శతకంతో నిలబెట్టాడు

ABN , First Publish Date - 2021-03-06T09:20:32+05:30 IST

భారత వికెట్‌ కీపర్లలో ఎక్కువ టెస్టు సెంచరీ (3)లు చేసిన రెండో ఆటగాడిగా పంత్‌.. సాహాతో సమంగా నిలిచాడు.

శతకంతో నిలబెట్టాడు

అదరగొట్టిన రిషభ్‌ పంత్‌ 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 294/7

సుందర్‌ అర్ధసెంచరీ


భారత వికెట్‌ కీపర్లలో ఎక్కువ టెస్టు సెంచరీ (3)లు చేసిన రెండో ఆటగాడిగా పంత్‌.. సాహాతో సమంగా నిలిచాడు. ధోనీ (6) ముందున్నాడు. స్వదేశంలో ఆడిన టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ సాధించిన స్కోర్లివీ.. 92, 92, 91, 58 నాటౌట్‌, 1, 101.


అండర్సన్‌, స్టోక్స్‌ పేస్‌ ధాటికి తొలి రెండు సెషన ్లలో పరుగుల కోసం భారత బ్యాట్స్‌మెన్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. ఓ దశలో భారత్‌ స్కోరు 146/6.. దీంతో ఇంగ్లండ్‌కే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ అందరిదీ ఓ ఆట.. తనది మరో ఆట అన్నట్టుగా రిషభ్‌ పంత్‌ శివాలెత్తాడు. రెండో కొత్త బంతినైతే నిర్దాక్షిణ్యంగా బాదేస్తూ పరుగుల వరద పారించాడు. అండర్సన్‌ ఓవర్‌లో అతడాడిన రివర్స్‌ స్వీప్‌ అయితే మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇదే జోరుతో సిక్సర్‌ ద్వారా స్వదేశంలో తొలి శతకాన్ని పూర్తి చేసిన పంత్‌.. చూస్తుండగానే భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అటు రోహిత్‌ సంయమనం, సుందర్‌ అర్ధసెంచరీ కూడా కీలకంగా నిలిచాయి.


అహ్మదాబాద్‌: పట్టు చేజారుతుందేమో అని అంతా భావిస్తున్న వేళ.. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101) అండగా నిలిచాడు. తన సహజ శైలిలో బ్యాట్‌ ఝుళిపిస్తూ ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఫలితంగా కెరీర్‌లో మూడో శతకం అందుకోగా స్వదేశంలో అతడికిదే మొదటిది. గతంలో మూడుసార్లు 90+ వద్ద పంత్‌ అవుటయ్యాడు. అటు వాషింగ్టన్‌ సుందర్‌ (60 బ్యాటింగ్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ కారణంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సరికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 94 ఓవర్లలో 7 వికెట్లకు 294 పరుగులు చేసింది. ప్రస్తుత ఆధిక్యం 89 పరుగులు. క్రీజులో సుందర్‌తో పాటు, అక్షర్‌ పటేల్‌ (11 బ్యాటింగ్‌) ఉన్నారు. ఏడో వికెట్‌కు సుందర్‌తో కలిసి పంత్‌ అందించిన 113 పరుగుల భాగస్వామ్యం జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపింది. అండర్సన్‌కు మూడు, స్టోక్స్‌.. లీచ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.


పేసర్ల హవా:

24/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ను రెండు సెషన్ల పాటు పేసర్లు అండర్సన్‌, స్టోక్స్‌ చక్కటి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో కట్టడి చేశారు. దీంతో పరుగులు రావడం కష్టం కావడంతో పాటు వికెట్లు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ సిరీ్‌సలో నాలుగోసారి పుజార (17) వికెట్‌ను స్పిన్నర్‌ లీచ్‌ తీశాడు. మరో పరుగు వ్యవధిలోనే కోహ్లీని స్టోక్స్‌ డకౌట్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రోహిత్‌తో జత కలిసిన రహానె కాసేపు నిలదొక్కుకున్నాడు. చక్కటి షాట్లతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ అండర్సన్‌ చేతికి చిక్కాడు. దీంతో లంచ్‌ విరామానికి 80/4 స్కోరుతో జట్టు ఇబ్బందుల్లో పడింది. అనంతరం రెండో సెషన్‌ ఆరంభంలోనే.. ఓపిగ్గా క్రీజులో నిలిచిన రోహిత్‌ శర్మను స్టోక్స్‌ అవుట్‌ చేశాడు. 50వ ఓవర్‌లో అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌లతో ఊరించిన అతడు చివరి బంతిని అద్భుత ఇన్‌స్వింగర్‌తో హిట్‌మ్యాన్‌ను ఎల్బీ చేశాడు. కాసేపటికే అశ్విన్‌ (13)ను లీచ్‌ అవుట్‌ చేశాడు. టీ బ్రేక్‌ సమయానికి పంత్‌, సుందర్‌ ఆటతో జట్టు స్కోరు 153/6కి చేరింది.


