Rishi Sunak: నేను ప్రధాని అయితే.. మొదటి రోజునే.. రిషి సునాక్ కీలక వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-07-26T03:22:53+05:30 IST

తాను బ్రిటన్ ప్రధాని అయితే చైనాపై కఠిన వైఖరి అవలంభిస్తానని భారత సంతతి బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ తాజాగా వ్యాఖ్యానించారు.

Rishi Sunak: నేను ప్రధాని అయితే.. మొదటి రోజునే..  రిషి సునాక్ కీలక వ్యాఖ్య

ఎన్నారై డెస్క్: తాను బ్రిటన్ ప్రధాని(Britain PM) అయితే చైనాపై కఠిన వైఖరి అవలంభిస్తానని భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) తాజాగా వ్యాఖ్యానించారు. బ్రిటన్‌తో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ముప్పు చైనాయే(China) అని మండిపడ్డారు. రష్యా, చైనా విషయంలో మెతక వైఖరి అవలంభిస్తున్నారంటూ రిషి రాజకీయ ప్రత్యర్థి లిజ్ ట్రస్ ఆరోపించిన నేపథ్యంలోనే ఆయన ఘాటు వ్యాఖ్యలకు దిగారు. అయితే.. చైనా-బ్రిటన్ దౌత్యసంబంధంపై స్పష్టమైన, వాస్తవిక వైఖరి కలిగిన అభ్యర్థి బ్రిటన్ ఎన్నికల్లో సునాక్ ఒక్కరే అని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ అంతకుమునుపు పొగడటం గమనార్హం.


ఇక తాను ప్రధాని అయితే.. బ్రిటన్‌లో ఉన్న 30 చైనా సాంస్కృతిక యూనివర్శిటీలను మూసి వేస్తానని రిషీ సునాక్ హామీ ఇచ్చారు. సాంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా బ్రిటన్‌లో తన పరపతిని పెంచుకొంటున్న చైనా యత్నాలకు అడ్డుకట్ట వేస్తానన్నారు. ఉన్నత విద్యాసంస్థలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో వెలికి తీసి.. బ్రిటన్ యూనివర్శిటీల నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీని గెంటేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


సైబర్ ప్రపంచంలో చైనా ముప్పును ఎదుర్కొనేందుకు నాటో తరహాలో అంతర్జాతీయ సహకారం కూడగడతానని కూడా రిషి చెప్పారు. అంతేకాకుండా.. చైనా గూఢచార కార్యకలాపాలకు బ్రిటన్ నిఘా సంస్థ ఎమ్ఐ5 సహకారంతో చెక్ పెడతానన్నారు. బ్రిటన్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన టెక్ సంస్థలు చైనా చేతుల్లోకి పోకుండా ఏం చేయాలనే విషయంలో అధ్యయనం జరిపిస్తానని రిషి చెప్పారు. తన బెల్ట్ రోడ్ ప్రాజెక్టు ద్వారా చైనా అభివృద్ధి చెందుతున్న దేశాలపై భరించలేనంత ఆర్థిక భారం మోపుతోందన్నారు. ‘‘ఇప్పటివరకూ బ్రిటన్‌తో పాటూ ఇతర పాశ్చాత్య దేశాల రాజకీయ నాయకులు చైనాకు రెడ్ కార్పెట్ పరిచారు. చైనా అనుమానాస్పద చర్యలను చూసిచూడనట్టు వదిలేశారు. ఇకపై ఇది సాగకూడదు. నేను ప్రధాని అయిన తొలి రోజునే ఈ మార్పులు తెస్తా’’ అని రిషి తేల్చి చెప్పారు. ఇక.. చైనాపై రిషి కఠిన వైఖరి తన పార్టీలో చైనా వ్యతిరేకులకు సంతసం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాపై మరింత కఠిన వైఖరి అవలంభించాలంటూ వారు ఎంతోకాలంగా సునాక్‌ను డిమాండ్ చేస్తున్న వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. 

Updated Date - 2022-07-26T03:22:53+05:30 IST