రిమ్స్‌ అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2021-06-14T05:02:29+05:30 IST

ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఒంగోలులోని రిమ్స్‌లో అధికారులు, డాక్టర్లతో సమావేశం కావటం వివాదాస్పదమైంది. దీనిపై కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ సీరియస్‌ అయ్యారు. ప్రొటోకాల్‌కి విరుద్ధంగా సమీక్ష ఎందుకు నిర్వహించారో సమాధానం ఇవ్వాలని రిమ్స్‌ అధికారులకు సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఇంకోవైపు స్థానిక శాసనసభ్యుడు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై అసంతృప్తితో ఉండగా రిమ్స్‌లోని ఒక అధికారి ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది.

రిమ్స్‌ అధికారులపై కలెక్టర్‌ సీరియస్‌
ఒంగోలులోని రిమ్స్‌ వైద్యశాల

షోకాజ్‌ నోటీసులు జారీ 

వివాదాస్పదమైన మాగుంట తనయుడి

సమీక్షా సమావేశం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఒంగోలులోని రిమ్స్‌లో అధికారులు, డాక్టర్లతో సమావేశం కావటం వివాదాస్పదమైంది. దీనిపై కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ సీరియస్‌ అయ్యారు.  ప్రొటోకాల్‌కి విరుద్ధంగా సమీక్ష ఎందుకు నిర్వహించారో సమాధానం ఇవ్వాలని రిమ్స్‌ అధికారులకు సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఇంకోవైపు స్థానిక శాసనసభ్యుడు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై అసంతృప్తితో ఉండగా రిమ్స్‌లోని ఒక అధికారి ఆయనకు సారీ చెప్పినట్లు తెలుస్తోంది. 

ఒంగోలులోని రిమ్స్‌కు శుక్రవారం రాఘవరెడ్డి వెళ్లారు. వైద్యశాల సూపరింటెండెంట్‌, మరో ఇద్దరు ముఖ్య అధికారులతో వేదికపై కూర్చుని డాక్టర్లు, సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ రిమ్స్‌ అధికారులకు ఫోన్‌ చేసి అసలేం జరిగిందంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. సౌకర్యాల కల్పనకు ఎవరైౖనా ముందుకొస్తే వారితో మాట్లాడి సహకారం తీసుకోవచ్చు. అంతేకాని ప్రొటోకాల్‌కి విరుద్ధమైన కార్యక్రమాలు నిర్వహించకూడదని మీకు తెలియదా అని సూపరింటెండెంట్‌ శ్రీరాములుని ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కలెక్టర్‌   వివరణ  కోరుతూ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇటు కలెక్టరు, అటు రిమ్స్‌ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇబ్బందిపడేది మీరే అంటూ రిమ్స్‌ అధికారులను ఆయన హెచ్చరించినట్లు కూడా చెప్తున్నారు. ఆమాత్రం అవగాహన లేకుండా ఎలా పనిచేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఒక అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డాక్టర్లందరినీ ఆహ్వానించి సమావేశంలో పాల్గొనేవిధంగా చూసినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు అధికారి మంత్రి బాలినేని ఫోన్‌ చేసినప్పుడు సారీ చెప్పినట్లు తెలిసింది. 

భోజన కాంట్రాక్టర్‌కు మెమో

వైద్యశాలలో కరోనా బాధితులకు భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు అధికారులు మెమో జారీ చేశారు. ఇటీవల బదిలీ అయిన కలెక్టరు గతంలో కాంట్రాక్టరుని తప్పించి కొత్తవారిని నియమించి వెళ్లారు. వారు సరఫరా చేసే భోజనాన్ని రిమ్స్‌ అధికారులు రోజూ తనిఖీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన తనిఖీలో మెనూ ప్రకారం 1010 గ్రాముల భోజనం ఉండాల్సింది 750 గ్రాముల లోపు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. చికెన్‌ 100 గ్రాములకు బదులు 50 గ్రాములు మాత్రమే ఉన్నట్లు తెలిసింది. సాంబారు అన్నం కాకుండా సాంబారు, అన్నం వేర్వేరుగా ఇస్తున్నారు. దీంతో అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు మెమో ఇచ్చారు. 

Updated Date - 2021-06-14T05:02:29+05:30 IST