వలస కార్మికులతో పెరిగిన కరోనా కేసులు: సీఎం

ABN , First Publish Date - 2020-05-29T21:00:32+05:30 IST

ఉత్తరాఖండ్‌లో ఇటీవల కరోనా కేసులు పెరగడానికి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వలస కార్మికులు వెనక్కు తిరిగి రావడమే..

వలస కార్మికులతో పెరిగిన కరోనా కేసులు: సీఎం

డెహ్రూడూన్: ఉత్తరాఖండ్‌లో ఇటీవల కరోనా కేసులు పెరగడానికి వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ వలస కార్మికులు వెనక్కు తిరిగి రావడమే కారణమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ త్వరలోనే వాటిని అదుపు చేస్తామని చెప్పారు.


రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి వలస కార్మికులు వెనక్కి రావడమే కారణమని అధికార యంత్రాంగం గుర్తించడంతో దానిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 79 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్చ్ అయ్యారు. నాలుగు మరణాలు సంభవించాయి.


కాగా, మార్కెట్లు తెరిచే వేళలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని త్రివేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, పగటిపూట ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు జబ్బుల  బారిన పడుతున్నారని అన్నారు. మార్కెట్ తెరిచే వేళలపై కేంద్ర ప్రబుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని తాము నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారంనాడు సీనియర్ అధికారులతో కోవిడ్-19పై సమావేశం ఏర్పాటు చేసి, మార్కెట్లను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. తమ నిర్ణయం వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు వచ్చినా దానిని ఉపసంహరించుకుంటామని కూడా ముఖ్యమంత్రి రావత్ తెలిపారు.

Updated Date - 2020-05-29T21:00:32+05:30 IST