తీరం...ఘోరం

ABN , First Publish Date - 2022-08-13T07:03:39+05:30 IST

ఆర్కే బీచ్‌లో తెల్లగా మెరిసిపోవాల్సిన ఇసుక తిన్నెలు కొద్దిరోజుల నుంచి నల్లని రంగులో కనిపిస్తున్నాయి.

తీరం...ఘోరం

ఆర్కే బీచ్‌లో నల్లగా మారిన ఇసుక తిన్నెలు

మురుగు నీరు కలవడం వల్లే అంటున్న జియాలజీ నిపుణులు


విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):

ఆర్కే బీచ్‌లో తెల్లగా మెరిసిపోవాల్సిన ఇసుక తిన్నెలు కొద్దిరోజుల నుంచి నల్లని రంగులో కనిపిస్తున్నాయి. అలాగే సముద్రంలో నీరు కూడా ఎర్రని రంగులో కానవస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నీరు ఎర్రగా, ఇసుక తిన్నెలు నల్లగా దర్శనమిస్తుండడం సందర్శకుల్లో చర్చనీయాంశమైంది. బీచ్‌లోకి దిగితే చాలు  అరికాళ్లు నల్లగా మారుతున్నాయి. దీంతో చాలామంది బీచ్‌లోకి అడుగు పెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు పలువురు సందర్శకులు ప్రయత్నించినప్పటికీ సమాధానం చెప్పే వాళ్లు లేకపోవడంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.


మార్పుల్లో భాగమేనా....

ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే నిపుణులు కథనం ప్రకారం...సముద్ర తీర ప్రాంతంలో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఈ మార్పుల్లో భాగంగానే అనేకసార్లు సముద్రం ముందుకురావడం, వెనక్కి వెళ్లడం, కొన్నిసార్లు అకస్మాత్తుగా తీరం కోతకు గురికావడం, అక్కడక్కడా గోతులు ఏర్పడడం జరుగుతుంటుంది. సాధారణంగా సముద్రంలో కలిసే మురుగునీరు అడుగు భాగంలోకి చేరుతుంది. తుఫాన్‌ వంటివి వచ్చినప్పుడు, సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు కింద వున్న మురుగుతో కూడిన మట్టి, బంక వంటివి పైకి వస్తాయి. ఈ విధంగా పైకి లేచిన మట్టి, బంక అలల (కరెంట్‌) వల్ల చిలికినట్టు అయి తీరానికి చేరతాయి. ఆ మురుగు కారణంగానే తీరం వెంబడి వున్న ఇసుక తిన్నెలు కూడా నల్లని రంగులోకి మారతాయని ఆంధ్ర విశ్వవిద్యాయలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్‌ ధనుంజయరావు తెలిపారు. ఇక నీటి విషయానికి వస్తే...కొద్దిరోజులు కిందట ఏర్పడిన వాయుగుండాల వల్ల కురిసిన భారీవర్షాలకు నదులకు వరదలు వచ్చాయి. ఆయా నదులు, గోదావరి నుంచి నీళ్లు సముద్రంలో కలిశాయి. సముద్రంలో ఏర్పడిన అలజడి వల్ల గోదావరి, నదుల నుంచి వచ్చి చేరిన నీరు పైకి లేచి అలల్లో కలుస్తోందని, దాంతో ఎర్రని రంగులో కనిపిస్తున్నట్టు ధనుంజయరావు పేర్కొన్నారు. హెవీ మినరల్స్‌ వల్ల కూడా కొన్నిసార్లు తీరం రంగు మారుతుందన్నారు. అయితే ఆర్కే బీచ్‌లో ఈ స్థాయిలో రంగు మారడానికి హెవీ మినరల్స్‌ కారణం కాకపోవచ్చునని, మురుగు అయి వుండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 



Updated Date - 2022-08-13T07:03:39+05:30 IST