రీతూ వర్మకు కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్

హీరోయిన్‌ రీతూ వర్మకు టాలీవుడ్‌లో ఓకే గానీ.. కోలీవుడ్‌‌లో మాత్రం పెద్దగా సినీ అవకాశాలు లేవు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో స్పెషల్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ కోలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె టచ్‌లోనే ఉంటుంది. ఇపుడు కోలీవుడ్‌లో హీరో శివకార్తికేయన్‌ సరసన నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రీతూ వర్మ తమిళంలో చివరగా నటించిన చిత్రం ‘కన్నుం కన్నుం కొల్లైయడిత్తాల్‌’. ఇది మంచి విజయం సాధించింది. 


ఆ తర్వాత ఆమె తేని అనే చిత్రంలో హీరో అశోక్‌ సెల్వన్‌తో కలిసి నటించగా ఆ తర్వాత ఆమెకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె శివకార్తికేయన్‌ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. తెలుగులో ఘన విజయం సాధించిన ‘జాతిరత్నాలు’ చిత్రానికి అనుదీప్‌ దర్శకత్వం వహించారు. ఇపుడు ఈయన దర్శకత్వంలో శివకార్తికేయన్‌ ఒక చిత్రంలో నటించనున్నారనీ, ఈ ప్రాజెక్టు కోసం రీతూ వర్మను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో రీతూ వర్మ అభిమానులు సంతోష పడుతున్నారు. ఇదిలావుంటే శివకార్తికేయన్‌ కూడా ‘డాక్టర్‌’ చిత్రంతో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

Advertisement