నెలాఖరుకు ‘నాడు-నేడు’ పూర్తవ్వాలి

ABN , First Publish Date - 2020-10-23T10:54:38+05:30 IST

పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.

నెలాఖరుకు ‘నాడు-నేడు’ పూర్తవ్వాలి

జనవరి నాటికి పక్కా సీనియారిటీ జాబితా:ఆర్జేడీ  


చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 22: పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులు నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పరిశీలనకు గురువారం జిల్లాకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నిబం ధనల మేరకు నవంబరు రెండో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభిం చాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే బడులు పనిచేస్తాయన్నారు. పాఠశాలల్లో థర్మల్‌ స్కానింగ్‌తోపాటు శానిటైజర్లు ఉంచేలా చర్యలు తీసుకుంటామని.. ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలన్నారు. ఇక పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిర్వహించే ప్రతిసారీ సీనియారిటీ, రోస్టర్‌ జాబితాలో తేడాలు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరినాటికి టీచర్ల సీనియారిటీ జాబితాను పక్కాగా తయారు చేసి, ప్రచురించనున్నట్లు స్పష్టం చేశారు. 



ఆర్జేడీ సమక్షంలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ : టీచర్ల పదోన్నతుల ప్రక్రియలో గందరగోళం, ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. గురువారం జిల్లాకొచ్చిన ఆయన.. సీనియారిటీ జాబితాపై తొలుత విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. మరోవైపు ఉదయం 11 గంటలకు చిత్తూరు షర్మన్‌ పాఠశాలలో ప్రారంభం కా వాల్సిన పదోన్నతుల ప్రక్రియ వివిధ కారణాలతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలు పెట్టారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఆర్జేడీ సమక్షంలో కొనసాగించారు. వివిధ సబ్జెక్టుల ఎస్జీటీ టీచర్లకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. వీరిలో.. సోషియల్‌ స్టడీస్‌ 93 మంది, బయలాజికల్‌ సైన్స్‌ 35 మంది, ఫిజికల్‌ సైన్స్‌ తొమ్మిది మంది, మ్యాథ్స్‌ 18 మంది ఉన్నారు. సోషియల్‌ సబ్జెక్టుకు సంబంధించి చాలా మంది పదోన్నతుల నిరాకరిస్తూ (నాట్‌విల్లింగ్‌) పత్రాలు సమర్పించారు. వీరిస్థానంలో తదుపరి సీనియారిటీ జాబితాలోని టీచర్లకు అవకాశం కల్పించారు. డీఈవో నరసింహారెడ్డి, ఏడీ పురుషోత్తం, ఉపాధ్యాయ సంఘ నేతలు గంటా మోహన్‌, ప్రకాష్‌, గోపినాథ్‌, వినాయకం,రమణ, నాదముని, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి వరకు జరిగిన పదోన్నతుల్లో ఉర్దూ టీచర్ల సీనియారిటీజాబితాలో సమస్యలురావడంతో ఆకేటగిరీని నిలిపేసినట్లు అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2020-10-23T10:54:38+05:30 IST