Abn logo
Sep 27 2021 @ 00:12AM

జగన్ కోసం నాశక్తికి మించి చేశాను

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసురాలిగా, జగన్‌ సోదరిగా, తెలంగాణ ఆడబిడ్డగా, వైఎస్సార్‌టీపీ అధినేత్రిగా విభిన్న పాత్రల్లో ఒదిగిపోతున్న నవతరం నాయకి వైఎస్‌ షర్మిల. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన వ్యక్తిగత, రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.


ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌... పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్‌ గారేమో కేసీఆర్‌ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. 


ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం. వాళ్లకు నచ్చలేదు. చర్చలు జరిగాయి. వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. నా నిర్ణయం నేను చెప్పాను. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను. 


రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు... మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు.


ఆర్కే: నమస్తే షర్మిల గారు  

షర్మిల: నమస్తే అన్న 


ఆర్కే:షర్మిల అనాలా? షమ్మీ అనాలా? 

షర్మిల:  మీ ఇష్టం అన్నా. ఎలాగైనా పర్లేదు. 


ఆర్కే: ఇంట్లో వాళ్లందరూ షమ్మీ అని పిలుస్తారేమో కదా!  

షర్మిల:  అవునన్నా  


ఆర్కే: మీ నాన్న ఏమని పిలిచేవారు?

షర్మిల:  పాప్స్‌. పాప అని ముద్దుగా అలా అనేవారు. మిగతా బంధువర్గం అంతా షమ్మీ అని పిలుస్తారు. 


ఆర్కే: షమ్మీ నాన్న కూచా? 

షర్మిల:  అవునన్నా. చాలా! 


ఆర్కే: అంటే నాన్న నీ మీద ఈగ కూడా వాలనిచ్చేవారు కాదటగా? 

షర్మిల:  నిజమే అన్నా. నాకేదన్నా బాధ కలిగితే నాకంటే ముందు ఆయన కళ్లల్లో నీళ్లు కనపడేవి. చాలా ప్రేమగా చూసుకున్నారు. 


ఆర్కే: మీ నాన్నతో అంత ఆప్యాయంగా ఉండేదానివి! అలాంటిది హఠాత్తుగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ మిస్సయిందనే వార్త తెలిసినప్పుడు అంతా షాక్‌లోకి వెళ్లిపోయుంటారు కదా! 

షర్మిల:  నిజానికి హెలికాప్టర్‌ మిస్సయిందన్నప్పుడు నేను వెంటనే ఎక్స్‌ప్లోషన్‌ ఏమైనా డిటెక్ట్‌ అయిందా అని ఎంక్వైరీ చేశాను. అలాంటిదేమీ లేదన్నారు. దాంతో నాకు వేరే అనుమానమే రాలేదు. భయపడలేదు. వానపడుతుంది... ఎక్కడో ఒక చోట ల్యాండ్‌ అయివుంటారు. కమ్యూనికేషన్‌ మనకు అందడంలేదనే అనుకున్నా. చుట్టుపక్కల వాళ్లంతా భయపడుతున్నారు కానీ... ‘ఏం కాదులే’ అని సెప్టెంబరు 2 రాత్రి నేను పడుకున్నా. అమ్మా వాళ్లందరూ ప్రేయర్‌ చేస్తున్నారు. మరుసటి రోజు తెల్లారి కూడా నేనసలు భయపడలేదు. అప్పుడు ఒకటి తరువాత మరొకటి తెలిసింది. చాలా షాకయ్యాను. తొమ్మిది నెలలపాటు విపరీతంగా బాధపడ్డాను. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను. వాస్తవ పరిస్థితుల్లోకి రాలేకపోయాను. దాదాపు ఏడాది తరువాత గానీ మామూలు మనిషి కాలేకపోయాను. 


ఆర్కే: అప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం తదితర అంశాల గురించి తెలుసా? 

షర్మిల:  లేదన్నా. జగన్‌మోహన్‌రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు. ఆయన తరుఫున వేరేవారు చేశారు. పోరాడాల్సి వస్తుందని తెలుసు. పోరాడుతోంది పెద్ద పెద్ద వాళ్లతోనని తెలుసు. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఒక పక్క అంతులేని బాధ... మరోపక్కన విభిన్న పరిస్థితులు... రెండిటినీ సమన్వయం చేసుకోవడం కష్టం కదా! (డీలింగ్‌ విత్‌ ద గ్రీఫ్‌ ఈజ్‌ డిఫరెంట్‌... డీలింగ్‌ విత్‌ ద సర్కమ్‌స్టెన్సెస్‌ ఈజ్‌ డిఫరెంట్‌). అన్నీ ఒక్కసారిగా వచ్చి మీద పడ్డాయి. 


ఆర్కే: వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అడిగినవారికి లేదనకుండా సాయం చేసే లక్షణం ఉంది. అలాంటి మనిషికి, దేవుడిని నమ్మే ఆ కుటుంబానికి ఇలా ఎందుకు జరిగిందంటారు? 

షర్మిల: తెలియదన్నా. మనం మనుషులం. మనకు అన్నీ అర్థంకావు. ఒకవేళ అర్థమైతే మనుషులం ఎందుకు అవుతాము? దేవుళ్లమైపోతాము కదా! కానీ నాన్న చాలా చాలా మంచి వ్యక్తి. 


ఆర్కే: స్కూల్‌ చదువంతా పులివెందులేనా? 

షర్మిల: లేదన్నా. ఫస్ట్‌ వరకు పులివెందుల. తరువాత కొన్నేళ్లు చెన్నై. హైస్కూల్‌, డిగ్రీ, పీజీ అన్నీ హైదరాబాద్‌లోనే. 


ఆర్కే:పీజీ ఎందులో? 

షర్మిల:  ఎంబీఏ, ఫైనాన్స్‌. 


