ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ ఇక లేరు

ABN , First Publish Date - 2021-05-07T06:59:56+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) పార్టీ అధినేత చౌదరి అజిత్‌సింగ్‌(82) తుదిశ్వాస విడిచారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో...

ఆర్‌ఎల్‌డీ చీఫ్‌ అజిత్‌సింగ్‌ ఇక లేరు

  • కొవిడ్‌తో ఆస్పత్రిలో 16రోజుల పోరాటం
  • కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు
  • రైతు పక్షపాతిగా కీర్తి సముపార్జన
  • మూడుసార్లు పీవీ సర్కారుకు దన్ను
  • తెలంగాణ ఉద్యమానికి గట్టి మద్దతుదారు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) పార్టీ అధినేత చౌదరి అజిత్‌సింగ్‌(82) తుదిశ్వాస విడిచారు. గత నెల 20న కరోనా బారిన పడిన ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌదరి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అజిత్‌సింగ్‌తో పాటు.. ఆయన మనవరాలికి కరోనా సోకినా ఆమె చికిత్సతో కోలుకున్నారు. అజిత్‌సింగ్‌ 1939 ఫిబ్రవరి 12న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జన్మించారు. లఖ్‌నవూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న ఆయన.. ఐఐటీ-ఖరగ్‌పూర్‌, అమెరికాలోని ఇల్లినాయిస్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. కంప్యూటర్‌ సైంటి్‌స్టగా 15 ఏళ్ల పాటు అమెరికాలో పనిచేశారు. తన తండ్రి, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ మరణంతో 80లలో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఏడుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1989లో నేషనల్‌ ఫ్రంట్‌ సర్కారులో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సంకీర్ణ(వాజపేయి, మన్మోహన్‌) ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. చివరిసారి యూపీఏ-2 హయాంలో పౌర విమానయాన మం త్రిగా పనిచేశారు. ఏ శాఖను చూసినా.. రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయం గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు సమస్యలను పరిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిన తొలి జాతీయ నేత ఆయనే. పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడంలోనూ ఆయనది కీలకపాత్ర.


కోవింద్‌, వెంకయ్య, మోదీ, కేసీఆర్‌ సంతాపం

అజిత్‌సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంక య్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ, యూపీ, ఢిల్లీ, తెలంగాణ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్‌, కేజ్రీవాల్‌, కేసీఆర్‌, హిమాచల్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. 


Updated Date - 2021-05-07T06:59:56+05:30 IST