Abn logo
Sep 18 2021 @ 01:16AM

గజ్వేల్‌లో రేవంత్‌ షో

సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న రేవంత్‌రెడ్డి

త్రివర్ణమయమైన సీఎం కేసీఆర్‌ ఇలాకా..

కళాకారుల ఆటపాటలు... కిక్కిరిసిన ఐవోసీ మైదానం

అన్ని తానై చూసుకున్న మాజీ మంత్రి గీతారెడ్డి

చార్జిషీట్‌ను ప్రవేశపెట్టిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర


గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌/గజ్వేల్‌టౌన్‌/ములుగు/వర్గల్‌/రాయపోల్‌, సెప్టెంబరు 17: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి షో చేశారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభకు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యంఠాగూర్‌, ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు, సీఎల్పీ లీడర్‌ మల్లుభట్టి విక్రమార్క వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అజారుద్దీన్‌, మహే్‌షకుమార్‌గౌడ్‌, జగ్గారెడ్డి, గీతారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కిగౌడ్‌, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ కన్వీనర్‌ షబ్బీర్‌అలీ, ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ దామోదరరాజనర్సింహాతో కలిసి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. గజ్వేల్‌ నియోజకవర్గం మొత్తం త్రివర్ణమయమైంది. దారులన్నీ దండోరా వైపే ఉండడంతో అన్ని రోడ్లు వాహనాలతో కిక్కిరిశాయి. రేవంత్‌రెడ్డికి సిద్దిపేట జిల్లా సరిహద్దు అయిన ములుగు మండలం వంటిమామిడి నుంచి సభాస్థలి వరకు జననీరాజనం పలికారు. ఐఓసీ మైదానం జనమయమవగా, కళాకారుడు రఘు సారథ్యంలో ఆటపాటలు సభికులను ఉత్సాహపరిచాయి. మాజీ మంత్రి, ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి గీతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సభను అన్నితానై చూసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఏడున్నరేళ్లలో చేసిన మోసాలపై మాజీ డిప్యూటీ సీఎం దామోదర 15 అంశాలతో ఛార్జీషీట్‌ను ఈ దండోరా సభలో ప్రవేశపెట్టారు. 


దళితబంధుతో మరోసారి దగా చేసేందుకు యత్నం: దామోదర

సీఎం కేసీఆర్‌ దళితబంధు పేరుతో మరోసారి దగా చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత ఎలక్షన్‌ మెనేజ్మెంట్‌ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేతగా కేసీఆర్‌ 30లక్షల మంది దళితులకు చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని సూచించారు.  అనంతరం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ పంచిన భూముల్లో పదిశాతం పంచినా పాలేరుగా పనిచేస్తానని, శత్రుసంహారం చేయడానికి రేవంత్‌రూపంలో కాంగ్రెస్‌ పార్టీకి భగవంతుడు దొరికాడని దుబ్బాక కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. రేవంత్‌సభతో సర్పంచుల బిల్లులన్ని క్లియర్‌ అయ్యాయని, సర్పం చులంతా రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారని మెదక్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్‌ అన్నారు. హుజురాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నారాయణఖేడ్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి సురే్‌షషెట్కార్‌ అన్నారు. జుఠామాటల కేసీఆర్‌ మాయమాటలతో దగా చేయడానికి సిద్ధంగా ఉన్నారని సిద్దిపేట నియోజకవర్గ నాయకురాలు భవానీరెడ్డి తెలిపారు. నక్కజిత్తుల కేసీఆర్‌కు ఓటుతోనే బుద్ధి చె ప్పాలని, గజ్వేల్‌లో 5 వేల ఇళ్లు ఇస్తానన్న కేసీఆర్‌ ఐదు ఇళ్లను కూడా ఇవ్వలేకపోయారని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపు మాటలతో కేసీఆర్‌ మాయచేస్తున్నారని సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్‌వి అన్ని మోసపు హామీలేనని మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. కేసీఆర్‌ మనువడిని గజ్వేల్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో ఒక రోజు పడుకోబెట్టాలని కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ప్రీతం అన్నారు. ఎస్సీల భూములను డంపింగ్‌యార్డులు, ప్రకృతివనాల కోసం గుంజుకుంటున్నారని, బల్క్‌ ఎంఎ్‌సఎస్‌ స్కాంగా దళితబంధు మారిందన్నారు. అనంతరం అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ 24 లక్షల ఎకరాల భూమిని కాంగ్రెస్‌ ఇస్తే 3లక్షల భూమిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాక్కుందన్నారు. చివరకు గద్దర్‌ భూమిని కాళేశ్వరం కెనాల్‌ పేరుతో లాక్కున్నారని, తన తాతలు సంపాదించిన భూమికి బిక్కుమల్ల నాగేశ్వర్‌రావు పేరుతో రైతుబంధు తీసుకుంటున్నారన్నారు. 


