‘సమగ్ర ధాన్యం, బియ్యం’ విధానం

ABN , First Publish Date - 2020-03-31T09:06:50+05:30 IST

రాష్ట్రంలో వరి దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం’ విధానాన్ని రూపొందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

‘సమగ్ర ధాన్యం, బియ్యం’ విధానం

ముసాయిదాపై కేబినెట్‌, అసెంబ్లీలో చర్చించి ఆమోదం

వచ్చే సీజన్‌లో కోటి టన్నులకు పైగా ధాన్యం దిగుబడి

బిహార్‌ హమాలీలను రప్పిస్తాం

రైస్‌మిల్లర్లు, అధికారుల ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌

సీఎంఆర్‌ఎఫ్‌కు రైస్‌ మిల్లర్స్‌ విరాళం

రూ.50 లక్షలు అందజేత


హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం’ విధానాన్ని రూపొందించనున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రైస్‌మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి ఈ విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో, అసెంబ్లీలో చర్చించి ఆమోదిస్తామన్నారు. రాష్ట్రంలో వరి సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతులు తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సోమవారం రాష్ట్ర మంత్రులు, అధికారులు, రైస్‌ మిల్లర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ‘‘ఉమ్మడి ఏపీలో ఉన్న పరిస్థితికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు వల్ల రాష్ట్రంలో వరిసాగు పెరుగుతోంది. ఈసారి యాసంగిలో 40లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. కోటి టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పండే అవకాశం ఉంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. తెలంగాణ ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా మారుతుంది’’ అని అన్నారు.


అవకాశంగా మార్చుకోండి..

‘‘రాష్ట్రవ్యాప్తంగా 2,200 రైస్‌ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. 20-30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. 24 గంటల కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంటుంది. మరికొన్ని మిల్లులు రావాలి. రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం చేస్తాం’’ అన్నారు. రైస్‌మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవని సీఎం హామీ ఇచ్చారు.


హమాలీల కోసం..

రాష్ట్రంలోని రైసు మిల్లుల్లో పనిచేేస హమాలీలు.. కరోనా వైరస్‌ ప్రభావంతో తమ సొంత రాష్ట్రమైన బిహార్‌కు వెళ్లారని, రబీ ప్రొక్యూర్‌మెంట్‌ సీజన్‌ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో రైసు మిల్లుల స్థాపనకు పారిశ్రామికవాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని, రైసు మిల్లులను ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్స్‌గా గుర్తించి, అసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవని, ఇప్పుడు 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి చేరాయని తెలిపారు. ఆ సామర్థ్యాన్ని 40 లక్షల టన్నులకు తీసుకుపోతామన్నారు. రైసు మిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని చెప్పారు. అలాగే.. రాష్ట్రంలో రైసు మిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని, రైస్‌ మిల్లుల ఎల్‌టీ కేటగీరిని 70హెచ్‌పీ సామర్థ్యం నుంచి 150హెచ్‌పీకి పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.


వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి డా.బి.జనార్దన్‌ రెడ్డి, సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్‌, మోహన్‌ రెడ్డి, నాయకులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కాగా.. ముఖ్యమంత్రి సహాయనిధికి తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రూ.50 లక్షల విరాళం ఇచ్చింది.

Updated Date - 2020-03-31T09:06:50+05:30 IST