Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 30 Nov 2021 02:40:00 IST

ధాన్యం కొనాల్సిందే!

twitter-iconwatsapp-iconfb-icon
ధాన్యం కొనాల్సిందే!

పార్లమెంటులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గళం

వాయిదా తీర్మానాలిచ్చిన కేకే, నామా, రేవంత్‌

తిరస్కరించిన వెంకయ్య నాయుడు, ఓం బిర్లా

వెల్‌లోకి దూసుకెళ్లి టీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

రెండు, మూడేళ్లు ఉప్పుడు బియ్యం కొనాలి: కేకే

మిగతా పార్టీలూ తమతో కలిసి రావాలి: నామా

మొలకలెత్తుతున్నా పట్టించుకోవడం లేదు: రేవంత్‌

 తిరస్కరించిన వెంకయ్య , ఓం బిర్లా

  వెల్‌లోకి దూసుకెళ్లి టీఆర్‌ఎస్‌ నేతలు

 మూడేళ్లు ఉప్పుడు బియ్యం కొనాలి: కేకే

  మొలకలెత్తినా పట్టించుకోవడం లేదు: రేవంత్‌


న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలుపై పార్లమెంటులో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ గళమెత్తాయి. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై చర్చించాలంటూ రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవరావు, లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వర రావు, కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. అయితే, వాటిని తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దాంతో, ధాన్యం కొనుగోలు చేయాలని నినాదాలు చేస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, వెంకటేశ్‌ నేత, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లి పోడియాన్ని చుట్టుముట్టారు. రాజ్యసభలోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెల్‌లోకి వెళ్లారు. సాగు చట్టాలపై చర్చించాలంటూ అప్పటికే ఇతర పార్టీల ఎంపీలు కూడా వెల్‌లో ఉన్నందున గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో, సభ ప్రారంభమైన 13 నిమిషాలకే గంటపాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. తిరిగి ప్రారంభమైన తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం పొందిన వెంటనే మరోసారి వాయిదా వేశారు. చివరికి మధ్యాహ్నం సభను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్ల కార్డులను ప్రదర్శించారు. 


కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం: కేకే

కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కేశవ రావు మండిపడ్డారు. పంటల సేకరణలో జాతీయ విధానం తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంటు బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వాతావరణ పరిస్థితుల కారణంగా తెలంగాణలో యాసంగిలో పండే వరి పంట ఉప్పుడు బియ్యానికి అనుకూలం. కేంద్రం స్పష్టత ఇస్తే పంటల మార్పిడి అంశాన్ని రైతులకు వివరిస్తాం. రెండు, మూడేళ్ల సమయం ఇస్తే రైతులు పంట మార్పిడి వైపు వెళతారు. అంతవరకు బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలి’’ అని కేంద్రాన్ని కోరారు. కేంద్రం వైఖరితో తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోందని, రెండు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నా.. కేంద్రం చేతులు ఎత్తేసిందని నామా నాగేశ్వర రావు తప్పుబట్టారు.రైతులను, తెలంగాణను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమానిస్తోందని ఆరోపించారు.


కల్లాల్లో రైతులు వేచి చూస్తున్నారు: రేవంత్‌

పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం రైతులు కల్లాల్లో ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తాను ఇచ్చిన వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ‘‘లక్షలాది టన్నుల ధాన్యం ఇంకా కల్లాల్లో ఉంది. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం మొలకలెత్తుతోంది. అయినా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అది అత్యంత ముఖ్యమైన అంశం. కాబట్టి, ఇతర కార్యకలాపాలను వాయిదా వేసి తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై చర్చించాలి’’ అని కోరారు. తెలంగాణలో వరి రైతులు నాశనమవుతున్నారని, సకాలంలో పంటను కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు రైతుల పాలిట శాపంగా మారాయని విమర్శించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.