ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం యూకేకు వెళ్లిన రిషబ్, శ్రేయాస్.. ఇది నెగ్గితే..

ABN , First Publish Date - 2022-06-21T01:51:15+05:30 IST

దక్షిణాఫ్రికాతో జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ వర్షార్పణం కావడంతో సిరీస్‌ను 2-2తో సరిపెట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్‌తో..

ENG vs IND: ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం యూకేకు వెళ్లిన రిషబ్, శ్రేయాస్.. ఇది నెగ్గితే..

దక్షిణాఫ్రికాతో జట్టుతో జరిగిన టీ20 సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్ వర్షార్పణం కావడంతో సిరీస్‌ను 2-2తో సరిపెట్టుకున్న టీమిండియా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లో ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), రిషబ్ పంత్ (Rishabh Pant) సోమవారం యూకేకు పయనమయ్యారు. ఇంగ్లండ్‌తో (England) జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్ గతేడాది కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడింది. ఈ మ్యాచ్ జూలై 1 నుంచి మొదలుకానుంది. బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియా (Team India), ఇంగ్లండ్ (England) మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ డ్రా కాగా, టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ మ్యాచ్‌లకు టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ వ్యవహరించగా, ఇంగ్లండ్ జట్టుకు జో రూట్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఐదో మ్యాచ్‌కు టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తుండగా, ఇంగ్లండ్ జట్టుకు బెన్ స్టోక్స్ నాయకత్వం వహించనున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు పుజారాను పక్కనపెట్టినప్పటికీ England's County Championshipలో 720 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న పుజారాకు ఐదో టెస్ట్‌లో ఆడే అవకాశం దక్కింది. అయితే ఈ 17 మంది టీమిండియా స్వ్కాడ్‌లో అజింక్యా రహానే చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ ఐపీఎల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో ఆడిన రహానే అంత మెరుగైన బ్యాటింగ్ కనబర్చలేదు.



ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ఎంపికపై కసరత్తు సాగుతోందని బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఈ విషయమై జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. వచ్చే నెలలో టీమిండియా ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. దాదాపుగా ఈ సిరీస్‌లో ఆడే జట్టు నుంచే ప్రపంచకప్‌ కోసం ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉందని దాదా తేల్చాడు. దీంతో ఈ సిరీస్‌ ఆశావహులకు కీలకంగా మారనుంది. మరోవైపు ఇషాన్‌, దినేశ్‌ కార్తీక్‌, హర్షల్‌, అవేశ్‌ మెగా టోర్నీలో ఆడే అవకాశాలను పెంచుకుంటున్నారు. అటు శ్రేయాస్‌, పంత్‌ మాత్రం నిరాశపరుస్తూ తమ బెర్త్‌లను ప్రమాదంలో పడేసుకుంటున్నారు. దీనికి తోడు ఐర్లాండ్‌తో సిరీస్‌కు సూర్యకుమార్‌, సంజూ శాంసన్‌, త్రిపాఠి ఎంపిక కావడం టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో పోటీని మరింత పెంచుతోంది. టీమిండియా, ఇంగ్లండ్ జట్టు మధ్య జరగనున్న ఐదో టెస్ట్‌కు టీమిండియా స్క్వాడ్ ఇదే.


టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, పుజారా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, షమీ, బూమ్రా, సిరాజ్, ఉమేష్ యాదవ్, ప్రశీద్ కృష్ణ

Updated Date - 2022-06-21T01:51:15+05:30 IST