దైవ చింతనకు ప్రతిఫలం

ABN , First Publish Date - 2021-01-22T05:54:26+05:30 IST

అబూ యాజిద్‌ ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ సూఫీ గురువు. ఆయనను ‘బయాజిద్‌ బిస్తావి’ అని కూడా అంటారు. బుయాజిద్‌ తాత జురాస్ట్రియన్‌, తండ్రి స్థానికంగా పేరు పొందిన వ్యక్తి.

దైవ చింతనకు ప్రతిఫలం

బూ యాజిద్‌ ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ సూఫీ గురువు. ఆయనను ‘బయాజిద్‌ బిస్తావి’ అని కూడా అంటారు. బుయాజిద్‌ తాత జురాస్ట్రియన్‌, తండ్రి స్థానికంగా పేరు పొందిన వ్యక్తి. బయాజిద్‌ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచీ కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉండేవి. బాల్యంలో సాధిఖ్‌ అనే గురువును బయాజిద్‌ ఆశ్రయించాడు. గురువు బోధించే విషయాలను అత్యంత శ్రద్ధతో వినేవాడు, అవగతం చేసుకొనేవాడు. 


ఒకరోజు బయాజిద్‌ను సాదిఖ్‌ పిలిచి కిటికీలో ఉన్న గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు.


‘‘కిటికీయా? అదెక్కడుంది?’’ అని అడిగాడు బయాజిద్‌.


‘‘ప్రతి రోజూ కిటికీ ఉన్న గదిని దాటి వస్తావు కదా! కిటికీని చూడలేదా?’’ అని అడిగాడు గురువు.

‘‘లేదు. మీరు, మీ బోధన తప్ప మిగిలిన ఏ ఒక్క విషయాన్నీ చూసే, గ్రహించే స్థితిలో నేను లేను’’ అన్నాడు బయాజిద్‌. 


ఏకాగ్రత, గురువు, ఆయన చేసే బోధల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్న బయాజిద్‌ ఇచ్చిన సమాధానం విన్న సాదిఖ్‌ సంతోషించాడు. ‘‘ఇక నువ్వు నా దగ్గర నేర్చుకోవలసిందీ, నేను నీకు నేర్పగలిగేదీ ఏదీ లేదు. నువ్వు ఇక్కడికి వచ్చిన కార్యం ముగిసింది. ఇక నువ్వు మీ ఊరికి వెళ్ళు’’ అని బయాజిద్‌ను గురువు పంపేశాడు.

ఊరు చేరుకున్న బయాజిద్‌ నిరంతరం దైవ ధ్యానంలో ఉండేవాడు. తనను తాను పూర్తిగా మరచిపోయాడు.


ఒక రోజు...‘‘బయాజిద్‌! నీవు నాకు అత్యంత ప్రియమైనవాడివి అయ్యావు. నేను ఎన్నుకున్న వారిలో ఒకడివయ్యావు. ఈ విషయాన్ని ప్రకటించనా?’’ అంటూ దైవవాణి ఆయనకు వినబడింది. అప్పుడు బయాజిద్‌ ‘‘వద్దు, వద్దు. అలాంటి ప్రకటన నన్ను కష్టాల్లోకి నెడుతుంది’’ అని చెప్పాడు. 


అహాన్ని పూర్తిగా వదులుకొని, దైవ చింతనలో గడిపే ఏ వ్యక్తి జీవితంలోనైనా అద్భుతాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటిది బయాజిద్‌ జీవితంలో ఒకటి కనిపిస్తుంది.

ఒకసారి ఆయన చిన్న ఒంటెతో తనకు అవసరమైన సామగ్రినీ, వస్త్రాలనూ, నీటినీ తీసుకొని మరో ఊరు వెళ్తున్నాడు. ఒంటె పక్కన ఆయన నడుస్తున్నాడు. దారిలో మరొక బాటసారి ఆయనకు ఎదురయ్యాడు. ‘‘పాపం! ఆ చిన్న ఒంటె పైన ఎంత భారం వేశావు?’’ అన్నాడు బయాజిద్‌తో.


బయాజిద్‌ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ముందుకు నడుస్తున్నాడు.

‘‘నువ్వు ఎంత కఠినాత్ముడివయ్యా! ఎంత క్రూరుడివయ్యా! ఆ చిన్న ఒంటె మీద అంత బరువు వేస్తావా?’’ అని ఆ బాటసారి పదే పదే అనసాగాడు.

అప్పుడు బయాజిద్‌ నెమ్మదిగా అతన్ని ఉద్దేశిస్తూ ‘‘బరువును ఒంటె మోయడం లేదు. జాగ్రత్తగా చూడు’’ అన్నాడు.


 బాటసారి ఒంటె దగ్గరకు వెళ్ళి చూశాడు. ఒంటె పైభాగంలో ఆ బరువు ఉంది. అది ఒంటెతో పాటే వస్తున్నట్టు కనిపించింది. బాటసారి బాగా కళ్ళు నులుముకొని, కనురెప్పలు వెడల్పు చేసి చూశాడు. ఒంటెకూ, సామగ్రికీ మధ్య ఖాళీ ఉంది!

ఇది బుయాజిద్‌ దైవ చింతనకు దైవం ఇచ్చిన ప్రతిఫలం. తనకు ఇష్టుడైన బయాజిద్‌ కోసం పరమాత్ముడు చేసిన అద్భుతం. ఆయన పట్ల దైవానికి ఉన్న ప్రేమకు తార్కాణం.


 రాచమడుగు శ్రీనివాసులు

Updated Date - 2021-01-22T05:54:26+05:30 IST