ఇలా ఇచ్చి..అలా కొని!

ABN , First Publish Date - 2022-05-16T06:51:42+05:30 IST

వడ్డించేవాడు మనవాడైతే కడ బంతిలో కూర్చున్నా పర్వాలేదు అన్నట్టుంది రేషన్‌ పంపిణీలో ఎండీయూ ఆపరేటర్ల తీరు.

ఇలా ఇచ్చి..అలా కొని!

  రేషన్‌ బియ్యం పంపిణీలో ఎండీయూ ఆపరేటర్ల దందా 

  అధికారికంగా కార్డుదారుల నుంచి కొనుగోలు 

  కొన్నసరుకు ఎండీయూ వాహనాల్లోనే తరలింపు 

  ట్రేడర్ల గోడౌన్లకు తీసుకు వెళ్లి అమ్మకం

  పట్టించుకోని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు 

వడ్డించేవాడు మనవాడైతే కడ బంతిలో కూర్చున్నా పర్వాలేదు అన్నట్టుంది రేషన్‌ పంపిణీలో ఎండీయూ ఆపరేటర్ల తీరు. ఇంటింటికీ రేషన్‌ బియ్యం సరఫరాను కాస్తా.. ఇంటింటికీ వెళ్లి పేదల బియ్యం కొనుగోలు పథకంగా మార్చేశారు. అవినీతి, అక్రమాలను నివారించి పారదర్శకంగా లబ్ధిదారులకు రేషన్‌ అందించేందుకు ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పుకున్న ప్రభుత్వం.. ఆచరణలో అన్నీ వదిలేసి ఇందులోనూ అక్రమాలకు అవకాశాలు కల్పించింది. ప్రభుత్వం మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్స్‌ (ఎండీయూ) ఆపరేటర్ల ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ చేయమంటే వారు ఇంటింటికీ వెళ్లి బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఆపరేటర్లలో ఎక్కువ మంది చేస్తున్న పనే ఇది. శుక్రవారం అర్ధరాత్రి భవానీపురంలో పబ్లిక్‌గా మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్‌ తన వాహనంలో కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఓ ప్రైవేటు వ్యాపారి గోడౌన్‌కు తరలించి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పట్టుబడని ఎంతో మంది ఎండీయూ ఆపరేటర్లు చేస్తున్న పని ఇదే. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణం. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

ఒకప్పుడు డీలర్ల దగ్గర నుంచి బియ్యం తీసుకువెళ్లడానికి వ్యాపారాలు భయపడాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు. ఎండీయూ వాహనాలను ఎవరూ పట్టుకోరు. తనిఖీ చేయరు. వారితో సంబంధాలు పెట్టుకుంటే చాలు. దర్జాగా గోడౌన్‌కు చేరిపోతాయి. ఈ ఫార్ములాను కనిపెట్టిన రేషన్‌ వ్యాపారులు ఎండీయూ ఆపరేటర్లకు విసిరిన గాలం పని చేస్తోంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే వ్యాపారులనే ఎండీయూ ఆపరేటర్లు డిమాండ్‌ చేసే స్థాయికి ఎదిగింది. దీంతో ఎండీయూ ఆపరేటర్లు బియ్యం పంపిణీ కంటే కూడా కొనుగోలు మీదనే ఎక్కువ దృష్టి సారించారు. ప్రతినెలా మొదటి తేదీ నుంచే ఎండీయూ ఆపరేటర్లు తమ క్లస్టర్‌ పరిధిలో కార్దుదారుల నుంచి బియ్యం కొంటున్నారు. కార్డుదారుల నుంచి వేలి ముద్ర వేయించుకుని బియ్యం పోసిన తర్వాత ఈ-పోస్‌లో అన్నీ రికార్డు అయి స్లిప్‌ వచ్చిన తర్వాత కార్డుదారులతో బేరసారాలకు దిగుతున్నారు. రేషన్‌ బియ్యాన్ని తినలేని వారు ఎండీయూ ఆపరేటర్లకు అమ్మేస్తున్నారు. ఇలా ప్రతి క్లస్టర్‌ పరిధిలోనూ సగం మంది కార్డుదారుల నుంచి ఎండీయూ ఆపరేటర్లు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని తమ దగ్గర ఉన్న గోనె సంచుల్లోనే స్టోర్‌ చేస్తున్నారు. ఈ వాహనం నిత్యావసరాల పంపిణీకి  చెందినది కాబట్టి ఎవరికీ అనుమానం రాదు. పంపిణీ పూర్తి అయిన తర్వాత అదే వాహనంలో వెళ్లిపోయి వ్యాపారుల గోడౌన్లలో దించేస్తున్నారు. బయట ఎండీయూ వాహనం కనిపిస్తే బియ్యం అమ్మటానికి వెళుతుందని అనుకోరు. పంపిణీకి వెళుతుందని మాత్రమే అనుకుంటారు. 

