సమరానికి సై

ABN , First Publish Date - 2021-01-19T06:04:48+05:30 IST

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమరానికి అన్ని పార్టీలూ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

సమరానికి సై

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం వేగవంతం

యోజకవర్గస్థాయి సమావేశాల్లో నాయకులు బిజీ

ఇప్పటికే జిల్లాలకు, ఓటర్లకు పార్టీల ఇన్‌చార్జుల  నియామకం 

నల్లగొండ, జనవరి 18  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎన్నికల సమరానికి అన్ని పార్టీలూ అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచార బరిలో దిగిన నాయకులు కలియ తిరుగుతున్నారు. మార్చి రెండో వారంలో పోలింగ్‌ ఉంటుందన్న సమాచారంతో అలర్ట్‌ అయ్యారు. ఓటర్ల నమోదుతో మొదలై ఎన్నికల కార్యాలయాల ప్రారంభం, ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. ఫిబ్రవరి రెండో వారానికి నియోజకవర్గస్థాయి సమావేశాలు పూర్తిచేసుకొని భారీ సభలు, సమావేశాలకు సన్నద్ధమవుతున్నారు. పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణలతో ఎన్నికల వాతావరణం సంతరించుకుంది. 12 జిల్లాల పరిధిలో నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉంది. 546 పోలింగ్‌ స్టేషన్లు, 4,91,396 మంది  ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల సంఖ్య 3,23,377, మహిళా ఓటర్ల సంఖ్య 1,67,947 మంది ఉన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,85,943 మంది ఓటర్లు కాగా నల్లగొండ జిల్లాలో 88,351, సూర్యాపేటలో 60,020, యాదాద్రిలో 37,572 మంది ఓటర్లతో సోమవారం జాబితా విడుదలైంది. 


తెలంగాణ సెంటిమెంటే కోదండరాం ఆయుధం 

ఆశించిన తెలంగాణ కోసం పోరాటం మిగిలే ఉంది అంటూ తెలంగాణ జనసమతి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం బరిలో దిగారు. ఆయన అన్ని పార్టీల నుంచి మద్దతు కోరారు. బలమైన కాంగ్రెస్‌ పార్టీ మద్దతు లభిస్తుందని ఆయన ఆశించారు. చివరకు వారు తామే అభ్యర్థిని బరిలో దించేందుకు సిద్ధం కావడంతో తెలంగాణ జనసమితిలోని తన క్యాడర్‌నే నమ్ముకునే పరిస్థితి. తాను గెలిస్తేనే ప్రశ్నించే గొంతు, నిఖార్సయిన తెలంగాణవాదం బతికి బట్టకడతాయని కోదండరాం ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల నమోదును ఉత్సాహంగా పూర్తిచేశారు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, ఉపాధ్యాయ సంఘాలతోనూ సమావేశమయ్యారు. నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియమించారు. కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ నెల 25 నుంచి మరో దశ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.


వేగం పెంచిన గులాబీ దళం

‘ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపీ స్థానాలు కోల్పోయాం, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అంతా అలర్ట్‌గా ఉండాలి, ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించాలి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గత శనివారం రాత్రి టీఆర్‌ఎస్‌ జిల్లా ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. గెలుపు, ఓటములకు, పోలింగ్‌కు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. పట్టణాల్లో, అందులో ఉపాధ్యాయ వర్గాల్లో కొంత అసంతృప్తి ఉందని, పీఆర్‌సీ ప్రకటిస్తే తొలగిపోతుందని, పల్లెల్లో పట్టభద్రులు టీఆర్‌ఎస్‌ పట్ల విశ్వాసంగా ఉన్నారని ఆయన తెలిపారు. 50 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించుకొని ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వద్దకు తీసుకొస్తే సులువుగా విజయం సాధించ వచ్చని ఉద్భోద చేశారు. బరిలో తొమ్మిది మంది ఉన్నారని, ఓట్ల చీలిక ఉంటుందని, ఇది టీఆర్‌ఎ్‌సకు లాభించే అంశమని సమావేశంలో నేతలు అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కేటీఆర్‌తో సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు అలర్ట్‌అయ్యారు. ఇప్పటికే మూడు నియోజకవర్గాల సమావేశాలు పూర్తికాగా ఫిబ్రవరి మొదటి వారం లోపు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేయ నున్నారు. అంతకు ముందు పెద్ద మండలాలైతే ఒకటి, చిన్న మండలాలైతే రెండు చొప్పున సమావేశాలు నిర్వహించి చివరన నియోజకవర్గ సన్నాహక సమావేశానికి రంగం సిద్ధం చేశారు. అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి అనధికారికంగా ఖరారైనా, మంత్రి జగదీ్‌షరెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, కర్నె ప్రభాకర్‌లు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈనెల చివర్లో హాలియాలో జరగనున్న సీఎం సభ తమకు లాభించే అంశంగా గులాబీ నేతలు భావిస్తున్నారు. 


ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ

ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని, పోలింగ్‌ బూత్‌కు ముగ్గురు చొప్పున ఇన్‌ఛార్జులను బీజేపీ నియమించింది. అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మొదటిదశ పర్యటన పూర్తయ్యింది. క్యాడర్‌లో నిబద్ధత, బలమైన నిర్మాణం తమకు లాభించే అం శంగా పార్టీ భావిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని ఇన్‌చార్జిగా నియమించారు. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


భారీ సభకు యువ తెలంగాణ పార్టీ ప్రణాళిక

ఆత్మీయ సమ్మేళనాలు, జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన యువ తెలంగాణ పార్టీ నియోజవర్గానికి ఇద్దరు, ఐదు గ్రామాలకు ఒక ఇన్‌చార్జిని నియమించింది. బరిలో ఉన్న ఏకైక మహిళనని, సమాజంపై తనకున్న అవగాహనను దృష్టిలో పెట్టుకొని అవ కాశం ఇవ్వాలని అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి కోరుతున్నారు.యువ జన సంఘాల సమితి అధ్యక్షుడిగా పనిచేసిన పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నీ తానై నడుస్తున్నారు. ఈ నెల 24న నల్లగొండలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. 


స్వతంత్ర అభ్యర్థిగా బరిలో చెరుకు

తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ అందరినీ కూడగట్టుకునే పనిలో ఉన్నారు. బీసీ సంఘాల రాష్ట్ర నేతలు ఆర్‌.కృష్ణయ్య,జాజూల శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మా ర్పీఎస్‌ నేత మంద కృష్ణ మద్దతు ప్రకటించారు. వామపక్ష పార్టీల్లో తనకున్న పట్టుతో న్యూడెమో క్రసీ, వీరన్న వర్గం, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కు మార్‌ల మద్దతునూ కూడగట్టారు. కళాకారుడు ఏపూరి సోమన్న మద్దతు ప్రకటించగా ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు సభలు నిర్వహించి మద్దతిచ్చే వారిని ఓ వేదికపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. 


వామపక్షాల అభ్యర్థి జయసారథిరెడ్డి

సీపీఎం, సీపీఐ ఉమ్మడి అభ్యర్థిగా జయసారథిరెడ్డిని ఖరారు చేశారు. గ్రామాల్లో ఆ పార్టీలకు బలమైన శాఖలు ఉండడంతో అభ్యర్థి ప్రచారం, ఇప్పటికే జిల్లా స్థాయి ముఖ్యనేతల సమావేశం కార్యక్రమాలు పూర్తిచేశారు.రెండు పార్టీలకు బలమైన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఉన్నాయి అవి తనకు ఉపయోగపడతాయని అభ్యర్థి అంచనాలో ఉన్నారు. శాఖల వారీగా బాధ్యులను నియమించారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా హరి శంకర్‌ గౌడ్‌ బరిలో ఉన్నారు. మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్‌తో సుదీర్ఘంగా పనిచేసిన అనుభవం, పరిచయాలు, ఇతర సంఘాల మద్దతు కోరుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ నుంచి   బరిలో దిగేందుకు జిల్లాకు చెందిన శ్రవణ్‌కుమార్‌, రాములు నాయక్‌ మధ్య పోటీ కొనసాగుతోంది. అధిష్ఠానం ఎవరిని ఖరారు చేస్తోందో చూడాలి. 

Updated Date - 2021-01-19T06:04:48+05:30 IST