రేవంత్‌ పక్కా బ్లాక్‌మెయిలర్‌

ABN , First Publish Date - 2022-05-25T08:25:10+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పక్కా బ్లాక్‌మెయిలర్‌ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.

రేవంత్‌ పక్కా బ్లాక్‌మెయిలర్‌

  • రాహుల్‌ని కూడా బెదిరిస్తారు.. 
  • తొందర్లోనే బీజేపీలో చేరతారు
  • రేవంత్‌ కూతురి పెళ్లికి డబ్బులిచ్చా
  • కాంగ్రెస్‌ది రచ్చబండ కాదు.. రొచ్చు బండ
  • రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి


హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పక్కా బ్లాక్‌మెయిలర్‌ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో మంది అధికారులు, ప్రజాప్రతినిఽధులు, ప్రముఖుల దగ్గర డబ్బులు తీసుకున్న చరిత్ర ఆయనదని విమర్శించారు. మంగళవారం టీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో రేవంత్‌ తనను బ్లాక్‌మెయిల్‌ చేశారని, పైసలిస్తవా..? లేదంటే కాలేజీలు మూయించాలా? అని బెదిరించారని చెప్పారు. అందర్నీ బ్లాక్‌మెయిల్‌ చేసే రేవంత్‌.. రాహుల్‌ గాంధీని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారన్నారు. రేవంత్‌ కూతురి పెళ్లికి తానే డబ్బులిచ్చానని మల్లారెడ్డి చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా తాను డబ్బులు ఇవ్వలేదని రేవంత్‌ ప్రమాణం చేస్తారా? అని సవాల్‌ విసిరారు. రేవంత్‌ ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మటాష్‌ అని, త్వరలోనే కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరతారని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రె్‌సది రచ్చ బండ కాదని.. రొచ్చు బండ.. లుచ్చా బండ.. బట్టేబాజ్‌ బండ. అని దూషించారు. రచ్చబండ పేరుతో రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కేటీఆర్‌ దావోస్‌ వెళ్లి పరిశ్రమలు తెస్తుంటే.. రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌లకు వెళ్తారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నం చేస్తున్నారని అన్నారు. తనను ఆంబోతు అంటున్న రేవంత్‌ చెత్తగాడని, దొంగ రెడ్డి అని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌ అక్రమాలపై చర్యలు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. 


కేసీఆర్‌ దేశాన్ని పాలిస్తారు..

అవిశ్రాంత పోరాటంతో తెలంగాణను సాధించిన మహాత్ముడు కేసీఆర్‌ అని.. 2024లో ఆయన దేశాన్ని పాలించడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పంజాబ్‌తోపాటు దేశవ్యాప్తంగా రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌ అజెండానే దేశానికి ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు మాట్లాడుతూ.. రేవంత్‌ అధ్యక్షుడయ్యాక పీసీసీని ప్రదేశ్‌ చీటర్స్‌ కమిటీగా మార్చారని విమర్శించారు. రెడ్డి, బీసీ వర్గాలకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక వర్గానికి రాజ్యాధికారం రావాలంటూ  రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అన్నారు.


రేవంత్‌ వ్యాఖ్యలు వ్యక్తిగతం: మహేశ్వర్‌రెడ్డి

రెడ్డి, వెలమ సామాజిక వర్గాలకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జూన్‌ 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లో పార్టీ వర్క్‌ షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 


అది టీ కప్పులో తుఫాన్‌ : మల్లు రవి

రెడ్డి సంక్షేమ సంఘం సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన అంశం టీ కప్పులో తుఫాన్‌ లాంటిదని, సామరస్యంగా పరిష్కారమవుతుందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రేవంత్‌.. రెడ్డి నాయకులు సాధించిన విజయాల గురించి చెప్పారు తప్ప ఇతర కులాల ప్రస్తావన చేయలేదన్నారు. బడుగు బలహీన వర్గాలను అవమానించలేదన్నారు. రేవంత్‌రెడ్డిని అరేయ్‌, తురేయ్‌ అంటూ మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి. తీరు మార్చుకోకపోతే మేడ్చల్‌లో తిరగనివ్వమని టీపీసీసీ నేతలు నందికంటి శ్రీధర్‌, సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2022-05-25T08:25:10+05:30 IST