ఘనంగా సంక్రాంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-01-17T05:11:30+05:30 IST

కామారెడ్డి జిల్లాలోని వివిధ మండల కేంద్రాలు, ఆయా గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే పిల్లాపాపలతో కలిసి కుటుంబ సభ్యులు తలంటు స్నానాలు చేశారు.

ఘనంగా సంక్రాంతి వేడుకలు
కామారెడ్డిలోని పలు కాలనీల్లో ఇంటి ముందు ముగ్గులు వేసిన దృశ్యం

గాలి పటాల ఎగురవేతలో యువత బిజీబిజీ

పోటాపోటీగా ముగ్గులు వేసిన యువతులు

ఇంటింటా మహిళల నోములు


కామారెడి టౌన్‌, జనవరి 16: కామారెడ్డి జిల్లాలోని వివిధ మండల కేంద్రాలు, ఆయా గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే పిల్లాపాపలతో కలిసి కుటుంబ సభ్యులు తలంటు స్నానాలు చేశారు. ఇంటి ముంగిళ్లను శుభ్రపరిచి రంగురంగులతో చూడ ముచ్చటగా ముగ్గులు వేశారు. ముగ్గులపై గొబ్బెమ్మలను పెట్టి పూజలు నిర్వహించారు. పట్టణంలోని విద్యానగర్‌, శాంతి థియేటర్‌ రోడ్డు, పంచాముఖి హనుమాన్‌కాలనీ, గాంధీనగర్‌ కాలనీ, అశోక్‌నగర్‌, ఎన్‌జీవోఎస్‌ కాలనీ, వివేకానంద కాలనీ, శ్రీరాంనగర్‌ కాలనీ, సైలాన్‌బాబా కాలనీ, బతుకమ్మ కుంట, గడి రోడ్డు, పాంచ్‌ చౌరస్తా, సరోజినీదేవీ రోడ్డు, వీక్లీమార్కెట్‌, జేపీఎన్‌ రోడ్డు, సిరిసిల్లా రోడ్డు, సుభాష్‌రోడ్డు, పెద్దబజార్‌, గొల్లవాడ, అజంపూర, బడాకసాబ్‌ గల్లీ, కాకతీయనగర్‌, ముదాంగల్లీ, భారత్‌రోడ్‌, రాంమందిర్‌, గాంధీగంజ్‌, అయ్యప్పనగర్‌, ఆర్‌బీనగర్‌, హౌజింగ్‌ బోర్డు కాలనీ, గుమస్తా కాలనీ, బీడీ వర్కర్స్‌ కాలనీ, డ్రైవర్స్‌ కాలనీ, ఇందిరానగర్‌, రాజీవ్‌నగర్‌, కాలనీల్లో మహిళలు ఇళ్ల ముందర వేకువజామునే రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయా కాలనీల్లోని మహిళలు కుటుంబ సమేతంగా కాలనీల్లోని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటి గడపలపై రేగుపండ్లు, నవధాన్యాలు పెట్టి  పండుగను జరుపుకున్నారు. పిండి వంటలు చేసుకుని భోజనాలు చేశారు. చిన్నారులు, యువకులు, మహిళలు పతంగులను ఎగురవేసి ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. సమీపంలోని ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఇళ్లలో మహిళలు అనేక రకాల వస్త్తువులతో నోములు నోచుకున్నారు. ముత్తైదువులను ఇళ్లలోకి పిలుచుకొని పసుపు, బొట్టును సమర్పించుకున్నారు. అలాగే ఇంట్లో పసుపు, కుంకుమతో అందంగా అలంకరించిన స్థలంలో ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి నవధాన్యాలు, కూరగాయలు పెట్టి సంప్రదాయ బద్ధంగా ఆవుపాలను పొంగించారు.

తాడ్వాయిలో..

తాడ్వాయి: మండలంలో శని, ఆదివారాలలో సంక్రాంతి పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం వేకువజామునే నిద్రలోంచి లేచి తమ ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి అలంకరించారు. ఇళ్లలో రకరకాల పిండి వంటలు చేసి ఆరగించారు. మండలంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో, ఎర్రాపహాడ్‌లోని రేణుకాదేవి ఆలయంలో, సంతాయిపేట భీమేశ్వరాలయంలో, దేమికలాన్‌లోని పార్వతీదేవి ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి: మండలంలో శని, ఆదివారాలలో ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. పట్టణ కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఇంటి ముందు కల్లాపి జల్లి రంగురంగు ముగ్గులు వేసి అలంకరించారు. యువకులు, చిన్నారులు గాలిపటాలు ఎగరవేసి ఆనందంగా గడిపారు. 

బాన్సువాడ డివిజన్‌లో..

బాన్సువాడ/బాన్సువాడ టౌన్‌ : డివిజన్‌ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డివిజన్‌లోని బాన్సువాడ పట్టణం, మద్నూర్‌, బిచ్కుంద, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, జుక్కల్‌, నిజాంసాగర్‌, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ మండలాల్లో యువకులు, చిన్నారులు కేరింతలు కొడుతూ గాలి పటాలను ఎగురవేశారు. యువతులు, మహిళలు ఇంటి ముందర అందంగా రంగవల్లులు వేశారు. బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ రోజు నువ్వులు, చక్కెరను ఒకరికొకరు ఇచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  

బీర్కూర్‌లో..

బీర్కూర్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ప్రజలు ఘనంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో చిన్నారులు, పెద్దలు, యువకులు గాలి పటాలను ఎగురవేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలు పిండి వంటలు చేసి, కుటుంబ సభ్యులతో పండుగను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా, బరంగ్‌ఎడ్గి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీజేపీ నాయకులు గ్రామానికి చెందిన చిన్నారులకు సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించి, గాలి పటాలను ఉచితంగా అందజేశారు. 


Updated Date - 2022-01-17T05:11:30+05:30 IST