పట్టించుకోని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు 

ఎండీయూ ఆపరేటర్లపై పర్యవేక్షణ బాధ్యత సివిల్‌ సప్లయీస్‌ అధికారులుది. వారు ఆ బాధ్యతను గాలికి వదిలేశారు. ఇక వారి ఇష్టారాజ్యమైంది. ఎండీయూ ఆపరేటర్‌, చౌక దుకాణ డీలర్‌ నుంచి నిర్ణీత మొత్తంలో సరుకు తీసుకుని తన వాహనంలో లోడ్‌ చేసుకోవాలి. ఆ వివరాలు  రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఆరోజు పంపిణీ అయిన తర్వాత బ్యాలెన్స్‌ సరుకును డీలర్‌కు అప్పగించి మళ్లీ నమోదు చేయాలి. ఈ పని ఎండీయూ ఆపరేటర్లు చేయటం లేదు. సరుకు అయిపోయిన తర్వాత కానీ లెక్కలు, డబ్బులు అప్పగించటం లేదు. దీంతో ఎండీయూ ఆపరేటర్ల దగ్గర కొనుగోలు చేసిన బియ్యం తాలూకా అధిక నిల్వలు ఉన్న సంగతి తెలియటం లేదు. ఎండీయూ ఆపరేటర్లే ఈ-పోస్‌లను ఆపరేట్‌ చేస్తున్నారు. గతంలో వీఆర్వో, వలంటీర్లు వారి వెంట ఉండేవారు. సాఫీగా ఉండేది. వారిపై పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల రావటం లే దు. ఇది కూడా ఎండీయూ ఆపరేటర్లకు కలిసి వచ్చింది. 

అన్ని దశల్లోనూ పర్యవేక్షణే పరిష్కారం 

ఎన్టీఆర్‌ జిల్లాలో 950 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 374 ఎండీయూ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు బయలుదేరిన దగ్గర నుంచి పంపిణీ పూర్తి చేసే వరకు ఎలాంటి పర్యవేక్షణ లేదు. వీటి క్లస్టర్‌ పరిధిలోనే తిరుగుతున్నాయా? లేక బయట తిరుగుతు న్నాయా? ఎక్కడ ఉంటున్నా యన్నది లేదు. స్టేజ్‌-2 రవాణాలో వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు అమర్చారు. ఎండీయూ వాహ నాలకు కూడా జీపీఎస్‌ పరికరాలను ఏర్పాటు చేస్తే అవి తమ క్లస్టర్‌ పరిధిలో కాకుండా ఎక్కడ తిరుగుతున్నాయో తెలు సుకుని విచారణ జరపవచ్చు. రేషన్‌ పంపిణీ చేసే ప్రతిరోజూ సివిల్‌ సప్లయీస్‌ అధికారులు, రేషన్‌ డీటీలు, తహసీల్దార్లు ఇలా ర్యాండమ్‌గా ఎండీయూ వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తే దొంగలు దొరికిపోతారు. 


Updated Date - 2022-05-16T06:51:42+05:30 IST