జగన్‌ దెబ్బకు జీరోల్లా..!

ABN , First Publish Date - 2022-02-13T06:06:51+05:30 IST

హీరోలను జీరోలుగా చేశారు. స్టార్స్‌ను యాచకులుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహం సంతృప్తి చెందింది.

జగన్‌ దెబ్బకు జీరోల్లా..!

హీరోలను జీరోలుగా చేశారు. స్టార్స్‌ను యాచకులుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అహం సంతృప్తి చెందింది. నిజంగా ఆయన తోపు అని భజనలు మొదలయ్యాయి. సమస్యలు సృష్టించినవారు దాన్ని పరిష్కరించినందుకు థ్యాంక్స్‌ అందుకున్నారు. ఇంతకీ సినిమా టికెట్ల రేటు పెంచుతానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చిన దాఖలాలు లేవు.. అయినా థ్యాంక్స్‌ అందుకున్నారు. ఉద్యోగుల విషయంలోనూ ఇదే జరిగింది. ప్రధాన సమస్య పీఆర్సీ విషయం తేల్చకపోయినా ఆ నలుగురు ఉద్యోగసంఘాల నాయకులు ముఖ్యమంత్రికి అదేపనిగా కృతజ్ఞతలు చెప్పారు. సమస్య పరిష్కరించకుండానే థ్యాంక్స్‌ అందుకున్న ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. నిజానికి ఆయన ప్రభుత్వం సృష్టించిన సమస్యల వల్ల సంక్షోభంలోకి పోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున వెళ్లిన చిరంజీవి, రాజమౌళి, మహేష్‌ బాబు, ప్రభాస్‌, కొరటాల శివకు పరాభవం మిగిలింది. జగన్‌రెడ్డి అధికార దర్పానికి, తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఈ ప్రముఖుల పాపులారిటీ తల వంచింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో అవమానాలకు గురైంది ఆ నలుగురైదుగురు మాత్రమే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అవమానానికి గురైంది. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రైడ్‌గా వెలుగొందుతున్న వారిని యాచకులుగా మార్చడం ద్వారా తెలుగుజాతిని కూడా అవమానించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి సినీ ప్రముఖులపై ఎప్పటి నుంచో కోపం ఉంది.


