Abn logo
Oct 28 2020 @ 00:13AM

నాది పులి పంజా!

Kaakateeya

దేనిమీదైనా దృష్టి నిలిపితే దాని అంతు చూడందే వదలని పట్టుదల ఆ ఆడ పులిది. అది కుస్తీ అయినా, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అయినా ప్రత్యర్థి మీదే గురి, గెలుపే లక్ష్యం! ఆమే... ప్రముఖ భారత మహిళా రెజ్లర్‌ రీతూ ఫొగట్‌! కుస్తీ కెరీర్‌ నుంచి మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు మళ్లిన రీతూ, అక్కడ కూడా సత్తా చాటుకుని త్వరలో మరో ధీటైన ప్రత్యర్థితో తలపడబోతోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈనెల 30న, కాంబోడియా క్రీడాకారిణి నౌ శ్రే పొవ్‌ను ఢీకొనబోతున్న రీతూ, సింగపూర్‌ నుంచి నవ్యతో తన క్రీడా విశేషాలను ఇలా పంచుకుంది.క్రీడలకు సరిహద్దులు ఉండవు, ఉండకూడదు. కాబట్టే కుస్తీ నుంచి నేను మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ వైపు మళ్లాను. ఈ భిన్నమైన క్రీడను బాల్యం నుంచీ చూస్తూ వస్తున్నాను. నాకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని తహతహలాడే నైజం నాది. నలుగురిలో ఒకరిలా ఉండడం నాకు నచ్చదు. కాబట్టే రెజ్లింగ్‌లో కొనసాగినా, ఎవరూ దక్కించుకోలేని స్వర్ణ పతకాన్ని దక్కించుకోవాలని తాపత్రయపడేదాన్ని. ఆ లక్ష్యం అందుకున్న తర్వాత నా మనసు మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ మీదకు మళ్లింది. ఈ క్రీడలో మన దేశం నుంచి ఇంతవరకూ ఏ ఒక్క ప్లేయర్‌ కూడా నెగ్గలేదు. ఆ పని నేనే ఎందుకు చేయకూడదు అనిపించింది. అలా కెరీర్‌ను రెజ్లింగ్‌ నుంచి ఎమ్‌.ఎమ్‌.ఎ వైపుకు మలుపు తిప్పాలనే నా ఆలోచనను కుటుంబంతో పంచుకున్నాను. వారి ప్రోత్సాహంతో ఈ క్రీడలో శిక్షణ కోసం ఏడాదిన్నర క్రితమే సింగపూర్‌ వచ్చేశాను. 


గెలుపే నా లక్ష్యం!

ప్రపంచ దేశాలతో సమానంగా మన దేశం కూడా మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో గుర్తింపు తెచ్చుకోవాలన్నది నా ఆకాంక్ష. ఆ గుర్తింపు నా ద్వారా రాగలిగితే నా లక్ష్యం నెరవేరినట్టే! ఇందుకోసం శాయశక్తులా కృషి చేస్తాను. ఇప్పటివరకూ రెండు పోటీల్లో విజయం కూడా సాధించాను. అయితే కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణకు బ్రేక్‌ పడింది. దాంతో మొదట్లో కంగారు పడ్డాను. అక్టోబరు 30న ప్రపంచ ఛాంపియన్‌షి్‌పలో పాల్గొనవలసి ఉంది. నా ప్రత్యర్థి కాంబోడియాకు చెందిన క్రీడాకారిణి నౌ శ్రే పొవ్‌. ఆమె ఎమ్‌.ఎమ్‌.ఎ క్రీడలో దిట్ట. నాకు సమ ఉజ్జీ. ఆమెను ఓడించాలంటే కఠోర శిక్షణతో నాకు నేను మెరుగులు దిద్దుకోక తప్పదు. కాబట్టి లాక్‌డౌన్‌తో శిక్షణా తరగతులకు హాజరు కాలేకపోయినా, ఆన్‌లైన్‌లో కోచ్‌ ద్వారా మెలకువలు ఒంటపట్టించుకున్నాను. ఒకవేళ ఈ పోటీ కుస్తీకి సంబంధించినదైతే నాన్న లేదా అక్కలను సలహాలు అడిగేదాన్ని. కానీ ఈ క్రీడ కొత్తది. నేను కుస్తీ క్రీడాకారిణిని కాబట్టి కేవలం రెజ్లర్‌నే అనే చిన్నచూపు నా ప్రత్యర్థికి ఉండి ఉండవచ్చు. కానీ నేను రెజ్లర్‌నే కాదు, స్టైకర్‌ను కూడా అని నిరూపించాలనే ఆతృతతో ఉన్నాను. నాన్న మాటలే స్ఫూర్తి!

