జీఓ మూడుపై రివ్యూ పిటిషన్‌ వెయ్యాలి

ABN , First Publish Date - 2022-05-20T10:26:18+05:30 IST

ఆదిలాబాద్‌లో 1986లో పర్యటించిన ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఆర్‌.

జీఓ మూడుపై రివ్యూ పిటిషన్‌ వెయ్యాలి

ఆదిలాబాద్‌లో 1986లో పర్యటించిన ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఆదేశాల మేరకు అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఆర్‌. శంకరన్‌ నేతృత్వంలో 1986 నవంబర్‌ 5న షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని ఉద్యోగాలు షెడ్యూల్డ్‌ తెగలతోనే భర్తీ చేయాలని జీఓ 275ను విడుదల చేశారు. కొంతకాలానికి గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించి ఈ జీఓను రద్దుచేయించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పెంచి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి, డ్రాప్‌ అవుట్స్‌ తగ్గించడానికి షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు అమలవుతున్న దృష్ట్యా వాటి కొనసాగింపుగానే మాతృభాషలో విద్యాబోధన చేయడానికి 275 జీఓకు కొన్ని న్యాయపరమైన సవరణలు చేపట్టి 2000 జనవరి 10న జీఓ నెంబర్‌ 3ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. 


2020 ఏప్రిల్‌ 22న జస్టిస్‌ అరుణ్‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 20 ఏళ్ళుగా షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో వందశాతం స్థానిక గిరిజనులకే కేటాయించే జీఓ 3ను రద్దుచేసింది. ఈ తీర్పు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు అశనిపాతంగా మారింది. భారత రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన న్యాయమూర్తులు జీఓ 3ను రద్దు చేయడం విషాదకరం. 5వ షెడ్యూల్డ్‌ ప్రాంతంలో అమలవుతున్న షెడ్యూల్డ్‌ ఏరియా పంచాయితీరాజ్‌ (పెసా) చట్టం ప్రకారం, 1/70 భూ బదలాయింపు చట్టం ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతంలోకి గిరిజనేతరులు ప్రవేశించడం, నివసించడం చట్టరీత్యా నేరం. అలాంటప్పుడు ఉద్యోగాలలో వాటా అడగడం ఎంతవరకు సమంజసం? షెడ్యూల్డ్‌ ప్రాంతంలోని చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సిన రాజకీయపార్టీలు, పాలకులు చట్టాలను ధిక్కరించి ఏజెన్సీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన వారికి ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులు, ఇండ్ల పట్టాలు మంజూరు చేస్తున్నారు. ఏజెన్సీలో ఆక్రమణలకు పాల్పడుతున్న గిరిజనేతరులపై ఎటువంటి చర్యలు లేవు. ఇది ఆదివాసుల హక్కులు హరించడమే.


ప్రత్యేక చట్టాలు అమలవుతున్న షెడ్యూల్డ్‌ ప్రాంతంలోకి గిరిజనేతరులు వలసలు వచ్చి ఆదివాసుల అస్తిత్వానికి, మనుగడకు ప్రమాదంగా మారుతున్నారు. సుప్రీంకోర్టు జీఓ 3ను రద్దు చేయడం సమంజసం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంతో ఉన్నతమైన ఆశయంతో జీఓ 3 తీసుకువచ్చింది. గతంలో గిరిజనేతరులు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీఓ 3 రద్దు చేయమని హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఆదివాసుల అభ్యున్నతికి షెడ్యూల్డ్‌ ప్రాంతంలో అమలువుతున్న ప్రత్యేక చట్టాలను దృష్టిలో పెట్టుకొని ఈ జీఓను కొనసాగించవచ్చని హైకోర్టు తమ తీర్పులో చెప్పింది. సుప్రీంకోర్టు జీఓ 3ను రద్దు చేసినందున గిరిజనేతరులే కాదు, అడవిలోని ఖనిజ నిక్షేపాలపై కన్నువేసిన బడా పారిశ్రామిక, కార్పొరేట్‌ సంస్థలకు, అదృశ్య రాజకీయశక్తులకు ప్రయోజనం చేకూరుతుంది.


షెడ్యూల్డ్‌ ప్రాంతంలో గత ఇరవయ్యేళ్లుగా అమలులో ఉన్న జీఓ 3 ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులయ్యారు. మాతృభాష ద్వారా విద్యను బోధించడం వల్ల డ్రాపవుట్స్ తగ్గాయి. ఆదివాసులలో విద్యాశాతం పెరిగింది. ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయి. ఆదివాసీలకు ఉపయోగపడే జీఓ 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడమనేది ఆదివాసీ నిరుద్యోగుల జీవన్మరణ సమస్యగా మారింది. వైసిపి అధికారంలోకి రాకముందు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తానని మాట ఇచ్చింది. అది జరగకపోగా ఆదివాసీ నిరుద్యోగులకు ఉపయోగపడే జీఓ 3ను సుప్రీంకోర్టు రద్దుచేసి రెండేళ్లయినా, రివ్యూ పిటిషన్‌ వేసుకోడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించినా ఆంధ్రా, తెలంగాణల్లోని వైసిపి, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్‌ వేయకుండా కాలయాపన చేస్తున్నాయి.


ఆదివాసీ చట్టాలను సక్రమంగా అమలుచేయకుండా ఒక్కొక్కటి రద్దు చేస్తూ మొత్తంగా అడవిని, అటవీ సంపదను దోచుకోవాలనే కుట్ర దాగుందని ఆదివాసీ సమాజం అర్థం చేసుకోవాలి. ఆదివాసులను దోపిడీ చేసే గిరిజనేతర రాజకీయ పార్టీలను ఏజెన్సీ ప్రాంతం నుంచి బహిష్కరించాలి. ఉభయ తెలుగు రాష్ట్ర పాలకులు పట్టించుకోని నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జోక్యం చేసుకుని జీఓ 3 పునరుద్ధరణ కొరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి ఆదివాసులకు అండగా నిలవాలి.


– అనుముల వంశీకృష్ణ (ఆదివాసీ మహాసేన)

Updated Date - 2022-05-20T10:26:18+05:30 IST