ఘనంగా చక్రతీర్థ స్నానం

ABN , First Publish Date - 2021-02-28T05:50:13+05:30 IST

రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం ముగింపును పురస్కరించుకుని శనివారం చక్రతీర్థ స్నానం ఘనంగా నిర్వహించారు. తొలుత ధ్వజస్తంభం నుంచి గరుడ పతాకాన్ని అర్చకులు అవరోహణం చేశారు. వేకువ జామునే దేవస్థానం పక్కనే ఉన్న రామ కోనేరులో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు చక్రతీర్థస్నానం తంతు చేపట్టారు.

ఘనంగా చక్రతీర్థ స్నానం
రామకోనేరులో సీతారాముల విగ్రహాలకు చక్రస్నానాలు చేసి పూజాకార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

రామతీర్థంలో ముగిసిన సీతారాముల కల్యాణోత్సవాలు                                       

నెల్లిమర్ల/ గరుగుబిల్లి, ఫిబ్రవరి 27 : రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో సీతారాముల కల్యాణోత్సవం ముగింపును పురస్కరించుకుని శనివారం చక్రతీర్థ స్నానం ఘనంగా నిర్వహించారు. తొలుత ధ్వజస్తంభం నుంచి గరుడ పతాకాన్ని అర్చకులు అవరోహణం చేశారు. వేకువ జామునే దేవస్థానం పక్కనే ఉన్న రామ కోనేరులో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు చక్రతీర్థస్నానం తంతు చేపట్టారు. బాలబోగం అనంతరం యాగశాలలో సుందరకాండ హవనం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజస్థంభం వద్ద రామచంద్రస్వామి వారిని పల్లకిలో వేంచేపు చేసి విశ్వక్షేణ అర్చన నిర్వహించారు. ఈ క్రతువులన్నీంటినీ ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు పర్యవేక్షించారు. కార్యక్రమాలను అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులతో పాటు ఖండవిల్లి కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు,  పాణంగిపల్లి ప్రసాద్‌, పవన్‌కుమార్‌ శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

తోటపల్లిలోనూ చక్ర తీర్థ స్నానం

చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లోనూ స్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరిరోజున స్వామిని ప్రత్యేక పల్లకీలో ఊరేగించి అనంతరం పవిత్ర నాగావళి నదీ తీరంలో శ్రీచూర్ణోత్సవం, చక్ర తీర్థస్నానాలను చేపట్టారు. ఈ తంతును ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపాలకృష్ణమాచార్యులు, జి.శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. రెండు దేవాలయాల్లో ముందుగా నిత్యారాధన, విశేష హోమాలు, మంగళా శాసనాలతో పూజలు చేశారు. స్వామివారి శ్రీచక్ర తీర్థ స్నానాన్ని పురస్కరించుకుని నదీ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో ఆలయ ఈవో బి.లక్ష్మీనగేష్‌, దేవస్థానం మాజీ చైర్మన్‌ ఆర్నిపల్లి గంగాధర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T05:50:13+05:30 IST