ప్రమాదసూచిక

ABN , First Publish Date - 2020-07-17T06:00:57+05:30 IST

టీకావచ్చే దాకా కరోనాతో సహజీవనం చేయవలసిందే- అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించారు. కరోనా దేశంలోకి అప్పుడప్పుడే అడుగుపెడుతున్న...

ప్రమాదసూచిక

టీకావచ్చే దాకా కరోనాతో సహజీవనం చేయవలసిందే- అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఒక కొత్త సత్యాన్ని ఆవిష్కరించారు. కరోనా దేశంలోకి అప్పుడప్పుడే అడుగుపెడుతున్న కాలంలో, ప్రభుత్వాధినేతలు పోటీలు పడి చిట్కావ్యాఖ్యలు చేసినప్పుడు, జగన్ కూడా ‘బ్లీచింగ్ పౌడర్ చికిత్సావిధానంతో’ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి ‘పేరాసెటమాల్’ వ్యాఖ్య ప్రసిద్ధమే. కరోనాకు మందు లేదనీ, మందు కనిపెట్టేవరకు ప్రపంచానికి ఈ బాధలు తప్పవనీ అందరికీ తెలిసిందే. శాశ్వతమయిన, నిలకడయిన ఔషధం దొరికేవరకు, చేతులు ముడుచుకు కూర్చుంటామని అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం కానీ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ అట్లా చేతులు ముడుచుకు కూర్చునిలేవు కూడా. అయితే, ఏదో ఒకటి చేస్తూ ఉండడం, చేస్తున్నట్టు అభినయించడం వేరు, నిజంగా చేయవలసింది చేయడం వేరు. కరోనాను తుడిచిపెట్టలేము కానీ, అది వ్యవహరించే తీరును బట్టి రక్షణ వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ఆ వైరస్ కూడా మనుషులందరినీ ఒకే రకంగా బాధించడం లేదని, దానికొక విధానం ఉన్నదని తెలిసినప్పుడు, ఒక ప్రతివిధానాన్ని రూపొందించుకుంటే, నష్టాన్ని తక్కువలోనే నిలువరించవచ్చు. అనేక ప్రాణాలను కాపాడవచ్చు. ఇన్ని రోజుల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కరోనా గురించి ఎందుకు మాట్లాడారంటే, రోజుకు 30, 40 చొప్పున మరణాలు సంభవిస్తున్నాయి. చాలా పెద్ద సంఖ్య కదా? ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు పరీక్షలు అధికంగా చేస్తూ ఉండవచ్చు, వ్యాధి సోకినవారి ఆనుపానులు, వారి నుంచి సోకే అవకాశం ఉన్నవారు మొదలైన ఆరాలు తీయడం కూడా తెలంగాణ కంటె మెరుగుగా ఉండవచ్చును కానీ, మరణాలేమిటి? ఉన్నట్టుండి సంఖ్య ఇంతగా పెరగడమేమిటి? ప్రమాదసూచిక ఎగురవేయవలసిన సమయం రాలేదా? 


కరోనా వైరస్ కొందరి విషయంలో తీవ్రంగా పనిచేస్తుండడం చూశాము. అప్పటికే కొన్ని వ్యాధులుండడంతో నిరోధకత తగ్గినవారికి, వయస్సు మీరిన వారికి కరోనాను ఎదుర్కొనగలిగే శక్తి ఉండదని శాస్త్రవేత్తలు గమనించారు, హెచ్చరించారు. ఆ సూత్రానికి భిన్నంగా కూడా అప్పుడప్పుడు వ్యాధి వ్యవహరిస్తున్నది. యువకులను, ఏ పూర్వవ్యాధులు లేనివారిని కూడా కబళిస్తున్నది. ఒక్కోసారి, అతి వేగంగా తీవ్రత పెరిగి, ప్రాణాలు పోతున్నాయి. ఈ సందర్భాలకు తోడు, సకాలంలో వైద్య సహాయం అందకపోవడం కూడా జరిగితే మరణాలు పెరుగుతాయి. పూర్తి కట్టడులు చేయడం వల్ల ఆర్థిక రంగం దెబ్బతినే మాట నిజమే కానీ, ఏదో ఒక స్థాయిలో వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి, కనీస స్థాయిలో ఉంచడానికి క్రియాశీల చర్యలు అవసరం. తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా, సకాలంలో వైద్య సహాయం అందకపోవడం, ప్రభుత్వ వైద్యం మీద అవిశ్వాసంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ప్రవేశం దొరకక భంగపడడం, ఆక్సిజన్ అందక ప్రాణాలు పోవడం చూస్తున్నాము. ఇటువంటి వాటిని నివారించడం మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. తిరుమల దేవస్థానంలో దర్శనాలను అనుమతించడం విషయంలో ప్రభుత్వం తొందరపడిందన్న విమర్శలు ఉన్నాయి. తిరుమల ఉద్యోగులనేకులకు కరోనా సోకినప్పటికీ, యాత్రికులకు ఎవరికీ సోకలేదని టిటిడి మొండిగా వాదిస్తున్నది. తిరుమల దర్శనాలు చేసుకున్నవారు కరోనా బయటపడే దాకా, పరీక్షలు జరిగి పాజిటివ్ అని తెలిసేదాకా అక్కడే ఉంటారా? దేవస్థానం ఉద్యోగులలో అంతమందికి వ్యాధి వ్యాపించినప్పుడు, దర్శనాలను కనీసం తగ్గించడమైనా చేయడానికి ఎందుకు వ్యతిరేకత? 


