రేపటి నుంచి సమీక్షలు

ABN , First Publish Date - 2020-05-24T09:35:02+05:30 IST

ఈ నెల 25 నుంచి 30 వరకు ఏడాదిగా జరిగిన అభివృద్ధితో పాటు, రాబోయే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై ..

రేపటి నుంచి సమీక్షలు

ఉదయమంతా సీఎంతో వీసీ

అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్‌


కాకినాడ, మే 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి 30 వరకు ఏడాదిగా జరిగిన అభివృద్ధితో పాటు, రాబోయే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై సమీక్షలు ఉంటాయని, జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి సూచించారు. ఈ ఆరురోజులు ఉదయమంతా సీఎంతో వీడియో కాన్ఫెరెన్స్‌ ఉంటుందని, మధ్యాహ్నం నుంచి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రితో జిల్లా అభివృద్ధిపై సమీక్ష జరుగుతుందని ఆయన వెల్లడించారు. కలెక్టరేట్‌లో శనివారం ఈ అంశంపై కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయాల బలోపేతానికి  అధికారులు కృషి చేయాలన్నారు. 25న సంక్షేమశాఖలు, 26న వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, 27న విద్య, 28న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, 29న వైద్య,ఆరోగ్యం, 30న రైతు భరోసా కేంద్రాలపై సమీక్షలుంటాయని తెలిపారు. తమ శాఖలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలపై పూర్తి సమాచారంతో జిల్లా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.


సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో ప్రతీ అర్జీదారుడు వినియోగించుకునేలా అధికారు లు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామ సచివాలయాల్లో 540 సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎటువంటి దరఖాస్తులు కూడా మండల, జిల్లా స్థాయి అధికారులు అర్జీదారుల నుంచి తీసుకోకూడదని, ఒకవేళతీసుకుంటే వాటిని సంబంధిత గ్రామ,వార్డు సచివాలయాలను పంపాలని తెలిపారు. జిల్లాలో 16 లక్షల కుటుంబాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కో అర్జీని వలంటీర్ల ద్వారా సచివాలయాలకు అందేలా పర్యవేక్షించాలని కలెక్టర్‌ తెలి పారు. జిల్లా మొత్తంలో కేవలం 30 వేల సర్వీస్‌ విజ్ఞాపనలు రావడాన్ని గమనిస్తుంటే సచివాలయాల తీరు ఆశాజనకంగా లేదన్నారు. ముఖ్యంగా ఆస్తి, కుళాయి పన్నులు, కరెంట్‌ బిల్లులు, ఇతర దైనందిన కార్యక్రమాలకు సంబంధించిన లావాదేవీలన్నీ సచివాలయాల ద్వారా జరిగేలా అధికారులు చొరవ చూపాలన్నారు.


నెట్‌ పనిచేయడం లేదనే కారణాలతో.. 

 నెట్‌ పనిచేయడం లేదని కారణాలతో పైస్థాయికి దరఖాస్తులు పంపండం సరైంది కాదని, సమస్య అధిగమించి సచివాలయాల్లోనే దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతీ సచివాలయంలో కొవిడ్‌ 19 సూచనలు ప్రతీ ఉద్యోగి పాటించాలన్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా సచివాలయా సిబ్బంది విధులు నిర్వహించాలని ఆయన సూచించా రు. సమావేశంలో జేసీలు డాక్టర్‌ లక్ష్మీశ, రాజకుమారి, సీహెచ్‌ కీర్తి, డీఆర్వో సత్తిబాబు, పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T09:35:02+05:30 IST