మరో రికార్డు

ABN , First Publish Date - 2020-08-12T06:18:39+05:30 IST

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనత చాటుకుంది. ప్రపంచంలోని 100 అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. ఈ ఏడాదికి గాను విడుదలైన ‘ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ కంపెనీల జాబితాలో...

మరో రికార్డు

  • ప్రపంచ టాప్‌-100 కంపెనీల్లో రిలయన్స్‌కు చోటు 
  • ‘ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ జాబితాలో 96వ స్థానం 
  • లిస్ట్‌లో భారత కంపెనీలు 7.. అందులో 4 పీఎ్‌సయూలు 

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో ఘనత చాటుకుంది. ప్రపంచంలోని 100 అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. ఈ ఏడాదికి గాను విడుదలైన ‘ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500’ కంపెనీల జాబితాలో ఆర్‌ఐఎల్‌ 96వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 106వ స్థానంలో ఉన్న కంపెనీ.. ఈసారి ఏకంగా 10 స్థానాలు ఎగబాకింది. ఈ జాబితా టాప్‌-100లోని ఏకైక భారత కంపెనీ రిలయన్సే. అత్యుత్తమ ర్యాంకింగ్‌ కలిగిన భారత సంస్థ కూడా ఇదే. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. 2012 సంవత్సరంలోనే రిలయన్స్‌ టాప్‌-100లోకి దూసుకొచ్చింది. ఆ ఏడాది కంపెనీ 99వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సంవత్సరాల్లో ర్యాంకింగ్‌ క్రమంగా తగ్గుకుంటూ వచ్చి 2016లో 215వ స్థానానికి పరిమితమైంది. అప్పటి నుంచి ర్యాంకింగ్‌ నిలకడగా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది మళ్లీ టాప్‌-100లో చోటు దక్కించుకోగలిగింది. 
  2. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 లిస్ట్‌లో భారత్‌ నుంచి మొత్తం 7 కంపెనీలకు చోటు లభించింది. అందులో నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలే. మిగతా మూడు ప్రైవేట్‌ కంపెనీలు. 
  3. ఈ ఏడాది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 151వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే 34 స్థానాలు దిగజారింది. 
  4. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) సైతం 30 స్థానాలు తగ్గి 190వ స్థానానికి పరిమితమైంది. 
  5. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) 221వ స్థానానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 15 స్థానాలు మెరుగుపడింది. 
  6. భారత పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) 309వ స్థానంలో ఉంది. టాటా మోటార్స్‌ 337, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ 462వ స్థానాల్లో ఉన్నాయి. 
  7. 2020 మార్చి 31 నాటికి లేదా అంతకు ముందే ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీల మొత్తం రాబడిని ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించినట్లు ఫార్చ్యూన్‌ తెలిపింది. 


వాల్‌మార్ట్‌ ప్రపంచ నెం.1

ప్రపంచంలోనే నెం.1 కంపెనీగా వాల్‌మార్ట్‌ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 52,400 కోట్ల డాలర్లుగా నమోదైంది. వాల్‌మార్ట్‌ తర్వాత మూడు స్థానాలు చైనా కంపెనీలవే. సినోపెక్‌ (40,700 కోట్ల డాలర్లు), స్టేట్‌ గ్రిడ్‌ (38,400 కోట్ల డాలర్లు), చైనా నేషనల్‌ పెట్రోలియం (37,900 కోట్ల డాలర్లు) వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయి. రాయల్‌ డచ్‌ షెల్‌ 5, సౌదీ అరామ్కో 6వ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది లిస్ట్‌లో వాల్‌మార్ట్‌, సినోపెక్‌, చైనా నేషనల్‌ పెట్రోలియం స్థానాల్లో ఎలాంటి మార్పులేదు. స్టేట్‌ గ్రిడ్‌ రెండు స్థానాలు ఎగబాకగా.. షెల్‌ 2 స్థానాలు కిందికి జారింది. 





ఆర్‌ఐఎల్‌లో వాటా కొనుగోలును పరిశీలిస్తున్నాం: సౌదీ అరామ్కో 

ప్రపంచంలో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు సౌదీ అరామ్కోతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ఒప్పందం త్వరలోనే కొలిక్కి వచ్చేలా ఉంది. రిలయన్స్‌కు చెందిన ఆయిల్‌ టు కెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంలో వాటా కొనుగోలుకు సంబంధించి తాము సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని సౌదీ అరామ్కో సీఈఓ అమిన్‌ నాసర్‌ తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కంపెనీ తగిన నిర్ణ యం తీసుకుంటుందన్నారు. అరామ్కోకు ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను విక్రయించనున్నట్లు రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ గత ఏడాదిలో ప్రకటించారు.  ఈ వ్యాపారాల మార్కెట్‌ విలును 7,500 కోట్ల డాలర్లుగా లెక్కగడుతోంది రిలయన్స్‌. ఈ లెక్కన 20 శాతం వాటా కోసం అరామ్కో 1,500 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇరువర్గాల మధ్య డీల్‌ ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ జాప్యమైంది. అంతర్జాతీయ ఇంధన రంగంలో ప్రతికూల పరిస్థితులతో పాటు కరోనా సంక్షోభమే ఇందుకు కారణమని గత నెలలో జరిగిన ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సమావేశంలో అంబానీ తెలిపారు. 


Updated Date - 2020-08-12T06:18:39+05:30 IST