వరి రికార్డు..

ABN , First Publish Date - 2022-09-29T09:08:29+05:30 IST

రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు ముగింపు దశకు వచ్చింది. జూన్‌ నెలతో మొదలైన వానాకాలం ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది.

వరి రికార్డు..

  • 64.55 లక్షల ఎకరాల్లో సాగు
  • ఈసారి అదనంగా 2.41 లక్షల ఎకరాల్లో సాగు 
  • వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ నివేదిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు ముగింపు దశకు వచ్చింది. జూన్‌ నెలతో మొదలైన వానాకాలం ఈ నెలాఖరుతో ముగిసిపోతుంది. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.36 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు బుధవారం వ్యవసాయశాఖ నివేదిక  వెల్లడించింది. సాధారణ విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలతో పోలిస్తే ఈసారి 10 శాతం అదనంగా పంటలు సాగయ్యాయి. రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి ఈసారి రికార్డుస్థాయిలో 64.55 లక్షల ఎకరాల్లో సాగవడం విశేషం. నిరుడు 62.14 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా ఈసారి అదనంగా 2.41 లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి వరి పంట సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా 54 శాతం అదనంగా సాగవడం గమనార్హం. ఇదిలా ఉండగా మరో ప్రధాన పంట పత్తి 50 లక్షల ఎకరాల్లో సాగైంది. గతేడాదితో పోలిస్తే 3 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి పంట వేశారు. సాధారణ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా పత్తి సాగు చేయటం గమనార్హం. మొక్కజొన్న 6.21 లక్షల ఎకరాల్లో, కంది 5.62 లక్షల ఎకరాల్లో, సోయాబీన్‌ 4.33 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పప్పు ధాన్యాల సాధారణ విస్తీర్ణం 10.36 లక్షలు కాగా రైతులు 6.59 లక్షల ఎకరాల్లో మాత్రమే వీటిని సాగు చేశారు. నూనె గింజల సాధారణ విస్తీర్ణం 5 లక్షల ఎకరాలు కాగా ఈసారి 4.60 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. 

Updated Date - 2022-09-29T09:08:29+05:30 IST