Abn logo
Sep 20 2021 @ 22:40PM

రెవెన్యూలో సవరణలు జరిగేనా?

కలిగిరి తహసీల్దారు కార్యాలయం

పంట రుణాలు, రిజిస్ర్టేషన్లకు ఇబ్బందులు 

కలిగిరి, సెప్టెంబరు 20: రెవెన్యూ శాఖలో కొన్ని నెలలుగా అడంగల్‌, 1బీ సవరణలకు అంతరాయం కలగడంతో రై తులతోపాటు, భూమి కొనుగోలుదారులు, అమ్మకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువశాతం అడంగల్‌ కాపీలలో తండ్రిపేరు లేదా భూమి విస్తీర్ణం తప్పొప్పులుగా ఉండటం సహజం. అలా తప్పొప్పులుగా భూరికార్డు ఉంటే పంట రుణాలు మంజూరు, రిజిస్ర్టేషన్‌లు జరగవు. వాటి సవరణల కోసం రైతులు తమవద్ద ఉన్న హక్కు పత్రాలతో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటా రు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావడంతో రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళితే బ్యాంకు అధికారులు పట్టాదారు పాసుపుస్తకంతోపాటు మీసేవ అడంగల్‌, డిజిటల్‌ 1బీలు పూర్తి సమాచారంతో తీసుకురావాలని చెబుతారు. ఈ క్రమంలో రైతులు తమ భూములకు చెందిన తప్పొప్పుల సవరణకు మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో ఇబ్బందులవలన సరవరణలు కావడంలేదని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అదే విధంగా తమ అవసరాల నిమిత్తం భూములను అమ్ముకొన్న రైతులు సవరణలు కాకపోవడంతో రిజిస్ర్టేషన్‌లు ఆగిపోయాయని రెవెన్యూ కార్యాలయం చుట్టూరా తిరుగుతున్నా రు.  ఆన్‌లైన్‌ సమస్యను సరిచేయకపోవడంతో కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులు ఎక్కువశాతం తిరస్కరణకు గురవడంతో రైతుల సమస్యలు పరిష్కారం కావడంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ సవరణలు (రెక్టిఫికేషన్‌ ఆఫ్‌ ఎంట్రీస్‌ ఇన రికార్డ్‌ ఆఫ రైట్స్‌ సర్వీసు)ను సరిచేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.