మిల్లింగ్‌ చేస్తే నష్టాలే!

ABN , First Publish Date - 2022-05-05T05:30:00+05:30 IST

యాసంగి ధాన్యం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు మిల్లర్లు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయడం కష్టమేనని చేతులెత్తేస్తున్నారు. ఉష్ణోగ్రతల ప్రభావంతో యాసంగిలో వచ్చే ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చితే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. నష్టాన్ని ప్రభుత్వం భరిస్తేనే మిల్లింగ్‌ చేయడం సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. సీఎంఆర్‌ నామ్స్‌కి తగినట్టు క్వింటాలు వడ్లకు 67 కిలోల బియ్యం ఇవ్వలేమని, యాసంగిలో ముడిబియ్యం కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే వస్తాయంటున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు 37 కిలోల బియ్యాన్ని మిల్లర్‌ నష్టం కింద భరించాల్సి వస్తుందని చెబుతున్నారు.

మిల్లింగ్‌ చేస్తే నష్టాలే!

సీఎంఆర్‌ చేయలేమని చేతులెత్తేస్తున్న మిల్లర్లు

యాసంగి ధాన్యంలో బియ్యం కంటే నూకే ఎక్కువ

టైం ఇచ్చి నష్టం భరిస్తే ఓకే అంటున్న మిల్లర్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 5: యాసంగి ధాన్యం ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు మిల్లర్లు. కస్టమ్‌ మిల్లింగ్‌ చేయడం కష్టమేనని చేతులెత్తేస్తున్నారు. ఉష్ణోగ్రతల ప్రభావంతో యాసంగిలో వచ్చే ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చితే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. నష్టాన్ని ప్రభుత్వం భరిస్తేనే మిల్లింగ్‌ చేయడం సాధ్యమని స్పష్టం చేస్తున్నారు. సీఎంఆర్‌ నామ్స్‌కి తగినట్టు క్వింటాలు వడ్లకు 67 కిలోల బియ్యం ఇవ్వలేమని, యాసంగిలో ముడిబియ్యం కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే వస్తాయంటున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు 37 కిలోల బియ్యాన్ని మిల్లర్‌ నష్టం కింద భరించాల్సి వస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో యాసంగి వరి పంట మొత్తం బాయిల్డ్‌ రైస్‌కు మాత్రమే పని చేస్తుంది. బాయిల్డ్‌ రైస్‌తో ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇవ్వొ చ్చు. కానీ యాసంగా వడ్లను ముడి బియ్యం సీఎంఆర్‌ ఇవ్వడం కుదరదని మిల్లర్లు తేల్చిచెబుతున్నారు. 


నష్టాన్ని ప్రభుత్వం భరిస్తేనే

యాసంగి ధాన్యాన్ని ముడి బియ్యంగా మార్చడంతో కలిగే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే మిల్లింగ్‌ చేయడానికి తమకు అభ్యంతరం లేదని మిల్లర్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్‌ ధాన్యం క్వింటాలుకు రూ. 1,960, సాధారణ వడ్లకు రూ.1,940 చెల్లించి కొనుగోలు చేస్తున్నది. మిల్లర్‌కు ప్రభుత్వం క్వింటాలు వడ్లు ఇచ్చి 67 కిలోల బియ్యం తీసుకుంటున్నది. అంటే సగటున కిలో బియ్యానికి రూ. 29 రూపాయలు ఖర్చు అవుతున్నది. ఈ లెక్కన యాసంగిలో మిల్లర్‌ నష్టపోయే 37 కిలోల బియ్యానికి రూ. 1,073 అవుతుంది. ఇంత నష్టం భరించడం తమవల్ల కాదని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. 


ప్రభుత్వం నుంచి స్పష్టత కరువు

యాసంగి ధాన్యం మిల్లింగ్‌ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలను ఖరారు చేయలేదని మిల్లర్లు చెబుతున్నారు. క్వింటాలుకు సుమారు రూ.600 వరకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఇందులో సగం ప్రభుత్వం భరించాలని కోరారు. మిగిలిన సగం మిల్లర్లు భరిస్తామని ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచినట్టు తెలిసింది.  కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని మిల్లర్లు చెబుతున్నారు. 

 క్వింటాలు వడ్లు మరాడిస్తే కనీసం 30 కిలోల బియ్యం వచ్చినా మిగిలిన నష్టాన్ని నూక అమ్మడం ద్వారా భరించవచ్చన్న అభిప్రాయంతో మిల్లర్ల సంఘం నాయకులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మార్కెట్‌లో లాంగ్‌లెంత్‌ బ్రోకెన్‌ (దొడ్డు నూక) క్వింటాలు ధర రూ. 1,850 వరకు ఉంది. షార్ట్‌లెంత్‌ బ్రోకెన్‌ (సన్న నూక) ధర రూ. 1,450, పరం క్వింటాలుకు రూ. 1,200 వరకు ధర పలుకుతున్నది. యాసంగి ధాన్యాన్ని మరాడించడంతో ద్వారా వచ్చే దొడ్డు నూకకు ధర ఎక్కువగా ఉన్నందున నష్టాన్ని పూడ్చుకోవచ్చు. అలా కాని పక్షంలో క్వింటాలు వడ్లకు మిల్లర్ల నుంచి రూ.1,600 చొప్పున ప్రభుత్వం తీసుకుని, మిగిలిన నష్టాన్ని ప్రభుత్వం భరించినా సరేనని మిల్లర్లు అంటున్నారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ లెక్కన మిల్లర్లకు విక్రయించడం ద్వారా ఎవరికీ నష్టం జరగకుండా ఉంటున్నదని మిల్లర్ల వాదన. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని తాము బాయిల్డ్‌ రైస్‌గా మార్చుకుని సొంతంగా ఎగుమతి చేసుకుంటామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నారు. లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలంటే కోట్లాది రూపాయలు అవసరం. అంత మొత్తం ఒకేసారి చెల్లించడం అసాధ్యం కాబట్టి ప్రభుత్వం మిల్లర్లకు 6 నెలల గడువు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ యాసంగి ధాన్యం మిల్లింగ్‌పై బహిరంగంగా మాట్లాడడానికి మిల్లర్లు ముందుకు రావడంలేదు.


 మా పరిధిలో లేదు - శ్రీనివాస్‌, డీఎ్‌సవో, మెదక్‌ 

యాసంగి ధాన్యం కొనుగోలు చేయడం, మిల్లులకు తరలించడమే మా పని. మిల్లింగ్‌ చేయడం వల్ల మిల్లర్‌కు కలిగే నష్టం వంటి అంశాలు మా పరిధిలోకి రావు. ఆయా అంశాలు చీఫ్‌ సెక్రటరీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ పరిధిలోకి వస్తాయి.

Read more