ఒకటి సాధించాలంటే మరొకటి వదులుకోవాలి అని నాన్న మహావీర్‌ సింగ్‌ ఫొగట్‌ చెప్పిన మాటను రోజూ గుర్తు చేసుకుంటాను. లక్ష్యం కోసం స్వదేశాన్ని వదిలి, పరాయి దేశానికి తరలి వచ్చాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు అడ్డుపడినా వెనక్కి తగ్గను. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బందులు పడ్డాను. ఇంటికే పరిమితమై ఒంటరితనాన్ని అనుభవించాను. అయినా కుంగిపోలేదు. ప్రతి రోజూ నాన్న మాటలు గుర్తుచేసుకుని స్ఫూర్తి పొందేదాన్ని. తరగతులకు హాజరయ్యే సమయంలో శిక్షణ ముగించుకుని ఇంటికి వచ్చాక, వంట వండుకునే ఓపిక ఉండేది కాదు. అయినా పౌష్ఠికాహారం తీసుకోక తప్పదు. కాబట్టి బలవర్థకమైన పదార్థాలు ఎంచుకుని వండుకునేదాన్ని. స్వదేశంలో మా ఇంట్లో నాకు ఎటువంటి విటమిన్‌ సప్లిమెంట్ల అవసరం ఉండేది కాదు. ఆహారంతోనే అన్ని పోషకాలు అందేవి. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. కాబట్టి ఆహారంతో పాటు ప్రొటీన్‌, విటమిన్‌ సప్లిమెంట్లు కూడా తీసుకోవడం మొదలుపెట్టాను. వారం మొత్తం కచ్చితమైన డైట్‌ అనుసరించినా, ఆదివారాలు నాకిష్టమైన పాయసం, హల్వాలు వండుకుని తింటూ ఉంటాను. ఇక ప్రతి రంగంలో ఉన్నట్టే దీన్లోనూ మానసిక ఒత్తిడి ఉంటుంది. దీన్ని దూరం చేసుకోవడం కోసం స్ఫూర్తినిచ్చే వీడియోలు చూస్తాను. యోగా, ధ్యానం సాధన చేస్తాను. ఖాళీ ఎరీనాలో పోరు!

కరోనా కారణంగా ఎరీనా నిబంధనలు మారాయి. అక్టోబరు 30న ఛాంపియన్‌షిప్‌ జరగబోయే ఎరీనాలో ప్రేక్షకులు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఈ పోటీని ఆన్‌లైన్‌లోనే వీక్షించవలసి ఉంటుంది. అయితే క్రీడాకారులకు ఈ పరిస్థితి ఒకరకంగా నిరుత్సాహకరమైనదే! ప్రేక్షకుల అరుపులు, చప్పట్లతోనే మా క్రీడాకారుల్లో ఉత్సాహం పెరుగుతుంది. అయితే ఎరీనాలో ప్రేక్షకులు లేకపోవడంలో కూడా ఓ లాభం ఉందని చెప్పాలి. ఎరీనా నిశ్శబ్దంగా ఉంటే, ప్లేయర్లకు కోచ్‌ కంఠం స్పష్టం వినిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కోచ్‌ సూచనలతో క్రీడలో నెగ్గే అవకాశాలూ పెంపొందే వీలూ చిక్కుతుంది. ఖాళీ ఎరీనాతో ఇదొక అడ్వాంటేజ్‌. నిజం చెప్పాలంటే ఒకసారి రింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత చుట్టూ ఏం జరుగుతుందనే పట్టింపు క్రీడాకారులకు ఉండదు. దృష్టి, ఏకాగ్రత ప్రత్యర్థి మీదే ఉంటుంది. కాబట్టి ఎరీనా నిండుగా ఉన్నా, ఖాళీగా ఉన్నా నా మీద పెద్దగా ప్రభావం ఉండదు.


ఒళ్లు గగుర్పొడిచే పోటీ ఇది!

