హస్త కళాకారులకు.. ఆసరా

ABN , First Publish Date - 2022-08-06T05:12:27+05:30 IST

ఒన్‌ స్టేషన్‌ - ఒన్‌ ప్రొడక్ట్‌ మూడో దశ అమలులో భాగంగా ప్రాథమికంగా గుంటూరు రైల్వేస్టేషన్‌ని గుర్తించిన రైల్వేశాఖ ఇప్పుడు దీనిని డివిజన్‌ అంతా విస్తరించాలని నిర్ణయించింది.

హస్త కళాకారులకు.. ఆసరా

16 రైల్వేస్టేషన్లలో.. ఒన్‌ స్టేషన్‌ - ఒన్‌ ప్రొడక్ట్‌  

చేనేత, హస్తకళాకారులకు జీవనోపాధి పెంపునకు నిర్ణయం

ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి

గుంటూరు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఒన్‌ స్టేషన్‌ - ఒన్‌ ప్రొడక్ట్‌ మూడో దశ అమలులో భాగంగా ప్రాథమికంగా గుంటూరు రైల్వేస్టేషన్‌ని గుర్తించిన రైల్వేశాఖ ఇప్పుడు దీనిని డివిజన్‌ అంతా విస్తరించాలని నిర్ణయించింది. డివిజన్‌లో మొత్తం 16 రైల్వేస్టేషన్లను గుర్తించింది. నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, నంద్యాల, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మాచర్ల, మిర్యాలగూడెం, నల్గొండ, మంగళగిరి, రేపల్లె రైల్వేస్టేషన్లలో ఈ ఒన్‌ స్టేషన్‌ - ఒన్‌ ప్రొడక్ట్‌ కింద స్టాల్స్‌ ఏర్పాటు చేసుకొనేందుకు రైల్వే శాఖ అనుమతించనుంది.  చేనేత వృత్తులు, హస్తకళలను పరిరక్షించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే గుంటూరు రైల్వేస్టేషన్‌ తూర్పు వైపున చేనేత, హస్తకళాకారుల కోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ని ఏర్పాటు చేసి ప్రోత్సాహాన్ని అందిస్తోంది. 

 స్టాల్స్‌ ఏర్పాటు పూర్తిగా ఉచితం

హస్తకళాకారులు, చేనేత వృత్తిదారులను ప్రోత్సహించేందుకు ఉచితంగా స్టాల్స్‌ని కేటాయించేందుకు నిర్ణయించింది. విద్యుత్‌ ఛార్జీలు  కొన్ని నెలల పాటు ఉచితంగా, ఆ తర్వాత తక్కువ ఛార్జీలు మాత్రమే వసూలు చేయనుంది. స్టాల్స్‌ ఏర్పాటు చేయదలచిన వృత్తిదారులు కేంద్రం/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా అవకాశం కల్పిస్తారు. సూక్ష్మ పరిశ్రమ ఎంఎస్‌ఎంఈలో రిజిస్టర్‌ అయి ఉండాలి. ఒకే సంస్థ ఒకటి కంటే ఎక్కువ స్టేషన్లలో కూడా స్టాల్స్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. ఔత్సాహికులు పట్టాభిపురంలోని రైల్‌వికాస్‌ భవన్‌లో సీనియర్‌ డీసీఎంని సంప్రదించాల్సి ఉంటుంది. 9701379954, 9701370073 నెంబర్లకు ఫోన్‌ చేసి అయినా వివరాలు తెలుసుకోవచ్చని డీఆర్‌ఎం ఆర్‌ మోహన్‌ రాజా తెలిపారు. 

Updated Date - 2022-08-06T05:12:27+05:30 IST