తెలుగు సినిమా ప్రముఖులు తనను గుర్తించడం లేదని ఆయన రగిలిపోతున్నారు. తనను గుర్తించి గౌరవించనివారు తన కాళ్ల వద్దకు వచ్చేలా స్కెచ్‌ రూపొందించారు. అంతే ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను అమాంతం తగ్గించేశారు. దీంతో భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మించినవాళ్లు, అందులో నటించిన వాళ్లు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిని కలిసి తమ మొర చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వవలసిందిగా వేడుకున్నారు. తనను గుర్తించని వారికి గుణపాఠం చెప్పడానికి సమయం ఆసన్నమైందని అనుకున్నారో ఏమో గానీ, సినీ ప్రముఖులకు రెండు రోజుల క్రితం జగన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తనను కలవడానికి ఎవరెవరు రావాలో కూడా ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీంతో సూపర్‌స్టార్‌గా, బాహుబలిగా వెలుగొందుతూ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రిని కూడా కలుసుకోవడానికి వెళ్లని మహేష్‌బాబు, ప్రభాస్‌ సైతం చిరంజీవి వెంట ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లారు. జగన్‌ను కలిసినవారందరూ లబ్ధప్రతిష్టులే. అయినా ముఖ్యమంత్రి నివాసం వద్ద వారికి అడుగడుగునా అవమానమే ఎదురైంది. అంతా ప్లాన్‌ ప్రకారం జరిగింది. హీరోల కార్లను గేటు బయటే నిలిపి కాలి నడకన వెళ్లాల్సిన పరిస్థితి కల్పించారు. అక్కడ వారికి స్వాగతసత్కారాలు లభించలేదు. నిర్ణయించిన సమావేశ మందిరంలో సినీ ప్రముఖులు కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే ఈ బృందంతో సంబంధం లేకుండా ఎన్నికల్లో తన పార్టీ తరఫున ప్రచారం చేసిన పోసాని కృష్ణమురళి, అలీ వంటి వారిని జగన్‌రెడ్డి పిలిపించుకుని ప్రముఖుల సరసన కూర్చోబెట్టించారు. షాట్‌ రెడీ కాగానే ‘ఇప్పుడు మీ సమస్యలు చెప్పుకోండి’ అని జగన్‌రెడ్డి అనుమతిచ్చారు. అంతే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి అత్యంత దీనంగా చిత్ర పరిశ్రమపై చల్లని చూపు ప్రసరింపజేయవలసిందిగా వేడుకున్నారు. చేతులు జోడించి ఆయన అభ్యర్థించిన తీరు పలువురిని విస్మయానికి గురిచేసింది. మెగా అభిమానులు ఈ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనువుగాని చోట అధికులమని చెప్పుకోకూడదు అనుకున్నారో ఏమో గానీ జగన్‌రెడ్డి అధికారం ముందు చిరంజీవి తల వంచారు. మహేష్‌బాబు కూడా ఇంచుమించు ఇలాగే రెండేళ్ల నుంచి తాము అనుభవిస్తున్న వ్యథను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రితో తమకు విభేదాలు ఏమీ లేవని రాజమౌళి వివరణ ఇచ్చుకున్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశం మొత్తాన్ని కెమెరాల్లో బంధింపజేసి సమాచార శాఖ ద్వారా సాయంత్రానికి మీడియాకు విడుదల చేయించడం. సాధారణంగా ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశాలను ఆసాంతం షూట్‌ చేయరు. ఇప్పుడు మాత్రమే అది జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు వచ్చిన సినీ ప్రముఖులు విలేకరులతో మాట్లాడటం కోసం ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయించారు. కూర్చోవడానికి కుర్చీలు కూడా వేయకపోవడంతో వారంతా ఎండలో నిలబడి, అది కూడా ముఖ్యమంత్రి ఇంటి బయట, సమస్యలు పరిష్కరించడానికి సుముఖత వ్యక్తంచేసిన జగన్‌రెడ్డికి థ్యాంక్స్‌ చెప్పడానికి పోటీ పడ్డారు. చిరంజీవి అండ్‌ కో మాటలు విన్నవారు ముఖ్యమంత్రి మనసు ఇప్పటికైనా కరిగి ఉంటుందని భావించారు. సమాచార శాఖ విడుదల చేసిన వీడియో చూసిన తరువాతే అసలు ఏమి జరిగిందో జనానికి తెలిసింది. సినిమాలకు రెండు రకాల టికెట్ల ధరలు ఉండవని సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్టు వీడియోలో ఉంది. అంతేకాదు చిరంజీవి తాను మెగాస్టార్‌నన్న విషయం మర్చిపోయి దీనమైన స్వరంతో వేడుకున్నారు. అప్పుడు జగన్‌రెడ్డి కనీసం ఆయన వైపు కూడా చూడలేదు. గతంలో చిరంజీవి దంపతులను ఇదే జగన్‌రెడ్డి సతీసమేతంగా స్వాగతసత్కారాలతో గౌరవించారు. గుమ్మం బయటకు వెళ్లి స్వాగతం చెప్పడమే కాకుండా వీడ్కోలు కూడా పలికారు. ఇప్పుడు చిరంజీవి మాత్రమే కాదు, ఫెయిల్యూర్‌ అంటే ఏమిటో తెలియని దర్శకుడు రాజమౌళి, కొరటాల శివతోపాటు మహేష్‌బాబు, ప్రభాస్‌ కూడా వచ్చినప్పటికీ కనీస మర్యాదలకు నోచుకోలేదు. ఇప్పటివరకు తమను తాము డెమీగాడ్స్‌గా భావిస్తూ వచ్చిన స్టార్స్‌ తన అధికారం ముందు తలవంచక తప్పని పరిస్థితి జగన్‌రెడ్డి కల్పించారు.