ఆర్కే: మీ నాన్నలానే ఎవరి బాధలన్నా వింటే కరిగిపోవడం, ఇబ్బందుల్లో ఉన్నవారికి సాయం చేయడం వంటి లక్షణాలు స్కూల్లో చదివే రోజుల నుంచే నీకు ఉన్నాయట కదా! నాకు తెలిసి ఆ రోజుల్లో... అంటే 1985 ప్రాంతంలో ఎవరో బిచ్చగాడిని చూసి వంద రూపాయలు ఇచ్చావట... గుర్తుందా? 

షర్మిల: అది గుర్తు లేదన్నా (నవ్వు). కానీ ఎవరైనా బాధల్లో ఉంటే నేను తట్టుకోలేను. చేతనైన సాయం చేస్తాను. అది మన బాధ్యత కూడా. 


ఆర్కే: రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నాన్న ఉన్నప్పుడే వచ్చిందా? 

షర్మిల:  లేదన్నా. చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలంటే అయిష్టత. ఎందుకంటే నాన్న చాలా బిజీగా ఉండేవారు. ఖాళీ ఉంటే మాత్రం నాతోనే ఉండేవారు. సో... ‘నన్ను నాన్న నుంచి దూరం చేస్తుంది రాజకీయాలే కదా. ఇందులోనే ఎందుకు ఉండాలి? వేరే ప్రొఫెషన్స్‌ ఉన్నాయి. అప్పుడైతే మాతోనే ఉంటారు కదా’ అనుకునేదాన్ని. కనీసం నాకు అసలు పాలిటిక్స్‌ అనే సబ్జెక్ట్‌ కూడా ఇష్టముండేది కాదు. ఆ చర్చల్లో కూడా ఎప్పుడూ పాల్గొనలేదు. నేనుంటే నాన్న కూడా ఆ విషయాలు మాట్లాడేవారే కాదు. 


ఆర్కే: మరి ఎప్పుడు వచ్చింది ఆసక్తి? 

షర్మిల:  ఈ మధ్యే వచ్చింది (నవ్వు). 


ఆర్కే:పరిస్థితుల వల్ల వచ్చిందా? 

షర్మిల: ఒక డిజైర్‌ వల్ల వచ్చింది. ఒకటి చేయాలనుకున్నాం కనుక వచ్చింది. 


ఆర్కే: తెలంగాణలో పార్టీ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? 

షర్మిల:  ఎందుకంటే... కేసీఆర్‌ గారు కరోనా సమయంలో చాలా అసమర్థంగా వ్యవహరించారు. జాతీయ మీడియా కూడా చెప్పింది... ‘కేసీఆర్‌ టెస్టులు చేయడానికి కూడా సుముఖంగా లేరు’ అని. అది నన్ను కలవరపెట్టింది. అప్పుడు మిత్రుడు, రాజకీయ వ్యూహకర్త నాతో ఒకటి చెప్పారు... ‘కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రత్యామ్నాయం లేకపోవడం. ఆయన పాలనవల్లో, మంచితనంవల్లో మెచ్చి ఓట్లు వేయలేదు’ అని. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు కూడా విఫలమైనట్టు. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా. 


ఆర్కే: మరి తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్‌ ఉందా? 

షర్మిల:  ఎందుకు లేదన్నా! ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌... పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? బీజేపీ అంటారా..! బండి సంజయ్‌ గారేమో కేసీఆర్‌ అవినీతి మీద నా దగ్గర వంద ఆధారాలున్నాయంటారు. ఒక్కటి కూడా బయటపెట్టరు. రేవంత్‌రెడ్డి గారు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్‌. రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు... మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? ఈ ప్రతిపక్షాలన్నీ విఫలమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన సాగుతోంది. కనుక కచ్చితంగా మా పార్టీకి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. అందులో సందేహమే లేదు. 


ఆర్కే:నాన్నలా షమ్మీలో కూడా పట్టుదల ఉంది. కానీ రాష్ట్రం విడిపోయాక ఇక్కడ తెలంగాణకు సంబంధించిన భావజాలం, భావోద్వేగాలు కొన్ని ఉన్నాయి. దాన్ని కేసీఆర్‌ గరిష్ఠంగా వాడుకున్నాడు. అవసరం వచ్చినప్పుడు మళ్లీ రెచ్చగొడుతుంటాడు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించారు కనుక ఆయన కూతురుగా షర్మిలకు ఇక్కడ అర్హత లేదన్నది వాళ్ల వాదన. దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? 

షర్మిల: అన్నా... మీలాంటి పెద్దలు వైఎస్సార్‌ గారు వ్యతిరేకి అంటున్నారంటే... దానికి అర్థం కేసీఆర్‌ గారు వైఎస్సార్‌ని ఎంత విజయవంతంగా తెలంగాణకు వ్యతిరేకి అని బ్రాండింగ్‌ చేశారో అర్థం చేసుకోండి. ఇది కేసీఆర్‌ గారు వైఎస్సార్‌ మీద వేసిన ముద్ర. వైఎస్సార్‌ అసలు తెలంగాణకు వ్యతిరేకి ఎలా అవుతారు? 1999లోనే వైఎస్సార్‌ సంతకాలు పెట్టి పంపించారు. అప్పటికి టీఆర్‌ఎస్‌ పుట్టను కూడా పుట్టలేదు. తెలంగాణ అవసరం ఉందని 2004, 2009 మేనిఫెస్టోల్లో పెట్టారు. 2004లో కేసీఆర్‌ పొత్తు పెట్టుకున్నప్పుడు వైఎస్సార్‌ దేవుడు. 2009లో పొత్తు లేనప్పుడు తెలంగాణకు వ్యతిరేకి. అదే తరహాలో చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకుంటేనేమో ఆయన దేవుడు. తరువాతి ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆంధ్రా పార్టీనా? కేసీఆర్‌ అవసరం వచ్చినప్పుడు నాలుక ఎటు పడితే అటు తిప్పుతుంటారు. వైఎస్సార్‌ ఎప్పుడూ ఈ ప్రాంతం... ఆ ప్రాంతం అని చూడలేదు. ఎక్కువ బోర్లు తెలంగాణలో ఉన్నాయని తెలిసే ఉచిత విద్యుత్తు ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ఇచ్చారు. నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన తెలంగాణ ప్రజల్లో తీసెయ్యడానికి వైఎస్సార్‌ చాలా ప్రయత్నించారు. 


