వరి.. తప్పిన సర్కారు గురి!

ABN , First Publish Date - 2022-01-25T07:36:48+05:30 IST

రాష్ట్రంలో వరి దిగుబడి, కొనుగోళ్ల విషయంలో సర్కారు గురి తప్పింది. ధాన్యం కొనుగోళ్లపై

వరి.. తప్పిన సర్కారు గురి!

  • రాష్ట్రంలో 1.30 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా..
  • 40 లక్షల టన్నుల బియ్యానికే కేంద్రం లక్ష్యం
  •  సేకరణ పెంచాలని రాష్ట్ర సర్కారు ఒత్తిడి
  •  మరో 6 లక్షల టన్నులను పెంచిన కేంద్రం
  •  69 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే చాలు..
  •  రాష్ట్రంలో ఆ మేరకు పూర్తయిన కొనుగోళ్లు
  •  6878 కొనుగోలు కేంద్రాల్లో 6527 మూసివేత
  •  69 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్న కేంద్రం


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి దిగుబడి, కొనుగోళ్ల విషయంలో సర్కారు గురి తప్పింది. ధాన్యం కొనుగోళ్లపై లెక్క తప్పింది. ఈ వానాకాలంలో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందని, 1.30 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తెచ్చింది. అయితే 40 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుమించి కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్ర మంత్రులు ఢిల్లీ వెళ్లి పలువురు మంత్రులను కలిసి ధాన్యం సేకరణను పెంచాలని కోరారు. కేంద్రం కొనకపోతే ధాన్యాన్ని తామే కొనుగోలు చేసి ఢిల్లీలో పారబోస్తామని హెచ్చరించారు కూడా.


కానీ, తాజాగా ధాన్యం కొనుగోలు దాదాపు ముగియడంతో కేసీఆర్‌ సర్కారు లెక్కలు తప్పాయన్న విషయం స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా రైతుల నుంచి చివరి గింజ వరకూ కొన్నా, కేంద్రం ఏ మేరకు బియ్యం కొంటామని చెప్పిందో.. సరిగ్గా అంతే మొత్తానికి సరిపడా ధాన్యం సేకరణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మేరకు 40 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాలంటే.. రాష్ట్రంలో 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే సరిపోతుంది.


అయితే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ఈ ఏడాది 1.30 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి తొలుత రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కానీ, కేంద్రం టార్గెట్‌ పెంచలేదు. తర్వాత లేఖలు, మాటల యుద్ధం నడిచింది. కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. మరో 6 లక్షల టన్నుల బియ్యం అదనంగా తీసుకుంటామని లేఖ పంపించింది. దీంతో తెలంగాణ నుంచి తీసుకునే బియ్యం టార్గెట్‌ 46 లక్షల టన్నులకు పెరిగింది. ఇంత బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాలంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి సుమారు 69 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 69 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.


అయితే రాష్ట్ర ప్రభుత్వం ఊహించినంత మేరకు ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు రాలేదు. సుమారు 20 లక్షల టన్నుల వరకు రైస్‌ మిల్లర్లు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. రైతులు కూడా ఆహార, విత్తన అవసరాలకు కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. దీంతో 69 లక్షల టన్నుల వరకు ధాన్యం సేకరణ జరిగింది. మరో వారం పాటు జరిగే కొనుగోళ్లు కలిపినా 70 లక్షల టన్నులు దాటే పరిస్థితి కనిపించడం లేదు.


నెలాఖరు వరకు వడ్ల కొనుగోలు..

రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు దాదాపు ముగిశాయి. ఈ నెలాఖరు వరకు కేంద్రాలను తెరిచి ఉంచి, తర్వాత మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. 6,878 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 69 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. సుమారు 13 లక్షల మంది రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించారు.


ఇప్పటి వరకు 24 జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తవడంతో 6,527 కేంద్రాలను మూసివేశారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 351 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోంది. ఈ కేంద్రాలకు రోజుకు 8-9 వేల టన్నుల వరకు ధాన్యం వస్తోంది.


ఎప్పటికప్పుడు సేకరించిన ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు పంపిస్తున్నారు. మిల్లర్లు ధ్రువీకరించిన తర్వాతే రైతులకు ఓపీఎమ్మెస్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. రైతులకు ఇంకా రూ.2,620 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. కాగా, వానాకాలం సీజన్‌లో తెలంగాణలో 69.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయినట్లు కేంద్ర ఆహార శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. 


Updated Date - 2022-01-25T07:36:48+05:30 IST