తన అధికారానికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అని ఆయన రుజువు చేసుకున్నారు. తమకు అవమానం జరిగిందని తెలిసినప్పటికీ చిత్రపరిశ్రమ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నారో లేక అధికార దురహంకారానికి ఎదురెళ్లడం ఎందుకులే అనుకున్నారో తెలియదు కానీ ప్రముఖులంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకొన్నారు. పుండు మీద కారం చల్లినట్టుగా మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో సినీనటుడు మోహన్‌బాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను కలుసుకుని సమావేశం వివరాలు చెప్పారు. మోహన్‌బాబు తనను కాఫీకి ఆహ్వానిస్తే వెళ్లానని పేర్ని నాని చెబుతున్నప్పటికీ, అలా వెళితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియనంత అమాయకుడేమీ కాదాయన. మొత్తంమీద జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్ఠలందుకున్న తెలుగు సినీ ప్రముఖులను హీనపరచాలనుకున్న జగన్‌రెడ్డి అంత పనీ చేశారు. ఆయన స్థానంలో చంద్రబాబు ఉండి ఉంటే మహేష్‌ బాబు, ప్రభాస్‌ వంటి వారు వచ్చినందుకు పరవశించిపోయి పోర్టికో నుంచి తన కార్లు తప్పించి వారి కార్లను అనుమతించేవారు. అక్కడి నుంచి వారిని లోపలికి తీసుకెళ్లి శాలువాలతో సత్కరించి అడిగిన డిమాండ్లన్నింటినీ పరిష్కరించి కారు దాకా వచ్చి తలుపు తెరిచి మరీ కూర్చోబెట్టి వీడ్కోలు పలికేవారు. జగన్‌రెడ్డి స్టయిలే వేరు కదా. గతంలో సినీ పరిశ్రమ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు రాజమౌళిని ఉద్దేశించి ఆయన ఎవరు అని ప్రశ్నించిన గడసరితనం జగన్‌రెడ్డిది. పోసాని కృష్ణమురళిని కూడా తమతోపాటే ఆహ్వానించారని తెలిసినప్పుడే మొన్న ఆయనను కలిసిన ప్రముఖులు అవమానాలకు మానసికంగా సిద్ధపడ్డారేమో తెలియదు. చిత్ర పరిశ్రమకు తెలంగాణలో లేని సమస్యలు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వస్తున్నాయన్నది కీలక ప్రశ్న. సినిమా వ్యవహారం మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. ఎవరో సినిమాలు నిర్మిస్తారు.. మరెవరో థియేటర్లు నిర్మించి వాటిలో ప్రదర్శిస్తారు. లాభనష్టాలకు వారిదే బాధ్యత. ఇందులో ప్రభుత్వానికి పోయేదేమీ లేకపోగా వినోదపు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అలాంటప్పుడు సినిమా టికెట్ల ధరలు తగ్గించాలన్న ఆలోచనకు జగన్‌రెడ్డి వచ్చారంటేనే దాని వెనుక ఉన్న కుట్రను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి బ్రాండెడ్‌ దుస్తులు ధరిస్తారు. వాటి ధర చాలా ఎక్కువ. మామూలు దుస్తులు ధరించకుండా బ్రాండెడ్‌ ఎందుకు అంటే అది ఆయన ఇష్టం. అంత భారీ ధర పెట్టి కొనుక్కునే స్థోమత ఆయనకుంది. సినిమా టికెట్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కదా. గతంలో కొన్ని సినిమాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం రాయితీ ఇచ్చేది. సందేశాత్మక చిత్రాలకు వినోదపు పన్ను రద్దు చేసేది. ఇప్పుడు ఇలాంటి ప్రోత్సాహకాలు లేకపోయినా తగుదునమ్మా అంటూ టికెట్ల ధరల విషయంలో జోక్యం చేసుకుంటున్నారు.



తలొగ్గడమే మార్గమా?