పంత్‌ ఆధిపత్యం.. సుందర్‌తో భాగస్వామ్యం:

చివరి సెషన్‌ వరకు కూడా ఇంగ్లండ్‌దే ఆధిపత్యంలా కనిపించింది. అప్పటికి జట్టు 52 పరుగులు వెనుకంజలోనే ఉంది. అంతకు ముందు రెండు సెషన్లలో ఇంగ్లండ్‌ బౌలర్ల జోరు చూస్తే ఇక మిగిలిన నాలుగు వికెట్లు ఎంతోసేపు ఉండవని అనిపించింది. కానీ పంత్‌, సుందర్‌ వారి ఆశలకు బ్రేక్‌ వేశారు. ఆరంభంలో పంత్‌ షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త కనబరుస్తూ 82 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ ఒక్కసారిగా లయను అందుకున్న అతడు గేరు మార్చాడు.


రెండు ఫోర్లతో ఇంగ్లండ్‌ స్కోరును సమం చేయగానే తన సహజ శైలిలోకి మారాడు. 91 బంతుల్లో 55 పరుగులతో ఉన్న పంత్‌ తర్వాతి 24 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేశాడు. రెండో కొత్త బంతిని తీసుకున్నాక రూట్‌, స్టోక్స్‌నే కాకుండా అండర్సన్‌ను కూడా వదలకుండా పరుగులు రాబట్టాడు. ఈ వెటరన్‌ పేసర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 83వ ఓవర్‌లోనైతే రివర్స్‌ స్వీప్‌ ద్వారా స్లిప్‌ మీదుగా కొట్టిన ఫోర్‌ మాజీలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదే జోరుతో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ద్వారా సిక్సర్‌ బాది శతకం పూర్తి చేశాడు. కానీ ఆ వెంటనే అండర్సన్‌ చేతికి చిక్కడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. అప్పటికే ఏడో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం రావడం విశేషం. ఆ తర్వాత సుందర్‌ తన అర్ధసెంచరీని పూర్తి చేసుకుని అక్షర్‌తో కలిసి రోజును ముగించాడు.


తొలి ఓపెనర్‌గా ..

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు. భారత్‌ నుంచి ఇదివరకే రహానె వెయ్యి పరుగులను పూర్తి చేశాడు. అయితే రోహిత్‌ మినహా మరో ఐదుగురు ఈ ఫీట్‌ సాధించినా వారంతా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా టీమిండియా తరఫున వేగం (17 ఇన్నింగ్స్‌)గా వెయ్యి రన్స్‌ పూర్తి చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్‌ నిలిచాడు. కాంబ్లీ (14) టాప్‌లో ఉన్నాడు.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 205

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 0; రోహిత్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 49; పుజార (ఎల్బీ) లీచ్‌ 17; కోహ్లీ (సి) ఫోక్స్‌ (బి) స్టోక్స్‌ 0; రహానె (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 27; పంత్‌ (సి) రూట్‌ (బి) అండర్సన్‌ 101; అశ్విన్‌ (సి) పోప్‌ (బి) లీచ్‌ 13; సుందర్‌ (బ్యాటింగ్‌) 60; అక్షర్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 94 ఓవర్లలో 294/7. వికెట్ల పతనం: 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259. బౌలింగ్‌: అండర్సన్‌ 20-11-40-3; స్టోక్స్‌ 22-6-73-2; లీచ్‌ 23-5-66-2; బెస్‌ 15-1-56-0, రూట్‌ 14-1-46-0.


టెస్టుల్లో ఎక్కువ (8) సార్లు డకౌట్‌ అయిన భారత కెప్టెన్‌గా ధోనీ సరసన నిలిచిన విరాట్‌ కోహ్లీ. అలాగే ఒకే సిరీస్‌లో రెండుసార్లు డకౌట్‌ అవ్వడం కోహ్లీకిది రెండోసారి.

Updated Date - 2021-03-06T09:20:32+05:30 IST