రంగుమారిన ధాన్యం కొనేదెలా?

ABN , First Publish Date - 2020-12-02T06:14:30+05:30 IST

వరుస ప్రకృతి వైపరీత్యాలతో తడిసి ముద్దయి రంగుమారిన, మొలకలెత్తిన ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి పెనుసవాలుగా మారనుంది. రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన అమలుకోసం

రంగుమారిన ధాన్యం కొనేదెలా?
విలసలో మొలకలెత్తిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు

సవాలక్ష నిబంధనలు అమలుచేస్తున్న కొనుగోలు కేంద్రాలు

రంగుమారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి

రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడుతున్న అన్నదాతలు

అధికార, ప్రతిపక్ష నేతలు పరామర్శలకే పరిమితం

అయినకాడికి కొంటున్న మధ్య దళారీలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వరుస ప్రకృతి వైపరీత్యాలతో తడిసి ముద్దయి రంగుమారిన, మొలకలెత్తిన ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి పెనుసవాలుగా మారనుంది. రంగు మారిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన అమలుకోసం నష్టపోయిన రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తు న్నారు. నివర్‌ తుఫాను ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా చేతికంది వచ్చిన పంట కళ్లముందే తడిసి ముద్దయింది. ఇప్పుడు ఆ ధాన్యాన్ని సంరక్షించుకునే పనిలో అన్నదాతలు నిమగ్న మయ్యారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రోడ్లపై రంగు మారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని ఒబ్బిడి చేసుకునే పనిలో ఉన్నారు. అదును చూసుకుని మధ్య దళారీలు తడిసిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సేద్యం జరిగింది. వరదలు, భారీవర్షాలు, నివర్‌ తుఫాను ప్రభావంతో లక్షన్నర ఎకరాలకు పైగా పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. రూ.300 కోట్లకు పైబడి నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 13 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. అయితే ఇప్పుడు రైతులంతా రంగుమారిన ధాన్యం కొనుగోలుపైనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 


ప్రస్తుతం తడసి ముద్దయిన ధాన్యాన్ని రహదారులపై ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. ఎకరాకు పండిన పంటలో ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యం నష్టపోవడంతో పాటు మిగిలిన ధాన్యం నామమాత్రపు ధరకే కొనుగోలుచేసే పరిస్థితులు ఉన్నాయని రైతు సంఘ నాయకుడు మట్టా మహాలక్ష్మిప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ ధరకు కొనుగోలుచేసే విషయంలో ప్రస్తుతం అమలుచేస్తున్న నిబంధనలన్నీ సడలించి రైతులను ఆదుకోవాలని గోపవరంకు చెందిన కోనసీమ రైతు పరిరక్షణ సంఘం కార్యదర్శి అయితాబత్తుల ఉమామహే శ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, షరతులు లేకుండా రైతలు నుంచి నేరుగా తడిసి, రంగుమారిన, మొలకలెత్తిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. కోనసీమ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. పడిపో యిన పంటచేలు కూలీలతో కోయించి నూర్పిళ్లు చేయడానికి సాధారణ వ్యయంకంటే అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేల ఖర్చు అవుతుం దని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారి ఖరీఫ్‌ పంట మొత్తం ఆది నుంచి పంట కోతలు కోసేవరకు ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పూర్తిగా నాశనమైపోయిందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధి కార, ప్రతిపక్ష నేతలు కుళ్లికంపు కొడుతున్న పంట చేలను పరిశీలించి రైతుల కష్టాలను వినడం తప్ప వారిని ఆదుకునే మార్గాలపై ఏ ఒక్కరూ స్పందించకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే అవి పశువుల దాణాకు తప్ప దేనికీ పనికిరావని అంటున్నారు. నష్టపోయిన రైతాంగానికి ఇన్స్యూ రెన్సుతోపాటు పరిహారాన్ని అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-12-02T06:14:30+05:30 IST