తెలంగాణలో కరోనా నిర్వహణ లోపభూయిష్ఠంగా ఉన్నదని విమర్శలు వచ్చినప్పుడు, దాన్ని గిట్టనివారి ప్రచారంగా కొట్టిపారేసిన ప్రభుత్వవాదులు, ఇప్పుడు ఆరోగ్య రంగానికి సంబంధించిన ఇద్దరు ముఖ్య అధికారులను ఎందుకు బదిలీ చేసినట్టో చెప్పాలి. నిజానికి, కనిపిస్తున్న వైఫల్యానికి ఇద్దరు అధికారులను బాధ్యులను చేయడం నెపాన్ని పరులపై నెట్టివేసి, చేతులు దులుపుకోవడమే. అసలు సమస్య, విధానంలో లేదా విధాన రాహిత్యంలో ఉన్నది. నాయకత్వ స్థానం శూన్యంగా ఉంటూ, ఎటువంటి మార్గదర్శనం, నాయకత్వం అందించకుండా ఉండడం ఒక సమస్య అయితే, ఎవరైనా చొరవ తీసుకుని చురుకుగా పనిచేయడానికి సంకోచపడే వాతావరణం ఉండడం మరొక సమస్య. తమ వేదనను సెల్ఫీ విడియో ద్వారా వ్యక్తం చేసి, ఆ తరువాత మరణించిన కరోనా రోగులు పెరిగిపోతున్నారు. మరణవాంగ్మూలానికి ఎంత విలువ ఉంటుందో, వారి ఆవేదనకూ అంత విలువ ఇవ్వాలి. తాజాగా గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించనందువల్ల జరిగిన మరణాన్ని నర్సుల సమ్మె వల్ల జరిగిందన్నట్టుగా అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. నర్సుల సమ్మె విషయంలో చొరవ తీసుకోనందునే ఒక అధికారి బదిలీ జరిగిందని అంటున్నారు. ఈ విషయాలలో, పై స్థాయి అధికారులు, రాజకీయ నాయకత్వం సత్వరం స్పందించి, శీఘ్ర నిర్ణయాలు తీసుకుని ఇంటే ఈ సమస్యలు వచ్చేవా? ఉస్మానియా ఆస్పత్రి దయనీయ స్థితిలో ఉండడాన్ని, వర్షపునీటిలో రోగుల వార్డు మునిగిపోవడాన్ని ఏమనుకోవాలి? ఉస్మానియా ఆస్పత్రి వారసత్వ భవనాన్ని పరిరక్షించాలన్నారు కానీ, శిథిల భవనంలోనే ఆస్పత్రి కొనసాగించాలని ఎవరన్నా డిమాండ్ చేశారా? ఇంతకాలం ఎందుకు మరో ప్రత్యామ్నాయం చూడలేదు? లేదా మరమ్మత్తుల సాధ్యాసాధ్యాలను ఎందుకు యోచించలేదు? 500 కోట్లతో సెక్రటేరియట్, మరో 450 కోట్లతో కొత్త ఫ్లైఓవర్లు ప్రకటించిన ప్రభుత్వం ఆరోగ్య ఆపత్కాలంలో, కొత్త ఆస్పత్రి నిర్మాణాల గురించి ఎందుకు పథక రచన చేయదు? 


దేశంలోని కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే, తెలుగు రాష్ట్రాల పరిస్థితి మెరుగుగా కనిపించవచ్చు. గణాంకాలు ప్రమాదకరంగా తోచకపోవచ్చు. కానీ, పరిస్థితికి గతిశీలతను జోడించి చూడాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మనమూ ప్రమాదంలో పడతాము. వ్యాప్తిరేటు విపరీతంగా ఉంటున్నది. ప్రాణనష్టం పెరుగుతున్నది. వైద్య ఆరోగ్య యంత్రాంగం స్పందనశీలత పెరగడం లేదు. ప్రభుత్వపరంగా ఉదాసీనత కనిపిస్తున్నది. సొంతంగా ఒక విధానం అంటూ కనిపించడం లేదు. ఒకవేళ విధానం అంటూ ఉంటే గనుక, దాన్ని రహస్యంగా ఉంచడం కాక, ప్రజలతో పంచుకోవలసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో అనేక చోట్ల పాక్షిక లాక్‌డౌన్‌లు అమలుజరుగుతున్నాయి. మరో లాక్‌డౌన్‌ గురించి నాలుగురోజుల్లో నిర్ణయం అని చెప్పిన తెలంగాణ సిఎం, ఇప్పటి వరకు ఆ ఊసే తీయడం లేదు. మరోవైపు హైదరాబాద్‌లో కరోనా కార్చిచ్చులాగా వ్యాపిస్తున్నది. ఎప్పుడు మేలుకుంటారు మరి?

Updated Date - 2020-07-17T06:00:57+05:30 IST