 గజ్వేల్‌లో కాంగ్రెస్‌ సభ సైడ్‌లైట్స్‌

 మధ్యాహ్నం 1గంట నుంచి సభా ప్రాంగణానికి ప్రజలు తరలివచ్చారు. సాయంత్రం 5గంటల వరకు సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది.

 గజ్వేల్‌లోని రోడ్లన్నీ నాయకుల వాహనాలతో నిండి ట్రాఫిక్‌జాం అయింది. 

 సభా ప్రాంగణంలో యమధర్మరాజు వేషాధారణలో రేవంత్‌రెడ్డి ఫొటోతో ఏర్పాటు చేసిన కటౌట్‌ సభికులను, నాయకులను, కార్యకర్తలను ఆకర్షించింది.

 గజ్వేల్‌కు వచ్చే భువనగిరి-తూప్రాన్‌ రోడ్లలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.

 సభకు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

 సభా ప్రాంగణంలో మెయిన్‌ స్టేజీతో పాటు కళాకారులు, జిల్లా స్థాయి నాయకుల కోసం మరో స్టేజీని ఏర్పాటు చేశారు. 

 కళాకారులు ఆటపాటలతో కార్యక్రమా న్ని ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగించారు. 

 నాలుగున్నర నుంచే సభావేదికపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకుల ప్రసంగాలు కొనసాగాయి. 

 6.10గంటలకు రేవంత్‌రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 

 కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఉండడంతో మెట్లపై నుంచి ఎక్కకుండా పక్క నుంచి గన్‌మెన్ల సహాయంతో స్టేజీ పైకి వచ్చారు. 

 రేవంత్‌రెడ్డికి గద, కత్తి, కిరీటం బహుకరించారు. 

 సభలో రేవంత్‌రెడ్డి 40నిమిషాల పాటు మాట్లాడి కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం నింపారు. 

 దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ రాత్రి 8:35కి ముగిసింది. 


కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం 

సిద్దిపేట,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు17 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపుసభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. గజ్వేల్‌ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. గజ్వేల్‌ చుట్టూరా కాంగ్రెస్‌ కటౌట్లు, భారీ ఫ్లెక్సీలు ఆకర్షించాయి. సీఎం నియోజకవర్గం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు సైతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా గజ్వేల్‌లోని రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. స్థానిక ఐవోసీ మైదానం జనంతో నిండిపోయింది. తాము లక్ష మంది వస్తారనుకుంటే 2లక్షల మంది దాటిపోయారని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఇంటెలిజెన్సు అధికారులు ఇక్కడున్న తలలు లెక్కబెట్టాలని, ఒక్క తల తగ్గినా.. వచ్చే ఆరు నెలల్లో గజ్వేల్‌లోనే మరో సభ ఏర్పాటు చేసి లెక్క సరి చేస్తామని అన్నారు. ఇక మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి అన్నీతానై వ్యవహరించి సభను ముందుకు నడిపించారు. గజ్వేల్‌లో తాను చేసిన అభివృద్ధి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేవన్నారు. 

 రేవంత్‌ తన ప్రసంగంలో కేసీఆర్‌పై విమర్శలు చేసినప్పుడల్లా జోష్‌ నిండింది. ఇక రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే సైతం రేవంత్‌ను ప్రశంసించారు. ఆయన హిందీలో ప్రసంగించారు. గజ్వేల్‌లో ఈ జనాన్ని చూస్తుంటే జోష్‌గా ఉందని అన్నారు. 


గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ముఖ్యనేతల ప్రసంగాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించేవారికి బతికే హక్కు లేదన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ భట్టి విక్రమార్క అన్నారు. హామీలు ఇచ్చి విస్మరించే ఈ ప్రభుత్వం 18లక్షల మందికి రూ.10లక్షల చొప్పున దళిత బంధు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రసంగిస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్‌ గుంట నక్కలా మారాడని మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ విమర్శించారు. ఇదే గజ్వేల్‌లో ఆయనను ఆరు అడుగుల బొంద తీసి పాతిపెట్టాలన్నారు. సీనియర్‌ నేత వీహెచ్‌ మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహించాలని సూచించారు. అంబేడ్కర్‌ దయతోనే తెలంగాణ వచ్చిందని, లేకుంటే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్‌ కుటుంబం బిచ్చమెత్తుకునేదని చెప్పారు. జనాన్ని మోసం చేయడమే కేసీఆర్‌ పాలసీ అని పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమొచన దినాన్ని ఎందుకు జరిపించడం లేదని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఏ ఒక్క చోట కూడా ముస్లింను వైస్‌ఛాన్స్‌లర్‌గా నియమించలేదని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలను సీఎం కేసీఆర్‌ దగా చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ మాట్లాడుతూ ఈ జనాన్ని చూస్తుంటే డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ ఆడుతున్నట్లు ఉందన్నారు. 


 రేవంత్‌రెడ్డికి ఘనస్వాగతం

ములుగు/జగదేవ్‌పూర్‌/గజ్వేల్‌టౌన్‌/వర్గల్‌/రాయపోల్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిద్దిపేట జిల్లా వంటిమామిడిలో ములుగు మండల కాంగ్రెస్‌ నాయకులు ఘన స్వాగతం పలికారు. కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గణేష్‌ యాదవ్‌ అతిపెద్ద గజమాలతో స్వాగతం పలికి గొర్రెపిల్లను బహుకరించారు. అన్నాసాగర్‌ సర్పంచ్‌ సాదు మైపాల్‌రెడ్డి ఖడ్గం అందించారు. ములుగు మండలం నుంచి కాంగ్రెస్‌ నాయకులు అధిక సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో రాజీవ్‌ రహదారి మీదుగా ప్రజ్ఞాపూర్‌కు చేరుకున్నారు. వందలాది కాంగ్రెస్‌ శ్రేణులు ద్విచక్రవాహనాలపై కాన్వాయ్‌ ముందు ర్యాలీగా వచ్చారు. వంటిమామిడి నుంచి హరిత రెస్టారెంట్‌ నుండి ప్రజ్ఞాపూర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడికి రాగానే జగదేవ్‌పూర్‌, కొండపాక నుంచి బైక్‌ ర్యాలీగా కాంగ్రెస్‌ శ్రేణులు తరలివచ్చారు. అక్కడి నుండి ర్యాలీ గజ్వేల్‌లోని సభా ప్రాంగణం వరకు కొనసాగింది. రోడ్డుకు ఇరువైపులా ప్రజలకు రేవంత్‌రెడ్డి అభివాదం చేశారు. సభా ప్రాంగణ పరిసరాలకు రాగానే వేలాది మంది కాన్వాయ్‌ వద్దకు చేరుకున్నారు. అందరూ సభలోకి వెళ్లాలంటూ రేవంత్‌రెడ్డి వారికి సూచించడంతో కార్యకర్తలందరూ సభ ప్రాంగణంలోకి వెళ్లగా రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ సభా ప్రాంగణానికి చేరుకున్నది. 


గజ్వేల్‌లో రేవంత్‌.. ఫాంహౌజ్‌లో కేసీఆర్‌

జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 17: గజ్వేల్‌లో జరిగిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా ముగింపు సభ జరిగే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌లోనే ఉన్నారు. ఇదే నియోజకవర్గానికి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా ఉన్న కేసీఆర్‌ గజ్వేల్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫాంహౌజ్‌కు వస్తుంటారు. గురువారం కేబినెట్‌ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఫాంహౌజ్‌కు వచ్చారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత గజ్వేల్‌లో భారీ ఎత్తున రాజకీయ సభ జరగడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కాగా రేవంత్‌ తన ప్రసంగంలో కేసీఆర్‌ గురించి మాట్లాడారు. ఇక్కడ జరిగేవన్నీ ఫాంహౌజ్‌లో ఉన్న సీఎం గమనిస్తున్నారని, తన మాటలు కూడా వింటున్నారని, ఒకవేళ టీవీ చూడకున్నా ఇక్కడి ఇంటెలిజెన్స్‌ పోలీసులతో సమాచారం తెప్పించుకుంటారని రేవంత్‌రెడ్డి అన్నారు.

హాజరైన కార్యకర్తలు, ప్రజలు


వేదికపై కూర్చున్న కాంగ్రెస్‌ నేతలు