ఆర్కే: ఈ వాదనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలననే నమ్మకం ఉందా? ‘షర్మిల మా బిడ్డే’ అనిపించుకోగలరా? 

షర్మిల:  కచ్చితంగా. దానికి నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్సార్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నా పనిని సులువు చేశాయి. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను ఇక్కడి వారు అనుభవించారు. నన్ను చూస్తేనే మా నాన్న గుర్తొస్తారు. మా నాన్నను చూస్తే ఆయన సంక్షేమం గుర్తొస్తుంది. తెలంగాణ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొంటారన్న నమ్మకం ఉంది. 


ఆర్కే:ఎవరితోనూ పొత్తులు అవసరం లేదంటారు! 

షర్మిల: అక్కర్లేదన్నా. 


ఆర్కే:మీరు పార్టీ ప్రకటించిన తరువాత మీ అన్న జగన్‌మోహన్‌రెడ్డితో విభేదాలు తారస్థాయికి చేరి, మీరు ఇక్కడికి వచ్చేశారని ప్రచారం జరుగుతోంది..! వాస్తవమేనా? 

షర్మిల: నాకు... అన్నకు మధ్య వంద ఉండవచ్చు. వెయ్యి ఉండవచ్చు. అవి కూర్చొని పరిష్కరించుకోలేనివైతే కావు. కానీ నేనిక్కడ పార్టీ పెట్టడానికి కారణం... జగన్‌మోహన్‌రెడ్డి గారు, నేను సేవ చేయాలనుకొంటున్న ప్రాంతాలు వేరు. రాష్ట్రాలు వేరు. అలాంటప్పుడు పార్టీలు కూడా వేరవ్వడమే కరెక్ట్‌. తెలంగాణలో పార్టీ పెట్టాలన్నది నా నిర్ణయం. తెలంగాణ ప్రజలకు సేవ చేయాలన్నది నా నిర్ణయం. ఎందుకంటే నా జీవితం ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది. నేనిక్కడ పెరిగాను. ఇక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. సో... నేను ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్లు వద్దన్నారు. 


ఆర్కే: ఎందుకు వద్దన్నారు? 

షర్మిల: ఎందుకు వద్దన్నారో వాళ్లనే అడగాలి. 


ఆర్కే: సజ్జల రామకృష్ణారెడ్డి ‘మేము ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాం. కానీ ఆవిడ వినలేదు. కనుక మాకు... ఆవిడకు రాజకీయంగా ఎలాంటి సంబంధంలేదు’ అని అన్నారు! 

షర్మిల: ఒకరు చెబితే తీసుకున్న నిర్ణయం కాదు నాది. ఎంతో పరిశోధన చేసి, ఎంతో మందితో మాట్లాడిన తరువాత, ఎంతో లోతుగా ఆలోచించి, ఎన్నిటినో పరిగణనలోకి తీసుకొని తీసుకున్న నిర్ణయం. వాళ్లకు నచ్చలేదు. చర్చలు జరిగాయి. వాళ్ల అభిప్రాయం వాళ్లు చెప్పారు. నా నిర్ణయం నేను చెప్పాను. కానీ బాధ ఎక్కడ కలిగిందంటే... మీరన్నట్టు రామకృష్ణారెడ్డి అన్న ‘సంబంధంలేదు’ అని మాట్లాడినందుకు. నేను రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రోజున ‘సంబంధం లేదు’ అన్న పదం వాడారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్లకు అవసరమైనప్పుడల్లా అడిగిందల్లా నా శక్తికి మించి చేశాను. పాదయాత్రతో సహా. ఏ సంబంధం ఉందని చేశాను? రక్తసంబంధం ఉందని, నా బాధ్యత అనుకుని చేశాను. అలాంటిది ఒక్క మాటలో ‘సంబంధం లేదు’ అనేశారు. విభేదాలు ఎవరికి ఉండవన్నా! మీరు పది మందిని పిలిచి ‘మీ తోబుట్టువులతో విభేదాలున్నాయా’ అని అడగండి. పదికి పదిమంది విభేదాలు ఉన్నాయనే చెబుతారు. కానీ విభేదాలున్నాయి కదా అని ‘సంబంధాలు లేవు’ అనుకోవడం నాకు నచ్చలేదు. బాధేసింది. 


ఆర్కే: వైఎస్సార్‌ లేనంత మాత్రాన సంబంధాలు తెగిపోవు కదా! 

షర్మిల: అవునన్నా. అదే బాధ కలిగించింది. 


ఆర్కే: మరి నువ్వు గానీ, అమ్మ గానీ ఎప్పుడూ వాళ్లని అడగలేదా? 

షర్మిల: లేదు. 


ఆర్కే:సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడంటే జగన్‌ అన్నట్టే. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా మాట్లాడే స్వేచ్ఛ, అధికారం ఎవరికీ లేవనేది చాలామంది అభిప్రాయం? 

షర్మిల:అన్న అలా అనకపోతే మంచిదే. కానీ ఆయన అనుకోనంత మాత్రాన రక్తసంబంధాలు తెగిపోవు కదా. కొట్టుకున్నా అన్నా చెల్లెళ్లమే. 

ఆర్కే: ఇక్కడ మీరు పార్టీ పెడితే కేసీఆర్‌కు ఇబ్బందనే జగన్‌ మద్దతు ఇవ్వలేదన్నది ఒక వాదన. అసలు కేసీఆర్‌ వదిలిన బాణం అనేది రెండోది? 

షర్మిల: నేను తెలంగాణ ప్రజల సమస్యల కోసం పోరాడడానికి ప్రజలు వదిలిన బాణాన్ని. ఒక అమ్మాయి జీవితంలో ముందు పుట్టింట్లో ఉంటుంది. పెళ్లితో ఒకరికి భార్య అవుతుంది. తల్లి... అత్త... అమ్మమ్మ... నాన్నమ్మా అవుతుంది. మార్పు సహజం. అప్పుడు అది కరెక్ట్‌. ఇప్పుడు ఇదీ కరెక్ట్‌. 


