Abn logo
Aug 4 2021 @ 01:13AM

కస్టమ్‌ మిల్లింగ్‌ మాయానా!

గౌతమి సురేష్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌

సివిల్‌ సప్లైస్‌ అధికారుల అండతో అడ్డగోలుగా కేటాయింపులు

చేబ్రోలు రైస్‌మిల్‌ వ్యవహారంలో భారీగా వెలుగుచూస్తున్న లోపాలు

బ్యాంకు గ్యారంటీలు లేకుండా ధాన్యం నిల్వలు ఎలా తరలించారు

జిల్లాలో పలుచోట్ల ఇదే తరహా వ్యవహారాలు

అయిన వారి కోసం నిబంధనలకు నీళ్లు

పిఠాపురం/గొల్లప్రోలు రూరల్‌, ఆగస్టు 3: అయిన వారికి నిబంధనలు అడ్డురావడం లేదు.. బ్యాంకు గ్యారంటీలు లేకున్నా అడ్డగోలుగా కేటాయింపులు ఇచ్చేస్తున్నారు.. ఆపై తనిఖీలు చేయడం లేదు.. ఫలితంగా ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయగా వచ్చిన బియ్యాన్ని మార్కెట్‌లో విక్రయించి వచ్చిన సొమ్ముతో కొందరు రైసుమిల్లుల నిర్వాహకులు దర్జాగా బిజినెస్‌ చేసుకుంటున్నారు. తీరా వారు చేతులెత్తేశాక అధికారులు చర్యలకోసం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.  ఖరీఫ్‌, రబీ సీజన్‌ల్లో పండిన ధాన్యాన్ని రైతులు వద్ద నుంచి రైతుభరోసా కేంద్రాలు, మహిళా, రైతు గ్రూపులు, సొసైటీలు ద్వారా ప్రభుత్వం (ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేష న్‌) కొనుగోలు చేసి డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి జమచేస్తోంది. ఈవిధంగా సేకరించిన ధాన్యాన్ని రేషన్‌షాపుల ద్వారా బియ్యంగా కార్డుదారులకు అందించేందుకు మిల్లింగ్‌ నిమిత్తం ఎంపికచేసిన రైసుమిల్లులకు అప్పగిస్తారు. ఆ మిల్లులు ధాన్యాన్ని ఆడి బియ్యాన్ని మళ్లీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌కు అప్పగించాలి. ఇందుకుగానూ మిల్లర్లుకు ప్రభుత్వం కొంత కమీషన్‌ చెల్లిస్తుంది. కానీ ధాన్యాన్ని మిల్లులకు ఇవ్వాలంటే రైస్‌మిల్లుల యాజమానులు ప్రభుత్వానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలి. నిబంధనలకు ప్రకారం బ్యాంకు గ్యారంటీకి సరిపడా మొత్తానికి మాత్రమే ధాన్యం నిల్వలను రైస్‌మిల్లులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రతి సీజన్‌లో ఇందుకు మినహాయింపులు ఇస్తూ రెట్టింపు మొత్తానికి సరిపడా నిల్వలు ఇస్తున్నారు. ఈ కేటాయింపులన్నీ జాయింట్‌ కలెక్టరు (రెవెన్యూ) పర్యవేక్షణలో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ అధికారులు చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు సివిల్‌ సప్లైస్‌ అధికారులు చక్రం తిప్పుతూ మిల్లర్లతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని అధికంగా కేటాయింపులు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గౌతమి సురేష్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌ వ్యవహారంలో ఇదేవిధంగా జరిగింది.

బ్యాంకు గ్యారంటీకంటే 6 రెట్లు అధికంగా...

