Abn logo
Nov 30 2020 @ 04:50AM

‘దొడ్డు’ మనసు!

సన్నాలు వద్దు.. దొడ్డు ధాన్యమే ముద్దు.. కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇది

19.90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు.. అందులో సన్నాల వాటా నాలుగోవంతే

15.59 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం కొన్న వైనం.. రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడే అధికం

గత్యంతరంలేక రైస్‌మిల్లర్లకు విక్రయాలు.. నష్టపోతున్నామంటున్న అన్నదాతలు 


హైదరాబాద్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అంతా రివర్స్‌గా జరుగుతోంది. రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉంటే వాటిని కొనకుండా దొడ్డు ధాన్యాన్నే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు మిల్లర్లకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 19.90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలుచేస్తే అందులో దొడ్డు ఽధాన్యం 15.59 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, సన్నధాన్యం కేవలం 4.31 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.


వానాకాలంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేసిన విషయం తెలిసిందే. ఇందులో సన్నరకాలు 34.45 లక్షల ఎకరాల్లో, దొడ్డు రకాలు 13.33 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. సాగు విస్తీర్ణం లెక్కప్రకారం సన్న ధాన్యం 98.61 లక్షల మెట్రిక్‌ టన్నులు, దొడ్డు ధాన్యం 33.33 లక్షల మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం 131.94 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రైస్‌మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసేది, రైతులు నిల్వచేసుకునేది పోగా 85 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలు వేశారు. 


సన్నాలు ఎందుకు కొనట్లేదు?

సీఎం ఆదేశాల మేరకు రైతులు సన్నరకాలే ఎక్కువ సాగు చేశారు. అలాంటప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. కానీ, ఆ పరిస్థితి లేదు. అలాగే, కేంద్ర ప్రభుత్వం సన్న, దొడ్డు రకాలు అని వేరుగా చూడదు. ఏ-గ్రేడుకు రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 చొప్పున ధర ప్రకటించింది. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల జిల్లాల్లో సన్నాల కంటే దొడ్డురకాలే ఎక్కువ కొన్నారు. ఆసిఫాబాద్‌లో 421, మంచిర్యాలలో 22, సిద్దిపేటలో 935, జగిత్యాలలో 712, నల్లగొండలో 598, నాగర్‌ కర్నూల్‌లో 553, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 192, వికారాబాద్‌లో 41 టన్నులు మాత్రమే సన్నధాన్యం కొనుగోలుచేశారు. అతి తక్కువ సన్నధాన్యం కొనుగోలు చేసిన జిల్లాలు అవి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం సక్రమంగా కొనుగోలు చేస్తుండకపోవటంతో అన్నదాతలు రైస్‌ మిల్లుల బాట పడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లో రైస్‌మిల్లుల వద్ద ట్రాక్టర్లు క్యూ కడుతున్నాయి.


ఎమ్మెస్పీ కంటే ఎక్కువ ధర ఇస్తున్నట్లు చెబుతున్నా.. ధాన్యం రంగు మారిందని, తడిసిందని, తాలు ఉన్నదని రకరకాలు సాకులు చెబుతూ మిల్లర్లు కోత పెడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో జైశ్రీరాం రూ.2,100, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.1,900, హెచ్‌ఎంటీ రూ.1,900, బీపీటీ రూ.1,650కు చొప్పున మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో జైశ్రీరాం రూ.2,100, హెచ్‌ఎంటీ రూ.2వేలు, ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.1,900, బీపీటీ రూ.1,850 చొప్పున ధర  పెడుతున్నట్లు మిల్లర్లు చెబుతున్నారు. కానీ కోత, తరుగుతో రైతుకు వచ్చే రాబడి తగ్గిపోతోంది. సన్న రకాలు తానే సాగుచేయాలని చెప్పానని, ధర కూడా ఎక్కువ ఇప్పిస్తానని చెప్పానని, తాను మాటిస్తే తప్పే రకం కాదని కేసీఆర్‌ అక్టోబర్‌ 31న జనగామ జిల్లా కొడకండ్ల సభలో అన్నారు. క్వింటాలుకు రూ.100-150 ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు.

Advertisement
Advertisement
Advertisement