ఆర్కే: అంటే కేసీఆర్‌-జగన్‌ మధ్య సంబంధాలు దెబ్బతినకూడదనేగా?

షర్మిల: వాళ్లకే తెలియాలి (నవ్వు). 


ఆర్కే: ఏ విషయంలో వ్యతిరేకత ఉంది? 

షర్మిల: అన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా నియంత పాలన అనేది చాలామందికి నచ్చలేదు. ఆయన ఎవర్నీ పట్టించుకోరు. ఎవరి సంక్షేమం గురించి పెద్దగా ఆలోచించరు. ఆయనకు ఏది వర్కవుట్‌ అవుతుందనే దానిపై మాత్రమే ఫోకస్‌ చేస్తారు. ఆయన ఎంచుకొనే ప్రాథమ్యాలే తప్పు. అప్పుడు కాళేశ్వరం అన్నారు. లక్షల కోట్లు తెచ్చి పెట్టారు. దాని కరెంట్‌ ఖర్చులకే అప్పుల చేయాల్సిన పరిస్థితి. పోనీ నీళ్లు ఇస్తారనే అనుకుందాం. ఆ నీళ్లు రాకముందే ఇప్పుడు వరి వేయద్దంటున్నారు. 


ఆర్కే:  తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిజమే. మరి ఏపీలో కూడా ఇదే సమస్య ఉంది. జగన్‌ విడుదల చేసిన జాబ్‌ కేలండర్‌ నవ్వుల పాలైయింది. ఆయనతో ఇక్కడ మిమ్మల్ని పోలుస్తారేమో కదా! 

షర్మిల:నేను పదే పదే చెబుతుందేమిటంటే... ఒకప్పటి నేను వేరు. ఇప్పటి నేను వేరు. ప్రస్తుతం నా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. ఇక్కడి ప్రజల సమస్యలపై నేను మాట్లాడకపోతే వారికి నేను న్యాయం చేసినదాన్ని అవ్వను. ఒకప్పుడు మీరు అది చేశారు కదా! అక్కడ చేశారు కదా! అంటే దానికి నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఉదాహరణకు మన పిల్లలు ఉన్నారు. వాళ్లకి మంచి బుద్ధులు నేర్పుతూ పెంచుతాం. పెద్దయ్యాక ఎలా తయారవుతారన్నది వాళ్ల నిర్ణయం. నేను ఆ రోజు జగన్‌మోహన్‌రెడ్డి గారికి ఎందుకు ప్రచారం చేశాను? ఫీజురీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, నీళ్లు వంటివి ప్రజలకు ఇవ్వడం ముఖ్యమనుకొని, ఆ పార్టీ పేరులో వైఎస్సార్‌ అన్న పేరు ఉంది కాబట్టి, నిలబడినవాడు తోడబుట్టినవాడు కాబట్టి నేను ప్రచారం చేశాను. అంతమాత్రాన తను చేసిన ప్రతి పనికీ, అక్కడ జరిగే ప్రతి విషయానికీ నేను బాధ్యురాలిని ఎలా అవుతాను? ఇది మన బాధ్యత అనుకొని ఒకటి చేస్తాం. ఆ తరువాత వాళ్ల మంచి చెడులకు వాళ్లే బాధ్యులు. అక్కడ జగన్‌ను ఆశీర్వదించారు. ఆయనకు ఐదేళ్లు టైమ్‌ ఇవ్వండి. మీకు సంతోషమైతే మళ్లీ వేయండి. లేకపోతే తిరగబడండి. 


ఆర్కే:  కేటీఆర్‌ అంటే ఎవరని అన్నావు కదా! వెటకారంగానా? 

షర్మిల:వెటకారంగానే! లేకపోతే ఆడపిల్లలను వ్రతాలు చేసుకోమంటాడా! గత ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగింతలు పెరిగింది. కారణం ఎవరు? వాళ్లు! గ్రూప్‌1 నోటిఫికేషన్‌ అసలు వెయ్యనే లేదు. పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అవి చూసి తట్టుకోలేక మేము మూడు రోజులు నిరాహార దీక్షలు మొదలుపెడితే... నా చెయ్యి విరగ్గొట్టారు. నా వస్త్రాలు చింపారు. అయినా అక్కడ ఇష్యూ డైవర్ట్‌ అవ్వకూడదని మహిళలకు జరిగిన అవమానంగా ఆ ఘటనను చిత్రీకరించలేదు. తరువాత మూడు రోజులు అక్కడే దీక్ష చేశాను. ప్రతి మంగళవారం దీక్ష చేస్తామని చెబితే వ్రతాలు చేసుకోండంటారా? అంటే మా ఆడవాళ్లం ఇంట్లో ఉండి వంటలు, వ్రతాలు చేసుకోవాలా? మీరేమో ఫామ్‌హౌసుల్లో పడుకొంటారా? ఇది అన్యాయం కాదా అన్నా! 
ఆర్కే: రాజకీయ నాయకురాలివి అవుతున్నావు! లౌక్యంగా సమాధానాలిస్తున్నావ్‌! 

షర్మిల: ఎక్కువ మాట్లాడకూడదు(నవ్వు). నేను పాలిటిక్స్‌ కటౌట్‌ మాత్రం కాను. మా నాన్నయితే కచ్చితంగా ఆశ్చర్యపోయేవారు. 


ఆర్కే: అసలు రాజకీయాలంటేనే ఇష్టం లేకుండా జగన్‌ అడిగారని, సజ్జల లాంటి వాళ్లు రూట్‌మ్యాప్‌ ఇచ్చారని పాదయాత్రకు బయలుదేరారు... ఉపన్యాసాలు ఇచ్చారు. వీటన్నిట్లో ట్రైనింగ్‌ ఎవరు ఇచ్చారు? 