చేబ్రోలు రైసుమిల్లు యజమానులు బ్యాంకు గ్యారంటీగా రూ.1.40 కోట్లు చూపించారు. వీరికి రూ.2.80 కోట్లకు మించి ధాన్యం నిల్వలు కేటాయించకూడదు. కానీ ఒక్క రబీ సీజన్‌లోనే రూ.8 కోట్ల విలువైన ధాన్యం ఈ మిల్లుకు కేటాయించారు. కస్టమ్‌ మిల్లింగ్‌ కేటాయింపులు ఎంత అడ్డగోలుగా ఉన్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఈ మిల్లు బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు రుణాలు వసూలుకు స్వాధీన ప్రకటన చేసినప్పటికి, దానిని పట్టించుకోకుండా సివిల్‌ సప్లైస్‌ అధికారులు కేటాయింపులు చేయడం వెనుక ఒక మంత్రి హస్తం ఉన్నట్టు చెబుతున్నారు. మిల్లు నిర్వాహకులు ఆయన అనుచరులుగా ప్రచారం జరుగుతోంది. ఇక పోలీసులకు జేసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూ.7.92 కోట్ల విలువైన 3589.78 టన్నుల ధాన్యం నిల్వలు పక్కదారి పట్టాయి. (ఇందులో అధిక శాతం ధాన్యం కొనుగోలు ఎంట్రీలను తనిఖీల తర్వాత ఆన్‌లైన్‌ నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు). వీటిని అగ్రహారం, చెందుర్తి, నాగులాపల్లి, కొమరగిరి, సర్పవరం, నవర, చేబ్రోలు తదితర సొసైటీల ద్వారా వచ్చినట్టు రికార్డులో ఉన్నాయి. చేబ్రోలు మిల్లు నిర్వాహకులు పకడ్బందీ ప్రణాళికతో తమ బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితుల పేరు మీద ధాన్యం లేకుండా కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించి సదరు మొత్తాలను స్వాహా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. బ్యాంకు గ్యారంటీకి ఏకంగా ఆరు రెట్లు అధికంగా ధాన్యం కొనుగోలు అనుమతులు ఒకే మిల్లుకు ఎలా ఇచ్చారు, ఇందులో పాత్ర ఉన్న అధి కారులపై ఏం చర్యలు తీసుకున్నారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. జిల్లాలో ఇదే తరహాలో పలు రైస్‌మిల్లులకు బ్యాంకు గ్యారంటీలకు మించి కేటాయింపులు జరిపినట్టు సమాచారం. అయితే వారు కస్టమ్‌ మిల్లింగ్‌ సక్రమంగా చేస్తూ గడువులోగా ప్రభుత్వానికి బియ్యం ఇస్తూ వ్యవహారాలను సదరు అధికారుల కనుసన్నల్లో చక్కబెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యవహారంలో సివిల్‌ సప్లైస్‌ అధికారులు సొసైటీలు, మహిళా, రైతు గ్రూపులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యుల కు నోటీసులిచ్చారు. తాము ధాన్యాన్ని మిల్లుకు పంపామని, అందుకు సంబంధించిన రశీదులు తమ వద్ద ఉన్నాయని సమాధానమిచ్చారు.

పౌరసరఫరాల సంస్థకు ఒక్క పైసా నష్టం జరగలేదు

ఆన్‌లైన్‌లో కొనుగోలు ఎంట్రీలు తొలగించాం : జేసీ

గౌతమి సురేష్‌ రైస్‌ ఇండస్ట్రీస్‌లో జరిగిన కస్టమ్‌ మిల్లింగ్‌కు కేటాయించిన ధాన్యం వ్యవహారంలో పౌరసరఫరాల సంస్థకు ఒక్క రూపా యి నష్టం జరగలేదు. 2020-21 రబీ సీజన్‌లో ఈ మిల్లుకు మొత్తం 3,805.580 టన్నుల ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం కేటాయించాం. జూలై 5న సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజరు మిల్లులో తనిఖీలు నిర్వహించగా అక్కడ కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యం స్టాకు లేనట్టు గుర్తించారు. మిల్లరు తనకు అలాట్‌ చేసిన ధాన్యం పక్కదారి పట్టించారని, కొంత ధాన్యం మిల్లుకు రాకుండానే వచ్చినట్టు చూపించారని తేలడంతో ఆన్‌లైన్‌ తప్పుగా నమోదుచేసిన కొనుగోలు ఎంట్రీలను తొలగింపజేశాం. మిల్లరు ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ రూ.1.40 కోట్లను సివిల్‌ సప్లైస్‌ ఖాతాలో జమచేశాం. మిల్లుకు రాని ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో తొలగించడం ద్వారా తగ్గించగా 720.4 టన్నుల ధాన్యం తాలూకా బియ్యం రావాల్సి ఉండగా, మిల్లరు నుంచి 144.652 టన్నుల బియ్యం వచ్చింది. రావాల్సిన బియ్యం, గోనెసంచెల విలువ కలిపి 1.13 కోట్లు ఉండగా ఈ మొత్తాన్ని గ్యారంటీ సొమ్ములో మినహాయించాం.