ఇప్పుడు నాణేనికి రెండోవైపు చూద్దాం. టికెట్ల ధరలు తగ్గిస్తూ జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉంటే సినీ ప్రముఖులకు ఉపశమనం లభించి ఉండేది. ఆ పని చేయకుండా జగన్‌రెడ్డి వంటి అహంభావి ముందు సాగిలపడటం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ముకుళిత హస్తాలతో ఆయనను వేడుకోవలసిన అవసరం చిరంజీవికి ఎందుకు వచ్చిందంటే సమాధానం దొరకదు. ఏ ముఖ్యమంత్రినీ కూడా ఇప్పటివరకు కలుసుకోని మహేష్‌బాబు, ప్రభాస్‌ ఇప్పుడెందుకు వెళ్లారు? వాళ్లు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మాత్రం ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఎందుకు? టికెట్ల ధర తగ్గించడం వల్ల మహా అయితే కలెక్షన్లు తగ్గొచ్చు. అంత మాత్రానికే కొంపలు మునిగిపోవు కదా. హీరోలు, డైరెక్టర్లు తమ పారితోషికాన్ని తాత్కాలికంగా తగ్గించుకుంటే జగన్‌రెడ్డి అధికారం ముందు తల వంచాల్సిన అవసరం ఉండదు కదా. ఆత్మాభిమానం కంటే డబ్బు ముఖ్యం కాదు కదా. రాజమౌళి ఇప్పటికే భారతదేశం గర్వించే దర్శకుడిగా ఎదిగారు. బాహుబలితో ప్రభాస్‌ ఆలిండియా స్టార్‌ అయ్యారు. మహేష్‌ బాబుకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తెలిసిందే. ఇక చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్‌. ‘అయితే ఏమిటట..’ అని జగన్‌రెడ్డి ఇప్పుడు రుజువు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ చూశాక పవన్‌ కల్యాణ్‌పై ఎవరికైనా గౌరవం పెరుగుతుంది. తన సినిమాల రిలీజ్‌ కోసం ఆయన ఎక్కడా రాజీ పడలేదు. ఎవరికీ తలవంచలేదు. నష్టపోవాల్సి వస్తే తానే నష్టపోతాడు కానీ నిర్మాతలను నష్టపోనివ్వడు. నిజజీవితంలో కూడా ఆయన హీరోనే. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిరంజీవి బృందంతో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన వారిలో న్యాయవాది నిరంజన్‌రెడ్డి కూడా ఉన్నారు. జగన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన కేసుల్లో ఆయనే వాదిస్తారు. చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర నిర్మాతలలో ఆయన ఒకరు. నిరంజన్‌రెడ్డి నిజంగా పట్టుబడితే టికెట్ల ధరలు పెంచడానికి జగన్‌రెడ్డి అంగీకరించరా? ఆచార్య చిత్రానికి ఆదాయం తగ్గితే నష్టపోయేది నిరంజన్‌రెడ్డి మాత్రమే. అయినా ఆయన దిగజారి వేడుకోరు. ఆ పరిస్థితి చిరంజీవికి కల్పిస్తారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్‌రెడ్డి వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే ఎప్పుడైనా ముఖ్యమంత్రి పదవిలో నుంచి దిగిపోయి జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. ఈ విషయం తెలుసు కనుకే ఆయన తన అధికార దర్పాన్ని గరిష్ఠస్థాయిలో ప్రదర్శిస్తున్నారు. ఒక స్మగ్లర్‌ను హీరోగా ఎలా చూపిస్తారు? పైగా ‘తగ్గేదేలే’ అని చెప్పిస్తారా? అని పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్‌పై పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మండిపడ్డారు. పలు కేసులలో ఏ-----–వన్‌ ముద్దాయిగా ఉన్న జగన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న ప్రజలు ఉన్న ఈ సమాజంలో స్మగ్లర్లు హీరోలుగానే చలామణి అవుతారు. అందుకే పుష్ప సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌ అయింది.


‘చిన్న’ జీయర్‌ స్వామి!

