Abn logo
Jul 29 2021 @ 00:30AM

కారెక్కుతున్న నేతలు

కాంగ్రెస్‌, బీజేపీ నుంచి వలసలు

30న పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిక

అదే బాటలో కాంగ్రెస్‌ నేత స్వర్గం రవి


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండాను ఎగురువేయాలని టీఆర్‌ఎస్‌ ఉవ్విళ్లూరుతోంది. ఆకర్ష్‌ వలలు విసిరి కాంగ్రెస్‌, బీజేపీని కకావికలం చేస్తూ స్థానిక సంస్థల ప్రజానిధులు పార్టీనే అంటి పెట్టుకుని ఉండేలా చూసుకుంటూ ఎన్నికలను వ్యూహరచన చేస్తున్నది. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పాదయాత్రను ప్రారంభించి గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయన వెంట ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు ఎవరు లేకుండా చూసుకోవడంలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. ఈటలకు అండగా నిలిచి ఆయన వెంట బీజేపీలోకి వెళ్లిన వారందరినీ తిరిగి పాత గూటికి చేరుకునేలా చూడడంలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సఫలమయింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌ విజయం సాధించడం ద్వారా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయ పార్టీగా చాటుకోబోతున్నామని బీజేపీ ఢంకా భజాయించి చెబుతుండగా ఆ పార్టీ నుంచి కూడా టీఆర్‌ఎస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. 


పకడ్బందీ ప్రణాళిక

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గ బాధ్యతలను హరీశ్‌రావుకు అప్పగించారు. ఆయన నెల రోజులుగా హైదరాబాద్‌, సిద్దిపేట కేంద్రంగా నిత్యం హుజూరాబాద్‌ ప్రాంత నాయకులతో మాట్లాడుతూ అవసరమున్నవారిని పిలిపించుకుంటూ విజయానికి పకడ్బందీగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంగుల కమలాకర్‌ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ స్థానిక నాయకులందరికి భరోసా నిస్తూ ఈటలను ఏకాకిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అటు కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ వ్యూహరచన చేస్తుండగా, క్షేత్ర స్థాయిలో అధిష్ఠానం వ్యూహాలను ఆచరణలో పెడుతూ మంత్రి గంగుల కమలాకర్‌ పార్టీ శ్రేణులను సమన్వయ పరుస్తున్నారు. 


ఒంటరవుతున్న ఈటల

ఈటల రాజేందర్‌ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులెవరు లేకుండాపోయి ఒంటరవుతున్నారు. ప్రజలపైనే నమ్మకాన్ని పెట్టుకొని  బీజేపీ, టీఆర్‌ఎస్‌లోని యువ శ్రేణులు వెంటరాగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మాత్రం రోజు రోజుకు నియోజకవర్గంపై తమ పట్టు బిగించేందుకు గట్టిగా కృషి చేస్తున్నది. ప్రధానంగా అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే ఆ పార్టీ అన్ని ఏర్పాట్లను చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీలను నిర్వీర్యపర్చడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 


ఒక్కొక్కరుగా.. వలస బాటలో..

మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు పెద్దిరెడ్డి, ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకున్న నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి చర్చించిన అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. మొదట్లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరినా టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని, కాకపోతే హుజూరాబాద్‌ ఎన్నికలలో క్రియాశీల బాధ్యతను ఆయనకు అప్పగిస్తారని తెలుస్తున్నది. 


వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన హుజూరాబాద్‌, రామగుండం నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. పెద్దిరెడ్డి గురువారం హుజూరాబాద్‌కు వచ్చి తన మద్దతుదారులతో మాట్లాడి వారందరితో కలిసి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ, బీజేవైఎం సభ్యులు పెద్దిరెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరతారని చెబుతున్నారు. పోరెడ్డి కిషన్‌రెడ్డి ఇప్పటికే ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. 


కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నాయకుడు, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి స్వర్గం రవి టీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని తేలిపోయింది. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అనుమతిని, ఆశీర్వాదాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా, పారిశ్రామికవేత్తగా, పద్మశాలి సంఘ నాయకుడిగా పేరున్న ఆయన ప్రస్తుతం హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఆయనకు ఆ మేరకు హామీ లభించిందని కూడా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్నా పార్టీ నేతలు దానిని ధ్రువీకరించడం లేదు. బీసీకి టికెట్‌ ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తే పరిశీలనలో ఉన్న మూడు, నాలుగురిలో ఆయన పేరు కూడా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

 

ఈటల రాజేందర్‌కు అండగా ఉంటూ టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరి ఆయన వెన్నంటి ఉన్న ఇల్లందకుంట రామాలయ కమిటీ మాజీ చైర్మన్‌, జమ్మికుంట మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ స్వప్న భర్త దేశిని కోటి రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హుజూరాబాద్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలో కోటితో మంతనాలు జరిపి ఆయనను, ఆయన భార్యను తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు బాటలు వేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, దేశిని కోటి ఇద్దరి మధ్య సమీప బంధుత్వం ఉండడంతో ఆయన బంధువుల ఒత్తిడి మేరకు టీఆర్‌ఎస్‌లో చేరారని తెలిసింది. 


అంతకుముందే జమ్మికుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాజీ తుమ్మేటి సమ్మిరెడ్డి బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. 


కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్‌ ఆశిస్తున్న విషయం తెలిసిందే. 

 

రెడ్డి, బీసీ వర్గాల్లో ఎవరో ఒకరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిత్వం లభిస్తుందని ప్రచారం జరుగుతుండగా దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నందున దళితులకు అవకాశం కల్పించాలని కోరుతూ కొందరూ ప్రజా సంఘాల జేఏసీ గజ్జెల కాంతం పేరును తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రిని కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


ఎవరి ధీమా వారిది..

అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పక్కనబెట్టి పార్టీ విజయానికి పకడ్బందీ బాటలు వేయడంలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిమగ్నమయింది. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఇద్దరికి పరాజయాన్ని చవిచూపి వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అని చెప్పుకోవడానికి టీఆర్‌ఎస్‌ అన్ని రకాల ప్రయత్నాలను ప్రారంభించింది. బీజేపీ మాత్రం ఈటలపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న సానుభూతిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వలసలను ప్రోత్సహిస్తూ నాయకులను ప్రలోభ పెడుతున్నారని విమర్శిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ విజయం సాధిస్తామని ఆ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్‌ హుజూరాబాద్‌ ఎన్నికల ఇన్‌చార్జి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభ్యర్థి విషయంలో పార్టీ శ్రేణులు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ఇక్కడ ఎప్పుడు ఉప ఎన్నిక జరుగుతుందన్న విషయాన్ని ప్రకటించలేదు. అయినా ఈటల రాజీనామా చేసిన నాటి నుంచి నియోజకవర్గంలో రోజురోజుకూ ఎన్నికల రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి.