ఎస్పీ కోటా నుంచి రాజ్యసభకు జయంత్ చౌదరి

ABN , First Publish Date - 2022-03-22T02:06:11+05:30 IST

రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) చీఫ్ జయంత్ చౌదరి సమాజ్‌వాదీ పార్టీ కోటా నుంచి..

ఎస్పీ కోటా నుంచి రాజ్యసభకు జయంత్ చౌదరి

పాట్నా: రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్‌డీ) చీఫ్ జయంత్ చౌదరి సమాజ్‌వాదీ పార్టీ కోటా నుంచి రాజ్యసభ‌కు పోటీ చేసే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ-ఆర్ఎల్‌డీ ఉమ్మడి అభ్యర్థిగా జయంత్ చౌదరి బరిలో దిగుతారని తెలుస్తోంది.


ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, ఆర్ఎల్‌డీ కలిపి పోటీ చేశాయి. అయితే, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ఈ కూటమి విఫలమైంది. సమాజ్‌వాదీ పార్టీ 111 సీట్లు గెలుచుకోగా, ఆర్ఎల్‌డీ 8 సీట్లు దక్కించుకుంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో జయంత్ చౌదరి త్వరలోనే అఖిలేష్ యాదవ్‌ను కలుసుకుంటారని, ఆ తర్వాత సంయుక్త ప్రకటన చేస్తారని పార్టీ వర్గాల కథనం.


ఉత్తరప్రదేశ్ నుంచి 31 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. వీటిలో 11 సీట్లు వచ్చే జూన్‌లో ఖాళీ కానున్నాయి. వీటికి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. రిటైరవుతున్న 11 మంది ఎంపీలలో ఐదుగురు బీజేపీ, ముగ్గురు ఎస్‌పీకి, ఇద్దరు ఎస్‌పీ, ఒకరు కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. 403 మంది సభ్యుల అసెంబ్లీలో బలాబలాలను బట్టి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సునాయాసంగా 7 సీట్లు వరకూ దక్కించుకోగలదు. అధికార కూటమికి 273 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 255 మంది, అప్నాదళ్‌కు 12 మంది, నిషద్‌కు ఆరుగురు సభ్యులున్నారు. సమాజ్‌వాదీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలకు 125 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఎస్‌పీకి 111 మంది సభ్యులుండగా, ఆర్ఎల్‌డీ 8, ఎస్‌బీఎస్‌పీకి ఆరుగురు సభ్యులు ఉన్నారు. రెండు పార్టీలు 11వ సీటు కోసం ఇతర పార్టీల సహకారం కోరక తప్పదు. జన్‌ సత్తా దళ్, రాజాభయ్యా లోక్‌తాంత్రిక్, కాంగ్రెస్‌లకు తలో రెండు సీట్లు ఉన్నారు. బీఎస్‌పీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

Updated Date - 2022-03-22T02:06:11+05:30 IST