ఈ విషయం అలా ఉంచితే జగన్‌రెడ్డిని ఉద్దేశించి చినజీయర్‌ ప్రశంసించిన తీరు, సినీ ప్రముఖులకు అవమానం జరిగిన నేపథ్యంలో మరోమారు చర్చనీయాంశమైంది. రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జగన్‌రెడ్డిని ఉద్దేశించి ధనం, విద్య, వయసు, అధికారం ఉన్నప్పటికీ ఆయనకు కళ్లు నెత్తికెక్కలేదని, పెద్దల మాట ఆలకిస్తారని, ఆచరిస్తారని జీయర్‌ సెలవిచ్చారు. జగన్‌రెడ్డికి అంత ధనం ఎలా వచ్చిందో సదరు స్వామీజీ ప్రశ్నించలేదు. అధికారం ఉంది కనుక ఆయన ప్రాపకం కావాలి కనుక లేని లక్షణాలను ఆపాదించి మరీ జగన్‌రెడ్డిని పొగిడారు. ఆయన ఎవరి మాటా వినరని, అడుగడుగునా అధికార దర్పం ప్రదర్శిస్తారని సొంత పార్టీ వారే బహిరంగంగా వ్యాఖ్యానిస్తారు. బాబాయి వైవీ సుబ్బారెడ్డి సలహాలు, సూచనలు జగన్‌రెడ్డి స్వీకరిస్తారని జీయర్‌ స్వామి చెప్పుకొచ్చారు. సుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటో వైసీపీలో ఎవరిని అడిగినా చెబుతారు. తనకు లేని లక్షణాలను ఆపాదించిన జీయర్‌ స్వామిని చూసి జగన్‌రెడ్డికి జాలి కలిగి ఉంటుంది. వేలమంది భక్తులను కలిగి ఉండి ఆధ్యాత్మిక గురువుగా వెలుగొందుతున్న జీయర్‌ వంటివారే తన ప్రాపకం కోసం పాకులాడటం చూశాక జగన్‌రెడ్డిలో అహం మరింత పెరిగి ఉంటుంది. అందుకే సినీ ప్రముఖులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. సర్వసంగపరిత్యాగులమని చెప్పుకొనే స్వాములు కూడా అధికార ప్రాపకం కోసం అనర్హులను కీర్తిస్తే ధర్మం ఏం కావాలి? ధర్మ ప్రచారానికి మాత్రమే పరిమితం కావాల్సిన చినజీయర్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల బ్రోచర్లను విడుదల చేయడానికి ఎలా వెళతారు? రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ మహోత్సవం సందర్భంగా జీయర్‌ వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఈ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహావిష్కరణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం కోసం మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కేసీఆర్‌ మోహరించారు. ముచ్చింతల్‌కు వెళ్లే అన్ని రహదారులను అభివృద్ధి చేశారు. అయినప్పటికీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ శిలాఫలకంపై కేసీఆర్‌ పేరు లేకుండా చేశారు. దీంతో ఆగ్రహించిన కేసీఆర్‌, ముచ్చింతల్‌ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ జరిగే పారాయణాన్ని ఆలకించడానికి కేసీఆర్‌ సతీమణి ప్రతి రోజూ వెళ్లేవారు. అయితే గత అయిదు రోజులుగా ఆమె కూడా అక్కడకు వెళ్లడం లేదు. మంత్రులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎవరూ ముచ్చింతల్‌ వైపు చూడవద్దని కేసీఆర్‌ ఆదేశించడంతో అక్కడ అధికార పార్టీవారు కనిపించకుండా పోయారు. మనుషులంతా ఒక్కటేనని సమానత్వాన్ని ప్రచారం చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గానీ, దాన్ని నిర్వహించిన జీయర్‌ ఆశ్రమంలో గానీ సమానత్వం ఎక్కడా కనిపించదు. ముందుగా ప్రకటించిన కార్యక్రమం ప్రకారం రామానుజాచార్యుల విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి, ఆయనతో తొలిపూజ చేయించవలసి ఉంది. అయితే ప్రధాని మోదీనే ఆ విగ్రహానికి తొలి పూజ చేశారు. రాష్ట్రపతి ఆదివారం చేసే పూజ లాంఛనమే అవుతుంది. చినజీయర్‌ స్వామితో పాటు ఈ మొత్తం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియలుగా నిలిచిన మైహోం రామేశ్వరరావు తీరుపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహంతో ఉన్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు సంబంధించిన వార్తలను తన సొంత పత్రికలో ప్రచురించకుండా కేసీఆర్‌ నిషేధించారు. కేసీఆర్‌కు దైవభక్తి అధికం. అంతేకాకుండా ఆధ్యాత్మిక గురువులు, స్వాములను ఎంతో గౌరవించి సత్కరిస్తారు. వారి కాళ్లకు సాష్టాంగపడతారు. చినజీయర్‌ స్వామికి ఈ గౌరవ మర్యాదలన్నీ దక్కేవి. కేసీఆర్‌ తన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు జీయర్‌ ఆశీర్వచనం ఇవ్వకపోగా ఎటో చూస్తారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందను కేసీఆర్‌ కొంతకాలం చేరదీశారు. ఆయన ఆధ్వర్యంలో యాగం చేశారు. దీంతో అసూయ చెందిన చినజీయర్‌ అప్పట్లో కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించేవారు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన స్వాములు అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించక మానదు.


