యాసంగి సీజన్‌లో ‘వరి’ సిరులు!

ABN , First Publish Date - 2021-02-25T08:12:29+05:30 IST

యాసంగి సీజన్‌లో తెలంగాణలో వరి పంట సిరులు కురిపించబోతోంది.

యాసంగి సీజన్‌లో ‘వరి’ సిరులు!

వరి సాగులో దేశంలో నెంబర్‌ 1.. 127.91 శాతం పెరిగిన సాగు విస్తీర్ణం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో తెలంగాణలో వరి పంట సిరులు కురిపించబోతోంది. చరిత్రలో ఇంతకుమునుపెన్నడూ ఈ సీజన్‌లో సాగుచేయనంత భూమిలో ఈసారి సాగు చేసినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ  బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి  65,14,119 ఎకరాలలో సాగు చేశారు.  ఇందులో వరి సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో 50,58,128 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వరి విస్తీర్ణం ఈ సీజన్‌లో దేశంలోనే అత్యధికమని రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. వరి, మొక్కజొన్న, గోధుమ, జొన్న, సజ్జ, రాగులు, పెసర, కంది, మినుము, వేరుశనగ, పొద్దు తిరుగుడు తదితర పంటలు కూడా సాధారణం కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్లు నివేదికలో వివరించారు. 125 రోజుల్లో పంట చేతికి వస్తుందనే ఆలోచనతో ఈ సీజన్‌లో రైతులు దొడ్డురకాలవైపు మొగ్గుచూపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా రైతులకు ఇదే సలహాలు ఇవ్వటం తో 30.35 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగుచేశారు. మిగిలిన 20.23 లక్షల ఎకరాల్లో  సన్నరకాలు సాగుచేశారు. యాసంగిలో వరి సాధారణ విస్తీర్ణం 22,19,326 ఎకరాలు కాగా, ఇప్పుడు ఏకంగా 50,58,128 ఎకరాల్లో సాగైంది. వరి సాగు విస్తీర్ణం 127.91 శాతం పెరిగి 227.91 శాతంకు చేరింది.  మొక్కజొన్న సాగుకు కూడా రైతులు వెనకాడలేదు. 4,29,152 ఎకరాల్లో(106 శాతం)  మక్కలు సాగుచేశారు. 1,16,446 ఎకరాల్లో జొన్న, 3,43,619 ఎకరాల్లో శనగ, 2,61,517 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. ముతక ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 4,94,283 ఎకరాలుకాగా,  ఈ యాసంగిలో 5,69,968 ఎకరాల్లో(115.55 శాతం) సాగుచేశారు. పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3,03,986 ఎకరాలు కాగా,  4,43,754 ఎకరాల్లో  సాగుచేశారు. మొత్తం ఆహార ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 30,28,449 ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో ఏకంగా 60,86,758 ఎకరాల్లో పండించారు. 

Updated Date - 2021-02-25T08:12:29+05:30 IST