రిషికి బ్రిటన్ ప్రజల మద్దతు.. తాజా సర్వేలో వెల్లడి

ABN , First Publish Date - 2022-07-18T00:29:18+05:30 IST

గత ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి ఓటు వేసిన బ్రిటన్ ప్రజల్లో దాదాపు సగం మంది.. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

రిషికి బ్రిటన్ ప్రజల మద్దతు.. తాజా సర్వేలో వెల్లడి

ఎన్నారై డెస్క్: గత ఎన్నికల్లో అధికార కన్సర్వేటివ్ పార్టీకి ఓటు వేసిన బ్రిటన్ ప్రజల్లో దాదాపు సగం మంది.. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రధాని పదవికి బోరిన్ జాన్సన్ రాజీనామా నేపథ్యంలో కన్సర్వేటివ్ పార్టీ.. మరోనేతను ప్రధానిగా ఎన్నుకోబోతున్న విషయం తెలసిందే. ఈ పోటీలో భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్ ముందు వరుసలో ఉన్నారు. పార్టీ నేతల మద్దతు కూడగట్టడంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో ఆయనకున్న పాపులారిటీ తాజా సర్వేలో బయటపడింది. జేఎల్ పార్ట్‌నర్స్ ఈ సర్వేను నిర్వహించినట్టు ది సండే టెలిగ్రాఫ్ పత్రిక తాజాగా వెల్లడించింది. సర్వేలో మొత్తం 4400 మంది బ్రిటన్ ఓటర్లు పాల్గొన్నారు. 2019 నాటి ఎన్నికల్లో వీరందరూ కన్సర్వేటివ్ పార్టీకే ఓటు వేశారు. వీరిలో 48 శాతం మంది రిషికి మద్దతు తెలిపారు. బ్రిటన్‌కు ఆయనే ప్రధాని కావాలని కోరుకున్నారు. 


ఇక.. ప్రధాని రేసులో రిషితో పోటీ పడుతున్న ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్‌కు 39 శాతం మంది మద్దతు తెలిపారు.  సర్వేలో మూడో స్థానంలో నిలిచిన వాణిజ్య మంత్రి పెన్నీ మార్డాంట్‌కు 33 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.  ‘‘సునాక్ విషయంలో బ్రిటన్ ప్రజల్లో బలమైన అభిప్రాయాలే నెలకొన్నాయి. మూడో వంతు మంది రిషి వెంటే ఉండగా.. మరో మూడో వంతు మంది ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో అత్యధికులు ఇతర నేతల పట్ల అయిష్టతనే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రిషి సాధించిన స్కోర్.. ఆయన పాపులారిటీని సూచిస్తోంది’’ అని జేఎల్ పార్ట్‌నర్స్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ జాన్సన్ తెలిపారు. మరోవైపు.. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు.. దేశ ఆర్థికవ్యవస్థ మళ్లీ గాడిలో పడాలని ఆశించారు. బ్రిటన్ ప్రజారోగ్య వ్యవస్థకు కీలకమైన నేషనల్ హెల్త్ సర్వీసెస్‌ను చక్కదిద్దాలనీ కోరుకున్నారు. పన్నులను తగ్గించాలంటూ మొత్తం ఓటర్లలో 38 శాతం మంది, కన్సర్వేటివ్ పార్టీ మద్దతుదారుల్లో 40 శాతం మంది కోరుకున్నారు. 

Updated Date - 2022-07-18T00:29:18+05:30 IST