Britain PM Election : కీలక చర్చలో లిజ్‌ ట్రుస్‌పై రుషి సునక్ గెలుపు

ABN , First Publish Date - 2022-08-05T16:42:00+05:30 IST

బ్రిటన్ (Britain) ప్రధాన మంత్రి పదవి కోసం రుషి సునక్ (Rishi Sunak),

Britain PM Election : కీలక చర్చలో లిజ్‌ ట్రుస్‌పై రుషి సునక్ గెలుపు

లండన్ : బ్రిటన్ (Britain) ప్రధాన మంత్రి పదవి కోసం రుషి సునక్ (Rishi Sunak), లిజ్ ట్రుస్ (Liz Truss)  మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ పోరులో ముందు వరుసలో ఉన్న లిజ్ ట్రుస్‌పై రుషి ఓ చర్చలో అనూహ్య విజయం సాధించారు. అయితే కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓట్లు ట్రుస్‌కు అనుకూలంగా పడతాయని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నాయి. మరోవైపు ఈ చర్చలో పాల్గొన్న ప్రేక్షకుల్లో అత్యధికులు రుషికి మద్దతు పలికారు. 


గురువారం జరిగిన స్కై న్యూస్ (Sky News) డిబేట్‌లో పాల్గొన్న ప్రేక్షకుల్లో అత్యధికులు రుషి సునక్‌కు మద్దతు పలికారు. ఒపీనియన్ పోల్స్‌లో కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) సభ్యుల మద్దతు అత్యధికంగా లిజ్ ట్రుస్‌కు ఉంటుందని వెల్లడైంది. ఈ చర్చను నిర్వహించిన కే బర్లీ అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలను లిజ్ ట్రుస్‌కు సంధించారు. ఆమె విధానాలపరమైన నిర్ణయాల్లో యూ-టర్న్ తీసుకోవడంపై కూడా నిలదీశారు. ‘‘ఈసారి అయినా మీరు చెప్పినదానికి కట్టుబడి ఉంటారా?’’ అని అడిగారు. 


లిజ్ ట్రుస్ ప్రచార బృందం సోమవారం ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆమెకు నష్టం కలిగించే విధంగా ఉంది. లండన్ వెలుపల నివసించే పబ్లిక్ సెక్టర్ వర్కర్లకు తక్కువ జీతాలు చెల్లించి ఉంటే, సంవత్సరానికి 10.75 బిలియన్ల డాలర్లు ప్రభుత్వానికి ఆదా అయి ఉండేదని ఈ స్టేట్‌మెంట్ పేర్కొంది. ఈ విషయంలో కూడా లిజ్ ట్రుస్ యూ-టర్న్ తీసుకున్నారు. 


బర్లీ మాట్లాడుతూ, ‘‘లండన్ వెలుపలి ప్రాంతాల్లో ఉంటున్న సివిల్ సర్వెంట్ల జీతాలను తగ్గించాలని మీరు అనుకున్నారు. ఆ తర్వాత అదేమీ లేదని చెప్పారు’’ అని లిజ్ ట్రుస్ యూ-టర్న్‌లను ఏకరువు పెట్టారు. తన ప్రతిపాదనను మీడియా వక్రీకరించిందని లిజ్ ఆరోపించారు. 


బర్లీ మాట్లాడుతూ, ‘‘మంచి నాయకులు తమ పొరపాట్లను అంగీకరించాలా? ఇతరులను నిందించాలా?’’ అని అడిగారు. అందుకు లిజ్ బదులిస్తూ, ‘‘నేను ఎవరినీ నిందించడం లేదు. నేను చెప్పిన విధానాన్ని వివిధ వర్గాలవారు వక్రీకరించారు’’ అని చెప్పారు. 


రష్యా-ఉక్రెయిన్ యుద్దంలో ఉక్రెయిన్ తరపున బ్రిటన్ పోరాడాలని చెప్పి, ఆ మాటను ఎందుకు వెనుకకు తీసుకున్నారని బర్లీ అడిగారు. బ్రిటిషర్లు ఉక్రెయిన్‌కు వెళ్లొద్దని ట్రావెల్ అడ్వయిజరీ ఇచ్చామని లిజ్ చెప్పారు. మోనార్కీని నిషేధించాలని అన్నారని, ఆ విషయంలోనూ యూ-టర్న్ తీసుకున్నారని నిలదీశారు. 


బర్లీ నుంచి రుషి సునక్ కూడా సంక్లిష్ట ప్రశ్నలను ఎదుర్కొన్నారు. డిజైనర్ లోఫర్స్‌ను ఆయన ఇష్టపడటంపై కూడా కఠినమైన ప్రశ్న ఎదురైంది. ‘‘తమ కష్టసుఖాలను మీరు అర్థం చేసుకోలేరని ప్రజలు భావిస్తున్నారు’’ అని బర్లీ అడిగారు. ఖరీదైన చెప్పులు వాడతారని, సాధారణ చెప్పులతో కనీసం ఓ మైలు అయినా నడవలేరని అంటున్నారని తెలిపారు. దీనికి రుషి బదులిస్తూ, తాను ఎన్‌హెచ్ఎస్ కుటుంబంలో పెరిగానన్నారు. ఈ విషయం తన ప్రచారంలో వినే ఉంటారని తెలిపారు. 


ఈ చర్చను చూస్తున్న ప్రేక్షకుల అభిప్రాయాన్ని కోరినపుడు లిజ్ ట్రుస్ కన్నా ఎక్కువ మంది రుషి సునక్‌కు మద్దతుగా చేతులు ఎత్తారు. దీనిపై బర్లీ స్పందిస్తూ, తాను దీనిని ఊహించలేదన్నారు. 


బోరిస్ జాన్సన్ స్థానంలో బ్రిటన్ ప్రధాన మంత్రి ఎవరో సెప్టెంబరు 5న వెల్లడవుతుంది. 


Updated Date - 2022-08-05T16:42:00+05:30 IST