షర్మిల: ఎవరూ ఇవ్వలేదు. అలా ఒక్కొక్కటీ నేర్చుకొంటూ వెళ్లానంతే. నేను చెయ్యి ఊపితే నాన్నలా ఉంటుందనేది అప్పటి వరకు నాకే తెలియదు. జనంలోకి వెళ్లాక... పక్కనవాళ్లు చెప్పాకే ఆ విషయం తెలిసింది (నవ్వు). ఒకటి రెండు మీటింగుల్లో తడబడ్డా. తెలుగులో మాట్లాడడం కూడా నాకు పెద్దగా అలవాటు లేదు. ఇంట్లో ఎక్కువ ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్ని. తెలుగు అంత బాగా మాట్లాడుతుంటే అమ్మ, అనిల్‌ కూడా ఆశ్చర్యపోయేవారు. దేవుడి దయ.. అంతే. 


ఆర్కే:జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు మీరు, మీ అమ్మ పార్టీ కోసం తిరిగారు. ఇద్దరూ రెండు స్తంభాల్లా నిలబడ్డారు. పదేళ్ల తరువాత అక్కడ ప్రభుత్వం వచ్చింది. ఆశ్చర్యంగా ఆ రెండు స్తంభాలనూ పక్కకు నెట్టేశారు. మీకు ఏమనిపించింది? 

షర్మిల:ఇన్ని కష్టాలు ఉంటాయనేది మాకు మొట్టమొదట అర్థమైంది నాన్న వెళ్లిపోయిన తరువాతే. ఆ సమయంలో అంతా కలిసి గట్టిగా నిలబడాలనుకున్నాం. నిలబడ్డాం. జగన్‌కు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను, అమ్మా చేయగలిగింది చేశాం. వాళ్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లకు అవసరం లేదు కదన్నా.


ఆర్కే: కానీ ఏదీ శాశ్వతం కాదు. రేపు ఒకవేళ ఆయనకు అవినీతి కేసుల్లో శిక్ష పడితే అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? మళ్లీ ఇదే షర్మిల... ఇదే విజయలక్ష్మి గారి అవసరం రావచ్చుగా? 

షర్మిల:రావచ్చు. కానీ ఇది రాచరికం కాదు కదన్నా. రాజు పోతే కొడుకు లేకపోతే చెల్లి రాజు కావడానికి. ఇది ప్రజాస్వామ్యం. ఒకవేళ ఏ కారణంతోనైనా జగన్‌ గారు సీఎంగా ఉండలేకపోతే అప్పుడు ఆ పార్టీ విధివిధానాలను  బట్టి తరువాత ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను ఆ పార్టీలో కనీసం సభ్యురాలిని కూడా కాదు.


ఆర్కే: ఆస్తులు, వ్యాపారాల గొడవలు కూడా ఉన్నాయా? 

షర్మిల: గొడవలు ఎవరింట్లో ఉండవు? మీ కుటుంబంలో లేవా? 


ఆర్కే: ప్రస్తుతానికైతే లేవు. ముందు ముందు తెలియదు. 

షర్మిల: మంచిదే(నవ్వు). ఆస్తులు అన్నాక అటూ ఇటూ అవ్వడం సహజం. కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం చేసుకోలేనిదేదీ ఉండదు. 


ఆర్కే: మీ నాన్న బతికి ఉన్నప్పుడు అన్నీ ఉమ్మడి వ్యాపారాల కిందే పరిగణించారు కదా! ఆయన హయాంలో ప్రారంభించిన, అంటే జగన్‌ నడుపుతున్న, అప్పుడు నడిపిన ప్రతి వ్యాపారంలో మీ ఇద్దరికీ భాగస్వామ్యం ఉంది. ఆయన దృష్టిలో కూతురు, కొడుకు ఒక్కటే. కదా! 

షర్మిల:అవునన్నా. ఏ రోజూ ఆ తేడా చూపించలేదు


ఆర్కే: అంటే అన్నింట్లోనూ మీకు వాటా ఉంది. అవునా? 

షర్మిల: ఉంటుందన్నా. నా ఆస్తి నాకు ఉంటుంది. ఎక్కడికి పోతుంది! 


ఆర్కే:  మీ నాన్నను చూశావు. పాతికేళ్లు ఢక్కామొక్కీలు తింటే కానీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు. హేమాహేమీలతో తలపడి... ఆర్థికంగా చితికిపోయి... సహనంతో కాంగ్రెస్‌లోనే ఉండి అనుకున్నది సాధించుకున్నారు. మీరు కూడా అలా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమవుతున్నారా? 

షర్మిల: ఒక్కసారి దిగాక అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. 


ఆర్కే:  బాల్యంలో అందరిలానే మీ అన్నా చెల్లెళ్లు కూడా గొడవపడేవారా? 

షర్మిల: చిన్న చిన్నవాటికి కొట్టుకొనేవాళ్లం. అందరు అన్నా చెల్లెళ్లలానే. 


ఆర్కే:  మీ తాత రాజారెడ్డి ఎవరి వైపు ఉండేవాళ్లు? 

షర్మిల: అలా ఏంలేదు. మా ఇంట్లో ఆడపిల్లలైనా... మగపిల్లలైనా అందర్నీ ఒకేలా చూసేవారు. మా జార్జి పెదనాన్న కొడుకులున్నారు... సునిల్‌ అన్న, అనిల్‌రెడ్డి, జగన్‌రెడ్డి, నేను, సునీత... అందరం కలిసే ఉండేవాళ్లం. ఆడపిల్లలమని ఎప్పుడూ తక్కువ చేయలేదు.  


ఆర్కే:  ప్రస్తావన వచ్చింది కనుక అడుగుతున్నా... డాక్టర్‌ సునీత పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు. వాళ్ల నాన్న మీకు సొంత బాబాయ్‌ కదా! అంటే చంపడం కన్నా... చంపిన తీరు బాధాకరం. మీకెలా అనిపించింది? 

