ఏర్పాటు చేసిన శుద్ధిజల కేంద్రం గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో ధ్వంసమైంది. ఐదేళ్ల క్రితం మండలంలోని కొండాయపాళెం గ్రామ పంచాయతీ భవనం వద్ద నిర్మించిన ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలు పంచాయతీకి అప్పగించారు. వారు గాలికొదిలేయడంతో గుర్తుతెలియని వ్యక్తులు అద్దాలు ధ్వంసం చేసి మూడు విద్యుత్‌ మోటార్లు, సామగ్రి అపహరించుకెళ్లారు. ఇంత జరిగినా సంబంధిత అధికారులు దృష్టిసారించిన పాపానపోలేదు. దీంతో పంచాయతీ పరిధిలోని వీరారెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి, కొండాయపాళెం, వెంకట్రావుపల్లి, గంగిరెడ్డిపల్లి, మాసాయిపేట గ్రామాలతోపాటు ఎస్సీ, బీసీ కాలనీల ప్రజలకు శుద్ధిజలం అందని ద్రాక్షాలా మారింది. సుమారు 500 కుటుంబాలు కలిగిన ఆయా గ్రామాల్లో 3075 మంది జనాభా ఉన్నారు. కేంద్రం నిర్మించినప్పట్నుంచి ప్రజల దాహార్తి తీర్చిన పాపానపోలేదు. 



నీటి సమస్య తీవ్రంగా ఉంది

పంచాయతీలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. శుద్ధిజల కేంద్రం ధ్వంసంపై ఏ అధికారి పట్టించుకున్న పాపానపోలేదు. 

- తుపాకుల వెంకటేశ్వర్లు


అధికారులు స్పందించాలి

శుద్ధిజల కేంద్రం ధ్వంసంపై అధికారులు స్పందించాలి. శుద్ధిజల కేంద్రాన్ని వాడుకలోకి తీసుకొచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి. 

- వెంకటస్వామి


నా దృష్టికి రాలేదు

కొండాయపాళెంలో శుద్ధిజల కేంద్రం ధ్వంసం చేసిన సంగతి నాదృష్టికి రాలేదు. విచారించి తగు చర్యలు తీసుకొనేందుకు కృషి చేస్తా. 

- వీరాస్వామి, ఎంపీడీవో



Updated Date - 2021-03-08T03:55:18+05:30 IST