పేదలకు సన్న బియ్యం

ABN , First Publish Date - 2020-12-05T03:46:07+05:30 IST

కరోనా పుణ్యమా అని రేషన్‌ లబ్ధిదారులకు సన్న బియ్యం అందుకునే అదృష్టం లభించింది.

పేదలకు సన్న బియ్యం
రేషన్‌దుకాణం

-రేషన్‌షాపుల ద్వారా పంపిణీకి నిర్ణయం

-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-జిల్లాకు అందుబాటులో 3900 మెట్రిక్‌ టన్నులు 

-1.35 లక్షల మంది లబ్ధిదారులు

-పాఠశాలల కోసం నిల్వ ఉంచిన బియ్యం పంపిణీ

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

కరోనా పుణ్యమా అని రేషన్‌ లబ్ధిదారులకు సన్న బియ్యం అందుకునే అదృష్టం లభించింది. ఇన్నాళ్లు దొడ్డు బియ్యంతోనే సరిపుచ్చుకున్న లబ్ధిదారులకు రేషన్‌ దుకాణాల ద్వారా తాజాగా సన్న బియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు మధ్యాహ్న భోజనం కోసం, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం సేకరించి పెట్టిన బియ్యం నిల్వలను డిసెంబరు కోటా కింద రేషన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రస్తుతం డీలర్ల ద్వారా అందుబాటులో ఉన్న నిలువలను బట్టి బియ్యం, సభ్యుల నిష్పత్తి ప్రకారం పంపిణీని ప్రారంభించింది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలసరి కోటా కింద 24 కిలోల బియ్యం అందిస్తుండగా ఇన్నాళ్లు లబ్ధిదారులకు దొడ్డు బియ్యమే సరఫరా చేశారు. కాగా గోదాముల్లో నిలువ ఉన్న సన్న బియ్యం చాలా కాలం నిలువ ఉండే పరిస్థితి లేకపోవడంతో అవి పాడవక ముందే పంపిణీ చేయాలన్న ఉద్దేశ్యంతో జిల్లాలోని ఐదు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా రేషన్‌ డీలర్లకు సన్న బియ్యాన్ని జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. 

జిల్లాలో మొత్తం 3900 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం అందుబాటులో ఉండగా ఇందులో డిసెం బరు కోటాకు గాను ప్రభుత్వ ఆదేశాలను అనుస రించి 2500 మెట్రిక్‌ టన్నులను విడుదల చేశారు. మరో 1400 మెట్రిక్‌ టన్నులు గోదాంల్లో అందు బాటులో ఉన్నాయి. అయితే జిల్లాలోని 1,35,737 మంది లబ్ధిదారులకు ఈబియ్యం సరిపోయే పరిస్థితి లేకపోవడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో అందు బాటులో ఉన్న పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల సంఖ్యతో విభజించి ఒక్కో రేషన్‌కార్డు దారుడికి సగటున పది కిలోలు సన్న బియ్యం, 14 కిలోల దొడ్డు బియ్యంను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్న కార్డు హోల్డర్‌కు పది కిలోల సన్న బియ్యం, ఒక కిలో దొడ్డు బియ్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సన్న బియ్యం అందుకునే భాగ్యం అందరికీ దక్కలేదు. కేవలం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) స్టాక్‌ పాయింట్లలో ఉన్న రేషన్‌ డీలర్లకు మాత్రమే వీటిని విడుదల చేశారు. జైనూరు, బెజ్జూరు స్టాక్‌ పాయిం ట్లకు సంబంధించి సన్న బియ్యం నిలువలు లేకపో వడంతో అక్కడ కొద్ది మందికి మాత్రమే అందే వీలుండొచ్చని చెబుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 278 రేషన్‌ దుకాణాలు ఉండగా రెండు రోజులుగా సన్న బియ్యం పంపిణీ జరుగుతున్నట్లు చెబుతున్నారు. 


సన్న బియ్యంతోనే అక్రమాలకు అడ్డుకట్ట 

చౌకధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపా యికే కిలో బియ్యం అందిస్తున్నప్పటికీ ఇన్నాళ్లు సరఫరా చేసిన దొడ్డు రకం బియ్యం తినేందుకు లబ్ధిదారులు అయిష్టత వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇందుకు కారణం లేకపోలేదు. బియ్యం నాణ్యత సరిగ్గా లేక పోవడం, దుమ్ము శాతం అధికంగా ఉండడం, అన్నం సరిగ్గా ఉడకక పోవడం వంటి కారణాలతో కొందరు లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం కొనుగోలు చేసిన వెంటనే స్మగ్లర్లకు కిలో రూ.8 నుంచి రూ.12 వరకు నాణ్యతను బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం పాఠశాలలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లుగానే రేషన్‌ దుకాణాల ద్వారా కూడా తక్కువ పరిమాణంలో సరఫరా చేసినా సన్న బియ్యమే అందిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుందని పలువురు చెబుతున్నారు. తద్వారా బియ్యం దుర్వినియోగం కాకుండా నిలువరించడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందని సూచిస్తున్నారు. 


ఇదీ తాత్కాలికమే 

ప్రస్తుతం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నప్పటికీ ఇది విద్యార్థుల కోసం నిలువ ఉంచినవి కావడంతో అవి పాడుకాక ముందే పంపిణీ చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. మార్చిలో కరోనా ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు పాఠశాలలు తెర్చుకోక పోవడం మధ్యాహ్న భోజనం అందించే వీలు లేకుండా పోయింది. దాంతో పాటు ఆశ్రమ పాఠశాల్లోనూ విద్యార్థులు ఇంకా చేరలేదు. ఇప్పట్లో పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితులు లేకపోవడం వల్లే సన్న బియ్యం పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ లబ్ధిదారులకు అందిస్తున్నారని చెబు తున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడంతో రానున్న కాలంలో మిల్లర్లు సన్న బియ్యాన్ని లేవీగా సేకరించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే అది పెద్దగా ఉండకపోవచ్చని అంటున్నారు. ప్రస్తు తం అందిస్తున్న సన్న బియ్యం నిల్వలు అయిపో యేంత వరకు మాత్రమే తాత్కాలికంగా అందిం చేందుకు నిర్ణయించారని చెబుతున్నారు. 

Updated Date - 2020-12-05T03:46:07+05:30 IST