Abn logo
Sep 17 2020 @ 05:15AM

ఉరకలెత్తుతున్న ప్రాజెక్టులు

ఎల్‌ఎండీలోకి 52,809 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

16 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల 


ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. భారీగా ఇన్‌ఫ్లో వస్తుండడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


తిమ్మాపూర్‌, సెప్టెంబరు 16: కరీంనగర్‌ సమీపంలోని దిగువ మానేరు రిజర్వాయర్‌లోని 52,809 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో  ప్రాజెక్టు ఎనిమిది గేట్లను మూడు ఫీట్లు,  మరో ఎనిమిది గేట్లను ఒక ఫీట్‌ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండి పూర్తి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రం 23.602 టీఎంసీల నిల్వ ఉంది. డ్యాం గేట్ల ద్వారా 50 వేలు, కాకతీయ కాలువ ద్వారా 2500 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు  నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శివకుమార్‌ తెలిపారు. 


శ్రీరాంసాగర్‌ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

జగిత్యాల: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు వస్తుంది. బుధవారం ఉదయం ప్రాజెక్ట్‌లోకి 2,21,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 40 గేట్లు ఎత్తి గోదావరిలోకి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.  సాయంత్రం ఐదు గంటలకు  ఇన్‌ఫ్లో 96,013 క్యూసెక్కులకు తగ్గడంతో అధికారులు ప్రాజెక్ట్‌ 24 గేట్లు ఎత్తి గోదావరిలోకి 75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  కాకతీయ కాలువ ద్వారా 1000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువకు నీటి విడుదలను పూర్తిగా నిలివేశారు.  ప్రాజెక్ట్‌ నీటిమట్టం 90.31 టీఎంసీలుగా ఉంది. 


శ్రీపాద ఎల్లంపల్లికి పోటెత్తిన వరద

పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద పోటెత్తుతున్నది. బుధవారం ఉదయం నుంచి ప్రాజెక్టుకులో క్రమంగా వరద పెరగుతూ వస్తున్నది. సాయంత్రం ఆరు గంటల వరకు ప్రాజెక్టులోకి 4 లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 28 గేట్లు ఎత్తి దిగువకు 4.20 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. దిగువన పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద గల పార్వతి బ్యారేజీ నుంచి 60 గేట్ల ద్వారా 4,21,525 క్యూసెక్కులకు పైగా నీటిని వదిలిపెడుతున్నారు. గోదావరి తీర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. 


ఎస్సారార్‌ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

బోయినపల్లి, సెప్టెంబరు 16: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద కాలువ ద్వారా ప్రాజెక్ట్‌లోకి 4,080 క్యూసెక్కులు, మానేరు, మూలవాగు ద్వారా 2,943 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.  ప్రాజెక్ట్‌ నుంచి దిగువన ఉన్న లోయర్‌ మానేరు డ్యాంకు ఆరు గేట్ల ద్వారా 19,060 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.   ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లకు 317.22 మీటర్లకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు  25.55 టీఎంసీలకే చేరింది.  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో  శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్‌లోకి భారీ మొత్తంలో నీరు చేరి జలదృశ్యం ఆవిష్కృతమైంది.  రాత్రివేళల్లో  విద్యుద్దీపాల వెలుతురులో  నీళ్లు తరళి వెళుతున్న దృశ్యం చూపరులను కనువిందు చేస్తోది. 

Advertisement
Advertisement