Rishi Sunak: భార్యపై రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్య.. ఈ పొట్టివాడి కోసం హై హీల్స్ త్యాగం చేశావంటూ..

ABN , First Publish Date - 2022-09-01T21:56:39+05:30 IST

బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak).. తన తల్లిదండ్రుల స్ఫూర్తితోనే ప్రజాజీవితంలో కాలుపెట్టానని చెప్పారు.

Rishi Sunak: భార్యపై రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్య..  ఈ పొట్టివాడి కోసం హై హీల్స్ త్యాగం చేశావంటూ..

ఎన్నారై డెస్క్: తన తల్లిదండ్రుల స్ఫూర్తితోనే ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని.. బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) చెప్పారు. అంతేకాకుండా.. తన భార్య అక్షత మూర్తిపై కూడా ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం లండన్‌లో(London) రిషి భారీ ప్రచార సభ నిర్వహించారు. ఈ సభకు ఆయన మద్దతుదారులు పోటెత్తారు. రేసులో రిషి వెనకబడ్డారన్న అంచనాల నడుమ.. సభలో ఆయనపై ప్రజాభిమానం వెల్లువెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా రిషి భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ సభకు రిషి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. 


‘‘ఈ చివరి విడత ఎన్నికల ప్రచారం నాకెంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే.. మా అమ్మా నాన్న కూడా ఈ రోజు సభకు వచ్చారు. వారి స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లోకి అడుగుపెట్టా.’’ అంటూ రిషి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తనకు మంచి జీవితం ఇచ్చేందుకు తన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేయడం, ఆత్మవిశ్వాసం, కుటుంబం పట్ల ప్రేమానురాగాలు కలిగిన వారు జీవితంలో సాధించలేనిది ఏదీ లేదన్న విషయాన్ని తన తల్లిదండ్రులు నేర్పించారని రిషి సునాక్ చెప్పుకొచ్చారు. 


ప్రజాజీవితంలో నిత్యం బిజీగా ఉండే తనకు తోడుగా నిలుస్తున్న భార్య అక్షతామూర్తిపై(Akshata murthy) కూడా రిషి ప్రశంసల వర్షం కురిపించారు. తన జీవితంలో అక్షతామూర్తికి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్నారు. 18 ఏళ్ల క్రితం తనపై నమ్మకంతో అక్షత తన వెంట నడిచేందుకు నిర్ణయించుకుందన్నారు. ‘‘ఈ పొట్టి కుర్రాడి కోసం అప్పట్లో నువ్వు హైహీల్స్ వేసుకోవడం మానేశావు’’ అంటూ తను ప్రేమలో పడ్డ తొలిరోజులను గుర్తు చేసుకున్నారు. బ్రిటన్ ప్రధాని రేసులో పాల్గొంటున్న తాను ఓ భర్తగా, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేకపోయానని కూడా రిషి చెప్పుకొచ్చారు. అయితే.. ప్రజలకు సేవచేయడమనేది తనకు దక్కిన అమూల్యమైన అవకాశంగా అభివర్ణించారు. కుటుంబం తనకు దేవుడిచ్చిన వరమని వ్యాఖ్యానించారు. ఇక రిషి సునాక్ తండ్రి యశ్వీర్.. వైద్యుడు కాగా, తల్లి ఉష ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. తమ కోడలు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతామూర్తితో కలిసి వారిద్దరూ ముందువరుసలో కూర్చని రిషి సునాక్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. 


ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల ప్రచారం(Final Hustings) చివరి అంకానికి చేరుకుంది. ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్.. ఆయన ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్(Lizz truss) పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు కన్సర్వేటివ్ పార్టీ నేతలు బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచే వ్యక్తే కన్సర్వేటివ్ పార్టీనీ ముందుండి నడిపిస్తారు. 

Updated Date - 2022-09-01T21:56:39+05:30 IST