షర్మిల:చాలా బాధపడ్డాం. చాలా భయంకరం. అలా ఎవరికీ జరగకూడదు. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. వైఎస్సార్‌ కుటుంబం మొత్తం సునీతకు, చిన్నమ్మకు తోడున్నాం. సునీత నాకంటే 17 రోజులు పెద్ద. 


ఆర్కే:  సునీతకు నైతిక మద్దతు షర్మిల నుంచేనని విన్నా..!  

షర్మిల: నా విధానం ఒక్కటే. ముఖ్యంగా బాధితులకు విశ్వాసం, భరోసా కల్పించడం వ్యవస్థ బాధ్యత. నా బాధ్యత. అందులో ఇలాంటి కేసుల్లో సానుభూతి, చిత్తశుద్ధి చాలా అవసరం. నాకు చేతనైనంత నేను చేస్తాను. నిజానికి నా చేతుల్లో ఏమీ లేదు. 


ఆర్కే:  రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నప్పుడు భర్తగా అనిల్‌ స్పందన ఏమిటి? 

షర్మిల: నాకు అడ్డు చెప్పలేదు. నిజానికి అనిల్‌ చాలా మంచి భర్త. కానీ ఏ రోజూ రాజకీయాల్లో తను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. 


ఆర్కే:  మీరిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? 

షర్మిల:స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ శివార్లలో ఒక ధాబాకు వెళ్లినప్పుడు ఆయన కలిశారు. అప్పుడు నేను చదువుకొంటున్నా. అప్పటి నుంచి అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్లం. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అయితే కాదు. అయితే ముందు అనిలే ప్రపోజ్‌ చేశాడు. కానీ ఇంట్లో నాన్న ఒప్పుకోలేదు. ‘వాళ్లు బ్రాహ్మిణ్స్‌. మన పద్ధతులు వేరు. వాళ్ల పద్ధతులు వేరు. నువ్వు ఉండలేవు. నీకు ఇప్పుడు బానే ఉంటుంది. తరువాత తరువాత తెలుస్తుంది’ అన్నారు. 


ఆర్కే:  ఆహారపు అలవాట్ల నుంచి తేడాలుంటాయి కదా! 

షర్మిల:అవును. నాకసలు చికెన్‌ లేకపోతే కుదరదు(నవ్వు). ‘నువ్వు అనుకొంటున్నావు కానీ తరువాత చాలా గొడవలు వస్తాయి. వద్దు’ అని నాన్న నచ్చజెప్పారు. నేను వినలేదు. అలా అలా జరిగిపోయింది(నవ్వు). 


ఆర్కే:  ఆ తరువాత ఎప్పుడైనా బాధపడ్డారా? 

షర్మిల: లేదన్నా. 


ఆర్కే: మరి వాళ్లింట్లో నాన్‌వెజ్‌ సమస్య ఎలా పరిష్కరించుకున్నారు? అనిల్‌కి కూడా అలవాటు చేశారా?

షర్మిల: అనిల్‌ ముందు నుంచే తినేవాడన్నా. ఆ ధాబాలో కూడా తినేవాడు (నవ్వు). వాళ్లింట్లోవాళ్లు తినరు. 


ఆర్కే:  అనిల్‌ మీ క్యాంపెయిన్‌కు వస్తారా? 

షర్మిల:లేదు. ఆయన ఇవాంజలిస్ట్‌ (మత ప్రచారకుడు) కదా! ఎప్పుడూ క్యాంపెయిన్‌ చేయలేదు. 


ఆర్కే:  ఇవాంజలిస్ట్‌‌గా ఆయన పరోక్షంగా జగన్‌కు ఉపయోగపడ్డాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్టియన్‌ ఓట్లన్నీ గంపగుత్తగా ఒక నాయకుడికి సొంతమవడం ఏపీలోనే జరిగింది. ఇప్పుడు జగన్‌ని... క్రిస్టియన్స్‌ని విడదీయలేనంత బంధం ఏర్పడింది. దానికి ప్రధాన కారణం అనిలే కదా! 

షర్మిల: అవును. 


ఆర్కే: అన్న ఆంధ్రాలో సీఎం. చెల్లి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వం పనితీరు ఇక్కడ నీ మీద పడుతుంది. అవునా? 

షర్మిల: మొదటి నుంచి నాకొక స్పష్టత అయితే ఉంది. నేను, జగన్‌ రెండు ప్రాంతాలను ఎంచుకున్నాం. ఈ ప్రాంతాల్లో ప్రజలు వేరు... వాళ్ల ఆకాంక్షలు వేరు. వాళ్ల చరిత్ర... వాళ్ల రాజకీయాలు వేరు. ఒక పార్టీ రెండుచోట్లా ఉండి... రెండింటికీ న్యాయం చేయడం కష్టమవుతుంది. ఆ విషయం జగన్‌ అర్థం చేసుకున్నాడు కాబట్టే ఒక ప్రాంతానికే పరిమితమయ్యాడు. కానీ వైఎస్సార్‌ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రెండు ప్రాంతాలవారికీ సమ న్యాయం చేశాడు. ఆయనకు రెండు ప్రాంతాలూ రెండు కళ్లు. కనుక ఆయన ప్రేమించిన ఈ ప్రాంత ప్రజలకు నేను సేవ చేయాలనుకొంటున్నాను. మా పార్టీ పేరులో ‘తెలంగాణ’ కూడా ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికే ఇక్కడ పార్టీ పెట్టాను.  

ఆర్కే:  మంచికన్నా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా! ఇప్పుడు ఏపీ విషయం తీసుకొంటే జగన్‌ పరిపాలన రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలా లేదనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఆ ప్రభావం మీపై పడుతుంది కదా! ఆ పరిపాలన కంటే భిన్నమైన పరిపాలన ఇస్తామని, నిజమైన రాజన్న రాజ్యం తెస్తానని మీరు ఇక్కడ చెప్పగలరా? 

