వెయ్యి అందేనా?

ABN , First Publish Date - 2020-04-04T11:09:35+05:30 IST

స్వీయ నియంత్రణలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు అందరికీ అందేనా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతోంది.

వెయ్యి అందేనా?

రైస్‌ కార్డులు ఉన్న వారికే ప్రాధాన్యం?

వలంటీర్ల మ్యాపింగ్‌లో కనిపించని కొంతమంది పేర్లు 

జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల మంది ఉన్నట్లు అంచనా

నేటి నుంచి వలంటీర్ల ద్వారా పంపిణీ 


గంట్యాడ/ విజయనగరం(ఆంధ్రజ్యోతి)/ పార్వతీపురం, ఏప్రిల్‌ 3: స్వీయ నియంత్రణలో ఉన్న పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలు అందరికీ అందేనా? అన్న సందేహం చాలా మందిలో కలుగుతోంది.  రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉదయం నుంచి  లబ్ధిదారులకు రూ.1000 చొప్పున సాయం అందించాలని నిర్ణయించింది.  ఇందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆ డబ్బుల కోసం కార్యదర్శులు శుక్రవారం బ్యాంకులకు వెళ్లి విత్‌ డ్రా చేసి గ్రామ వలంటీర్లకు అందజేశారు. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రైస్‌ కార్డులు పొందిన వారందరికీ రూ.1000 చొప్పున అందజేయాలని సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ మేరకు  వలంటీర్లు తమ లాగిన్‌లో ఉన్న అర్హుల జాబితా వివరాలను యాప్‌లో పెట్టారు. రైస్‌ కార్డులు పొందిన వారి పేర్లన్నీ వలంటీర్ల లాగిన్‌లో లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారికి వెయ్యి సాయం అందుతుందా? లేదా? అనేది సందేహంగా మారింది. 


జిల్లా వ్యాప్తంగా 6లక్షలు 54 వేల రైస్‌ కార్డులు మంజూరు చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ కిశోర్‌ కుమార్‌ గతంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంజూరు చేసిన కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వలంటీర్ల జాబితా ప్రకారం జిల్లాలో 6,47934 మంది పేర్లు మాత్రమే యాప్‌లో ఉన్నాయి. ఆ మేరకే రూ.6,47,93,400 మంజూరు చేశారు. జేసీ వెల్లడించిన లెక్కల ప్రకారం మంజూరైన రైస్‌ కార్డులకు, ఇప్పుడు వలంటీర్ల వద్ద ఉన్న రైస్‌ కార్డుల జాబితాకు సుమారు 10 వేల పేర్లు తేడా వస్తున్నాయి. ఎవరి పేర్లు యాప్‌లో  లేవు అనేది డబ్బులు పంపిణీ చేసినప్పుడు తెలుస్తుంది. రైస్‌ కార్డు తీసుకుని ఆర్థిక సాయం అందకపోతే ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో మండలానికి 20,277 రైస్‌ కార్డులు మంజూరు చేశారు.


వలంటీర్ల యాప్‌లో  ఉన్న ప్రకారం మండలానికి  20,100 మందికి మాత్రమే డబ్బులు మంజూరు చేశారు. మిగిలిన 177 మంది పరిస్థితిపై   సంబంధిత అధికారులు సృష్టత ఇవ్వలేకపోయారు. రైస్‌ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాకుండా ఇలా ఇవ్వడం  వల్లనే కొందరికి నష్టం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని గంట్యాడ ఎంపీడీవో నిర్మలాదేవి వద్ద ప్రస్తావించగా రూ.వెయ్యి ఆర్థిక సాయానికి సంబంధించి అర్హుల జాబితాను వలంటీర్ల లాగిన్‌లో ప్రభుత్వం చేర్చిందని, ఈ మేరకు పేదలకు వారే ఆర్థిక సాయం అందజేస్తారని వెల్లడించారు.

Updated Date - 2020-04-04T11:09:35+05:30 IST