అగ్రహం.. అనుగ్రహం

ఈ నెల 14తో ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రతువులన్నీ పూర్తవుతాయి. ఆ తర్వాత కేసీఆర్‌ వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చినజీయర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని కేసీఆర్‌ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు జీయర్‌పై ఆయన గుర్రుగా ఉన్నందున యాదాద్రి ప్రారంభోత్సవంలో జీయర్‌కు ప్రాధాన్యం లభిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఏర్పాటైన సమతామూర్తి క్షేత్రానికి ఎంతోమంది విరాళాలిచ్చారు. స్థలంతోపాటు అధిక మొత్తంలో జూపల్లి రామేశ్వరరావు విరాళం ఇచ్చారు. అయితే కోట్లలో విరాళం ఇచ్చిన మరెందరో ఉన్నప్పటికీ ప్రస్తుత కార్యక్రమంలో వారెవరికీ చోటు కల్పించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దాతలు కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉన్నారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు? జీయర్‌ స్వామిని దూరం పెడతారా? ప్రస్తుతం ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. భక్తులకు స్వాముల అనుగ్రహం కావాలి. స్వాములకు ప్రభుత్వాల అనుగ్రహం కావాలి. శృంగేరి వంటి కొన్ని పీఠాలు మాత్రమే అధికారంలో ఉన్నవారికి ఆమడదూరంలో ఉంటూ ధర్మప్రచార కార్యక్రమానికే పరిమితమవుతాయి. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో ఒక వెలుగు వెలుగుతున్న చిన జీయర్‌ గానీ,  విశాఖలోని స్వరూపానంద గానీ ప్రభుత్వ అనుగ్రహం లేకపోతే చెల్లని కాసులుగా మిగిలిపోతారు. ముఖ్యమంత్రులే కాళ్లపై పడుతున్నందున ఈ ఇరువురికీ భక్తుల తాకిడి పెరిగింది. ప్రభువుల ఆగ్రహానికి గురైన శ్రీనాథ కవి సార్వభౌముడికి జీవిత చరమాంకంలో ఏం జరిగిందో మనం చదివాం. స్వాములు స్వాములుగానే ఉంటూ ఆశ్రమాలకే పరిమితమైతే ఏ సమస్యా ఉండదు. ఆడంబరాలు కోరుకున్నప్పుడే సమస్యలు, వివాదాలు పొంచి ఉంటాయి. సమానత్వం గురించి చెబుతున్న చినజీయర్‌ స్వామి ప్రధానమంత్రి, తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను మాత్రమే వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతలను పట్టించుకోలేదు. స్వాములు సైతం అధికారంలో ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వడం శోచనీయం!


యూట్యూబ్‌లో 

ఆర్కే ‘కొత్త పలుకు’ కోసం

QR Code scan చేయండి

Updated Date - 2022-02-13T06:06:51+05:30 IST