కాంబోడియాకు చెందిన నౌ శ్రే పొవ్‌ ఎన్నో పోటీల్లో నెగ్గింది. అంతటి గొప్ప క్రీడాకారిణితో పోటీ అంటే కచ్చితంగా రోమాలు నిక్కబొడుకునేంత భయానకంగా ఉంటుంది. ఇందుకోసం నేను సర్వసన్నాహాలూ చేసుకున్నాను. శిక్షణలో ఆరితేరాను. పోటీలో నూటికి నూటపది శాతం శక్తియుక్తులు ధారపోస్తాను. పూర్వం రెండు పోటీలు నెగ్గాను కాబట్టి హ్యాట్రిక్‌ సాధించాలనే పట్టుదలతో తలపడబోతున్నాను. భారతదేశం తరఫున ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బెల్ట్‌ సొంతం చేసుకోవాలనేది నా లక్ష్యం. వచ్చే ఏడాది గ్రాండ్‌ ప్రిక్స్‌లో బాడీ వెయిట్‌ కేటగిరీ ప్రకారం ఒకే ఒక మహిళను ప్రపంచ పోటీలకు ఎంపిక చేస్తారు. ఆ ఒక్క మహిళ నేనే కావాలని కోరుకుంటున్నాను. అలా ఎంపిక కావాలంటే ఈ పోటీ నేను కచ్చితంగా నెగ్గి తీరాలి. 


అమ్మాయిలూ రాణించవచ్చు!

క్రీడల్లో రాణించాలనుకునే అమ్మాయిలు వెనకడుగు వేయకూడదు. డాక్టర్‌, ఇంజనీర్‌లాగే క్రీడలనూ కెరీర్‌గా మలచుకోవడానికి అమ్మాయిలు వెనకాడకూడదు. ఈ విషయంలో కుటుంబ ప్రోత్సాహం కూడా ఎంతో అవసరం. పట్టుదల, ఏకాగ్రత, క్రమశిక్షణ ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఎంచుకున్న క్రీడా రంగంలో రాణించడం కోసం అమ్మాయిలు శక్తివంచన లేకుండా కృషి చేయడం అవసరం.


నా బయోపిక్‌లో నేనే!

దంగల్‌ సినిమా మా క్రీడా కుటుంబం బయోపిక్‌ అనే విషయం అందరికీ తెలిసిందే! ఎమ్‌.ఎమ్‌.ఎ ప్రపంచ ఛాంపియన్‌గా నెగ్గి, నా కథ బయోపిక్‌గా రూపొందితే నాకు మరింత ఆనందం! అయితే ఆ సినిమాలో నా పాత్రను నేనే పోషిస్తాను. ఆ పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలుగుతాను. ఈ క్రీడలో పట్లు, మెలకువలు, ఎత్తుగడలు నాకు మాత్రమే తెలుసు. వాటిలో తప్పులు దొర్లకుండా అనుకరించే నైపుణ్యం నాకు మాత్రమే ఉంది. కాబట్టి నా కథ బయోపిక్‌గా రూపొందితే, దాన్లో నేనే నటిస్తాను.


మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే?

ఇదొక హైబ్రీడ్‌ పోరాట క్రీడ! దీన్లో బాక్సింగ్‌, కుస్తీ, జూడో, జుజిట్సు, కరాటే, మూథాయ్‌ (థాయి బాక్సింగ్‌) ఇతర పోరాట విధానాలు కలిసి ఉంటాయి. రీతూ ఫొగట్‌ శిక్షణ పొందుతున్న ఒన్‌ ఛాంపియన్‌షిప్‌ ఆర్గనైజేషన్‌ అందించే శిక్షణల్లో ఎమ్‌.ఎమ్‌.ఎ ఒకటి. ఒన్‌ ఛాంపియన్‌ ప్రపంచంలో అతి పెద్ద మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్గనైజేషన్‌. ఈ సంస్థకు చెందిన శాఖలు సింగపూర్‌, టోక్యో, లాస్‌ ఏంజిల్స్‌, షాంఘై, మిలన్‌, బీజింగ్‌, బ్యాంకాక్‌, మనీలా, జకార్తా, బెంగుళూరుల్లో ఉన్నాయి. 


- గోగుమళ్ల కవిత
Advertisement
Advertisement