ప్రసవ వేదన!

ABN , First Publish Date - 2021-10-03T05:09:11+05:30 IST

ప్రసవ వేదన!

ప్రసవ వేదన!

- పెరుగుతున్న మాతా, శిశు మరణాలు 

- రక్తహీనత, పౌష్టికాహార లోపమే ప్రధాన కారణం

- ఆస్పత్రుల్లో ప్రసూతి వైద్య నిపుణుల కొరత

- ప్రైవేటు వైద్యమే దిక్కు

(మెళియాపుట్టి)

- గత నెల 10న మెళియాపుట్టి మండలం పట్టుపురం గ్రామానికి చెందిన ధనలక్ష్మి పురిటి నొప్పులతో బాధ పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

- గత నెల 17న దీనబంధుపురం గ్రామానికి చెందిన ఈశ్వరి అనే మహిళకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స చేసి ప్రసవం చేయించారు. కానీ అధికంగా రక్తస్రావమవడంతో ఈశ్వరి కోమాలోకి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తరువాత ఆమె కన్ను మూసింది. 

- ఇలా మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 23 మంది వరకూ జిల్లాలో మాతృ మరణాలు సంభవించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా లెక్కలోకి రానివి చాలా ఉన్నాయి. మాతా శిశు మరణాలు తగ్గాయని ఒకవైపు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. 2019-20లో 23 మాతృమరణాలు, 428 శిశు మరణాలు సంభవించాయి. 2020-21లో 25 మాతృ, 376 శిశు, ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకూ 23 మంది మాతృమూర్తులు, 60 మంది శిశువులు మృత్యువాత పడ్డారు. మాతా శిశు మరణాల నియంత్రణకు  ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ పౌష్టికాహార లోపం వల్లే మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణుల్లో రక్తం తక్కువగా ఉండడం, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రసవం సమయంలో మాతృ మరణాలకు కారణాలుగా చెబుతున్నారు. 


వసతులు అంతంతమాత్రం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ అక్కడ వసతులు అంతంతమాత్రమే. పీహెచ్‌సీ, సీహెచ్‌సీల్లో ప్రసూతి వైద్య నిపుణులు పూర్తిస్థాయిలో లేరు. ఉన్న కొద్ది మంది డిప్యూటేషన్లపై సాగుతున్నారు. దీనికితోడు అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండరు. అటువంటి సందర్భాల్లో పై ఆస్పత్రులకు రిఫర్‌ చేస్తున్నారు. సమయాభావం వల్ల సకాలంలో వైద్యం అందక చాలా మంది గర్భిణులు మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా మారుమూల మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. మరోవైపు గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేక ఆహారం సక్రమంగా అందడం లేదు. అవగాహన లేక చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గిరిజన, కొండ శిఖర గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. 108 వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అటువంటి సమయాల్లో గిరిజనులకు డోలీయే గతి అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో సకాలంలో వైద్యం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా మాతా శిశు మరణాల నియంత్రణపై వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది. 


రక్తహీనత వల్లే..

రక్తహీనత వల్లే ఎక్కువగా ప్రసవ సమయంలో మరణాలు సంభవిస్తున్నాయి. రక్తం తక్కువగా ఉంటే ప్రసవం సమయంలో  అధికంగా రక్తస్రావమవుతుంది. అంత త్వరగా నియంత్రణలోకి రాదు. అందుకే గర్భిణులు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేసుకోవాలి. రక్తం తక్కువగా ఉంటే పౌష్టికాహారం తీసుకోవాలి.  

- జి.గణపతిరావు, వైద్యాధికారి, చాపర


పోర్టల్‌లో గర్భిణుల వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సిందే

- డీఎంహెచ్‌ఓ చంద్రానాయక్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 2 : జిల్లాలోని గర్భిణుల అందరి వివరాలు పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందేనని డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌ వైద్యసిబ్బందికి ఆదేశించారు. శనివారం జిల్లాలో వైద్యఆరోగ్యశాఖకు సంబంధించిన ప్రోగ్రాం అధికారులతో డీఎంహెచ్‌ఓ తన కార్యాలయం నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శిశువు జన్మించిన వెంటనే బీసీజీ, హెపటైటిస్‌-బి, ఓపీవీ టీకాలు వేయాలి. ఈ నెల 15 వరకు టీకా వారోత్సవాలు నిర్వహిస్తాం. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలోకి తీసుకువచ్చేందుకు సిబ్బంది ప్రయత్నించాలి. గర్భిణులకు 4, 6 నెలల్లో ఐరన్‌ మాత్రలు యథావిధిగా పంపిణీ చేయాలి. మాతా, శిశు మరణాలు సంభవించకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలి’ అని తెలిపారు. ఏడీఎంహెచ్‌వో జగన్నాథరావు మాట్లాడుతూ స్కానింగ్‌ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీటీసీవో అనూరాధ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రామారెడ్డి, డీఐఓ అప్పారావు, డెమో పైడి వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-03T05:09:11+05:30 IST