నేటి నుంచి అంతర్‌ రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-06-21T06:28:34+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కొన్ని రోజులుగా నిలిపివేసిన ఆర్టీసీ దూర ప్రాంత బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించనున్నారు.

నేటి నుంచి అంతర్‌ రాష్ట్ర సర్వీసుల పునరుద్ధరణ

హైదరాబాద్‌కు ఐదు బస్సులు
అంతర్‌ జిల్లాలకు సర్వీసుల పెంపు
నష్టాల భర్తీకి ఆర్టీసీ వ్యూహాత్మక అడుగులు
ఊపిరి పీల్చుకుంటున్న ప్రయాణికులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కొన్ని రోజులుగా నిలిపివేసిన ఆర్టీసీ దూర ప్రాంత బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించనున్నారు. అంతర్‌ రాష్ట్ర, అంతర్‌ జిల్లాల బస్సులను సోమవారం నుంచి నడపడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. తెలంగాణకు జిల్లా నుంచి ఐదు బస్సులను పంపడానికి నిర్ణయించారు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మార్గం సుగమమైంది. నెల మే 5వ తేదీ నుంచి ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే సోమవారం నుంచి రాష్ట్రమంతటా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు సడలింపు ఇచ్చారు. జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ ఎక్కువగా ఉన్నందున ఇప్పటి మాదిరిగా మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చారు. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తుండడంతో ఇక్కడి నుంచి కూడా ఇతర జిల్లాలకు నడపడానికి  నిర్ణయించారు. సోమవారం అమలాపురం డిపో నుంచి రెండు బస్సులను హైదరాబాద్‌ నడపడానికి నిర్ణయించి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించారు. కాకినాడ నుంచి రెండు, రాజోలు డిపో పరిధి నుంచి ఒక బస్సును హైదరాబాద్‌ నడుపుతున్నారు. అమలాపురం డిపో నుంచి వెళ్లే రెండు బస్సులతో పాటు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరిస్థితిని బట్టి అదనంగా మరో బస్సు నడిపే అవకాశం ఉందని డిపో మేనేజర్‌ టీవీఎస్‌ సుధాకర్‌ వెల్లడించారు. జిల్లా నుంచి విజయవాడకు ప్రస్తుతం నడుపుతున్న ఎనిమిది బస్సులకు తోడు అదనంగా మరో నాలుగు కలిపి పన్నెండు సర్వీసులు, అమలాపురం నుంచి విశాఖపట్నం ప్రస్తుతం నడుస్తున్న 20 సర్వీసులకు తోడు  అదనంగా మరో మూడు సర్వీసులను కలిపి 23 బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. అయితే ఇవన్నీ అమలాపురం డిపో నుంచి మధ్యాహ్నం 12గంటలలోపు బయల్దేరతాయి జిల్లా నుంచి హైదరాబాద్‌ వెళ్లే ఐదు బస్సు సర్వీసులకు ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ సౌకర్యం కూడా కల్పించారు. అయితే కర్ఫ్యూ ఆంక్షల వల్ల జిల్లాలో ఆర్టీసీ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఆర్టీసీ అధికారులు వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాలకు బస్సులు నడపడం ద్వారా ఆదాయ మార్గాలను పెంచుకునే అన్వేషణలో ఉన్నారు.
హైదరాబాద్‌, భద్రాచలంలకు కూడా
 కాకినాడకు మరో రెండు నాన్‌స్టాప్‌లు
రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 20: హైదరాబాద్‌, భద్రాచలానికి ఆర్టీసీ  సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఆర్టీసీ జిల్లా తెలంగాణకు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేపట్టింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం డిపో నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌కు సూపర్‌లగ్జరీ  బస్సు ప్రారంభం కానుంది. ఈ సర్వీసు        ప్రతీరోజూ ఉంటుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా రాత్రి పది గంటలకల్లా గమ్యస్థానానికి చేరుకునేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఈ బస్సు తిరిగి మర్నాడు సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి ఉదయానికి రాజమహేంద్రవరం చేరుకుంటుంది. అలాగే భద్రాచలానికి సర్వీసులు పెంచారు. వయా కుక్కునూరు రూటులో ఉదయం 6 గంటలకు ఒక సర్వీసు ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల క్రితం వయా మారేడుమిల్లి ఘాట్‌ మీదుగా ఎటపాక వరకు ఉదయం పూట రెండు సర్వీసులు ప్రారంభించగా, ప్రస్తుతం వీటిని భద్రాచలం వరకు పొడిగిస్తున్నారు. భద్రాచలంలో రాత్రికి నైట్‌ అవుట్‌ చేసి మర్నాడు ఉదయం బయలుదేరి రాజమహేంద్రవరం చేరుకునేలా షెడ్యూల్‌ సిద్ధం చేశారు. కాగా రాజమహేంద్రవరం-కాకినాడ మధ్య మరో రెండు నాన్‌స్టాప్‌ సర్వీసులు పెరిగాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం డిపో నుంచి నాలుగు, కాకినాడ డిపో నుంచి నాలుగు నాన్‌స్టాప్‌ సర్వీసులు నడుస్తున్నాయి. సోమవారం నుంచి మరో రెండు అంటే మొత్తం ఆరు సర్వీసులు నడుపుతారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


Updated Date - 2021-06-21T06:28:34+05:30 IST