సాగర్‌నగర్‌ హద్దుగా రింగు వలల వేట సాగించాలి

ABN , First Publish Date - 2022-08-09T07:14:15+05:30 IST

: రింగువలల సమస్యను మత్స్యకారులు అందరూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు.

సాగర్‌నగర్‌ హద్దుగా రింగు వలల వేట సాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ విశ్వనాథన్‌

జేసీ కేఎస్‌ విశ్వనాథన్‌

మహారాణిపేట, ఆగస్టు 8: రింగువలల సమస్యను మత్స్యకారులు అందరూ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌  కేఎస్‌ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇరు వర్గాల మత్స్యకార సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  వేటకు సంబంధించి పలు అంశాలపై సంఘాల సభ్యుల అబిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇరు వర్గాల సంఘాల నుంచి ప్రతిపాదించిన సభ్యులతో జేసీ అద్యక్ష్యతన కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సాగర్‌నగర్‌ హద్దుగా నిర్ణయించి, అది దాటి మాత్రమే రింగు వలలతో వేట కొనసాగించాలని ఆదేశించారు. రింగు వలలతో వేటను వచ్చే సంవత్సరం వేట నిషేధ సమయం ఏప్రిల్‌ 15 వరకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు వివరించారు. రింగు వలల మొత్తం వివరాలను మత్స్య, పోలీసు శాఖల నుంచి సేకరిస్తామని తెలిపారు. ప్రతీ నెల కమిటీ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. మోటారు కలిగిన బోట్లను సంప్రదాయ వేట బోట్లుగా పరిగణించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. బోట్లు, వలలు తగులబెట్టడం వంటి దౌర్జన్యకర ఘటనలకు పాల్పడవద్దని జేసీ హితవు పలికారు. ఈ సమావేశంలో మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T07:14:15+05:30 IST