షర్మిల:మేము చెప్పేది వైఎస్సార్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని. ఆయన మొదలు పెట్టిన పథకాలు ఇక్కడ నామ్‌కేవాస్తేగా నడుస్తున్నాయంతే. సంక్షేమం అంటేనే ప్రాథమిక అవసరాలు. అవి తీర్చకపోతేనే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. అక్కడైనా ఇక్కడైనా ఐదేళ్లు అధికారం ఇస్తారు. పరిపాలన బాగుంటే మళ్లీ ఎన్నుకొంటారు. లేదం టే తిరగబడతారు. అక్కడేంజరుగుతుందనేది తెలియదు. 


ఆర్కే:  మీరు సీఎం పోస్టుకు పోటీపడుతున్నారు! 

షర్మిల: నిస్సందేహంగా. 


ఆర్కే: అలాంటప్పుడు ఎవరి ప్లస్‌లేంటి... మైన్‌సలేంటి అనేది పరిశీలిస్తారు కదా! 

షర్మిల:అయితే ఏపీలో ఏం జరుగుతుందన్నది నాకు సంబంధం లేని విషయం. తెలంగాణ ప్రజలకు నేను ఏంచేయగలుగుతాను అన్నదానిపైనే నా దృష్టి. 


ఆర్కే: తమిళనాడు, కర్ణాటకల్లో ఏంజరుగుతుందన్నది మనం పట్టించుకోకపోవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు వేరు. రెండు రాష్ట్రాలూ దాదాపు అరవై సంవత్సరాలు కలిసున్నాయి. అదీ కాకుండా మీదైనా, జగన్‌దైనా రూటు ఒకటే... రాజశేఖర్‌రెడ్డి! మైనస్‌ వైఎస్‌... మీరేంటి? 

షర్మిల: నథింగ్‌. అందుకేనన్నా... నేను రాజశేఖర్‌రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తానని మాత్రమే చెబుతున్నా. 


ఆర్కే: అలాంటి పాలన అక్కడ (ఏపీ) ఉందో లేదో నాకు తెలియదంటారు! 

షర్మిల: మీరు కనుక్కోండి (నవ్వు). అక్కడ స్థానిక ఎన్నికలు జరిగాయి. బానే వచ్చాయి కదా! 


ఆర్కే:  వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో అంతా కలిసి ప్రార్థనలు చేశారు. కానీ మాట్లాడుకోలేదు! 

షర్మిల: అన్నా... మీరు పాత వీడియోలు చూడండి. ప్రేయర్‌లో ఎప్పుడూ మాట్లాడలేదు. మొన్న కూడా ప్రేయర్‌లో ఉన్నాం. ఆయన వచ్చాడు. ప్రేయర్‌ అయిపోయింది. దండలేశాం. ఎవరిపాటికి వాళ్లు వెళ్లిపోయాం. అంతే తప్ప మాట్లాడుకోకూడదు అని కూడా ఏమీ లేదక్కడ. 


ఆర్కే:  జగన్‌కు మీకు మధ్య మాటా మంతి ఉందా? 

షర్మిల: ఎందుకు లేదన్నా? మాట్లాడుతూనే ఉంటాం. ఈ రోజు కూడా ఫోన్‌ చేసి మాట్లాడాడు.  


ఆర్కే:  ప్రశాంత్‌ కిశోర్‌ని మీరు కూడా హైర్‌ చేసుకొంటున్నారా? 

షర్మిల: ‘ఓ సోదరుడిగా నీకు సాయం చేస్తాన’ని ప్రశాంత్‌ కిశోర్‌ గారు మాటిచ్చారు. ఏం చేయాలి... ఎలా చేయాలన్నది ఇంకా చర్చించలేదు. 


ఆర్కే:  ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నాడు..!

షర్మిల:చేరినా ఇక్కడ సమస్య కాదు. 


ఆర్కే:  అంటే నేననేది... నిదానంగా మిమ్మల్ని కాంగ్రెస్‌కి జత చేస్తాడేమోనని!

షర్మిల: అవకాశం ఉందన్నా. కానీ అక్కడ ఆయన పని చేసేది పార్లమెంట్‌ ఎన్నికల కోసం. ఇక్కడ నాకు... అసెంబ్లీకి. రెండు ఎన్నికలూ కలిసి కూడా రావు. 


ఆర్కే:  మరి జనాల్ని మెప్పించి, ఒప్పించడానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? 

షర్మిల: అక్టోబర్‌లో పాదయాత్ర మొదలుపెడుతున్నా. దానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. 


ఆర్కే:  అన్ని రోజులు సాధ్యమా? 

షర్మిల: ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పనేముంటుందన్నా! 

ఆర్కే: మరి పిల్లలు? 

షర్మిల:చదువుకొంటున్నారు. మా అబ్బాయి రాజాకు 21 సంవత్సరాలు. అమ్మాయికి 19. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. రాజాకి మార్షల్‌ ఆర్ట్స్‌ చాలా ఇష్టం. ఎకనామిక్స్‌ స్టూడెంట్‌. అమ్మాయి బిజినెస్‌ స్కూల్లో ఫైనాన్స్‌ చదువుతోంది. నన్ను వదిలి అంత దూరం వెళ్లడం తనకు ఇష్టంలేదు.  


ఆర్కే:  వైఎస్‌ పన్నెండో వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశం పెట్టారు? ఆయన మద్దతుదారులందరి మద్దతు కోసమేనా? 

షర్మిల: అలాగేంలేదు. ఆయన మద్దతుదారులు అప్పుడూ ఉన్నారు... ఇప్పుడూ ఉన్నారు. ఆహ్వాన పత్రికల్లో కూడా ఎక్కడా పార్టీ పేరు లేదు. పుష్కర వర్ధంతి సందర్భంగా నాన్నని అభిమానించే వాళ్లని పిలిచి నివాళి అర్పించాలనుకున్నాం. కానీ దానికి రాజకీయాన్ని అంటగట్టేశారు. పిలిచినవాళ్లలో 70 శాతం ఆంధ్రావాళ్లు. రాజకీయం చేయాలనుకొంటే వాళ్లని ఎందుకు పిలుస్తాం? విజయవాడలో చేసినా నేను వెళ్లేదాన్ని. 


ఆర్కే:  మరి జగన్‌మోహన్‌రెడ్డిని పిలిచారా?

షర్మిల: పిలిచాం. మేం వారం పది రోజుల ముందు అనుకుని చేసిన కార్యక్రమం. వచ్చినవాళ్లు కూడా ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదు. 


ఆర్కే:  వైఎస్‌ మరణానంతరం మీ అమ్మగారు కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది? 

షర్మిల: అమ్మకు నాన్నే ప్రపంచం. ‘నేనెందుకు బతికున్నాను? ఆ చాపర్‌లో నేనెందుకు లేను?’ అంటూ చాలా రోజులు బాధపడింది. మూడు నాలుగేళ్లయితే అమ్మ ముఖంలో అసలు నవ్వే లేదు. 


ఆర్కే:  కాంగ్రెస్‌ వాళ్లు అప్పట్లో హామీ గానీ, భరోసా గానీ ఏమీ ఇవ్వలేదా? సోనియా, మన్మోహన్‌ వచ్చారు కదా! 

షర్మిల:ఏం ఇవ్వలేదన్నా. కానీ సీఎంని చేయమని మేమేమీ అడగలేదు. మేం చేద్దామనుకున్న ఓదార్పు యాత్ర వద్దన్నారు.


ఆర్కే:  ఎవరు వద్దని చెప్పింది?

షర్మిల:సోనియాగాంధీ. ఆమెను కలవడానికి వెళ్లినప్పుడు చెప్పారు. అప్పటికీ ‘వాళ్లని ఓదార్చి, సానుభూతి తెలపడం మన బాధ్యత’ అని ఆమెకు వివరించే ప్రయత్నం చేశాను. ఆమె అర్థం చేసుకోలేదు. 


ఆర్కే:  మీ ఉపన్యాసాలకు మెటీరియల్‌ ఎవరు తయారు చేస్తున్నారు?

షర్మిల: మాకో టీమ్‌ ఉందన్నా. కొంత పరిశోధన చేసి... సమాచారం సేకరించి... స్పీచ్‌ రెడీ చేసుకొంటాం. 


ఆర్కే:  కానీ ఇన్ని రోజులైనా జనంలో పట్టున్న నాయకులు ఇంకా మీ దగ్గరకు ఎందుకు రాలేదు? 

షర్మిల: మేము ఎవర్నీ ఆకర్షించే ప్రయత్నం చేయడంలేదు. తెలంగాణ ప్రజలు సరికొత్త సిద్ధాంతాలతో సరికొత్త నాయకత్వాన్ని, రాజకీయాన్నీ కోరుకొంటున్నారు. తరాలు మారుతున్నాయి. 45 శాతం ఓటర్లు 35 ఏళ్ల లోపువారే. అలాంటప్పుడు కొత్త నాయకులు అవసరం. కార్యకర్తల నుంచే నాయకులను ఎన్నుకొంటాం. 


ఆర్కే:  కేసీఆర్‌ ప్రభుత్వ బలం ఏమిటి? వాళ్ల బలహీనతలు ఏమిటి? మీరనుకొనేది కాకుండా జనం ఏమనుకొంటున్నారనేది కూడా తెలుసుకోవాలి కదా! 

షర్మిల: అవును. ఆ దిశగా చాలా ఫీడ్‌బ్యాక్‌ తీసుకొంటున్నాం. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది.


ఆర్కే:  సో... నన్ను నన్నుగా చూడమని చెబుతున్నారు! 

షర్మిల:అంతే. 


ఆర్కే:  జగన్‌పై కేసులు వచ్చే ఏడాదికి కన్‌క్లూజన్‌కు వస్తాయి. ఆయన కన్విక్ట్‌ అవుతాడనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే సీఎం ఎవరు అవుతారు? మీరా? మీ అమ్మగారా? లేక జగన్‌ సతీమణి భారతి గారా? 

షర్మిల:ఒకవేళ ఏ కారణంచేతనైనా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేకపోతే ఆ పార్టీ విధివిధానాలను బట్టి ఆ పార్టీవాళ్లు నిర్ణయించుకొంటారు. 


ఆర్కే:  ప్రాంతీయ పార్టీల్లో విధివిధానాలు ఉంటాయా? 

షర్మిల: ఉండాలన్నా. అదే పద్ధతి. 


ఆర్కే:  ఇవాళ... రేపు జాతీయ స్థాయి పార్టీలే ప్రాంతీయ పార్టీలయ్యాయి. మోదీ, అమిత్‌షాలను కాదని బీజేపీలో, కేసీఆర్‌ని కాదని టీఆర్‌ఎ్‌సలో, చంద్రబాబుని కాదని టీడీపీలో ఎవరూ ఏ నిర్ణయం తీసుకోలేరు కదా!   

షర్మిల: అట్లంటే మీ లెక్క ప్రకారం వైఎస్సార్‌సీపీలో జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించాలి. అంతే కదా!   


ఆర్కే:  అలాంటి నిర్ణయాలు ఒక్కోసారి ఆమోదయోగ్యం కావచ్చు... కాకపోవచ్చు కదా! 

షర్మిల: అవును.  


ఆర్కే:  ఇప్పుడు మీ పార్టీ షర్మిల చుట్టూనే కదా ఉంది! 

షర్మిల: ప్రస్తుతానికి! బట్‌ వియ్‌ నీడ్‌ టు బిల్డ్‌ ఏ టీమ్‌! 


ఆర్కే:  మీ రాజకీయ ప్రస్థానం ప్రోత్సాహకరంగానే ఉందా? 

షర్మిల: యస్‌ అన్నా. లుకింగ్‌ వెరీ బ్రైట్‌. భవిష్యత్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది. 


ఆర్కే:  మీ ఈ ప్రయాణం విజయవంతమవ్వాలని కోరుకొంటూ... థ్యాంక్యూ వెరీమచ్‌! 

షర్మిల: థ్యాంక్యూ అన్నా!