‘ఉక్కు’ నత్తనడక!

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అవుతోంది.

‘ఉక్కు’ నత్తనడక!

ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరుతో ఏర్పాటు

డిసెంబరు 23న శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

ఆ తరువాత కదలికలేని వైనం

ఇటీవల నిర్మాణ పనులపై సమీక్ష


కడప, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అవుతోంది. జిల్లాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు. అందులో కీలకమైన ‘కడప ఉక్కు పరిశ్రమ’ ఒకటి. గత ఏడాది ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన రోజు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు.. అధికారంలోకి వచ్చాక ఆరునెలల్లో టెంకాయ కొడితే చిత్తశుద్ధి’ అంటారు అంటూ గత పాలకులపై వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. ఈ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితిపై కథనం.


ఈ పరిశ్రమ నిర్మాణానికి తొలిసారిగా 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జమ్మలమడుగు మండలం అంబవరం దగ్గర బ్రహ్మణీ స్టీల్స్‌ సంస్థకు 10,670 ఎకరాలు కేటాయించారు. రూ.20వేల కోట్లతో నాలుగు మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంగా 2007 జూన్‌ 10న వైఎస్‌ శంకుస్థాపన చేశారు. వైఎస్‌ మరణం తరువాత 2011లో సీబీఐ కేసుల కారణంగా ఉక్కు పరిశ్రమ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. 2014లో రాష్ట్ర పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే పరిశ్రమ నిర్మించేలా స్పష్టంగా పేర్కొన్నారు.


కేంద్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత టీడీపీ ప్రభుత్వం రాయలసీమ స్టీల్స్‌ అథారిటీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ స్థాపించి మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద 3,892 ఎకరాలు కేటాయించింది. రూ.33వేల కోట్లతో 18 నెలల్లో ఉక్కు ఉత్పత్తి, 25 వేల మందికి ప్రత్యక్షంగా, మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లక్ష్యంగా 2018 డిసెంబరు 27న నాటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో రాయలసీమ స్టీల్‌ అథారిటీ కార్పోరేషన్‌ రద్దు అయ్యింది. 


సీఎం జగన్‌ పునాదిరాయికి ఐదు నెలలు

ఉక్కు పరిశ్రమ దివంగత వైఎస్‌ సంకల్పం కావడంతో ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇవ్వడమే కాదు.. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిప్రాధాన్యతగా తీసుకున్నారు. ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి గత ఏడాది డిసెంబర్‌ 23న పునాది రాయి వేశారు. దీనికోసం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్ద నందలూరు గ్రామాలలో 3,295 ఎకరాల భూములను కేటాయించారు. ఐరన్‌ఓర్‌ సరఫరాకు నేషనల్‌ మైనింగ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)తో ఒప్పందం కూడా జరిగిందని అధికారులు తెలిపారు. రూ.15 వేల కోట్లతో 30 లక్షల టన్నుల స్టీల్‌ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించే ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని శంకుస్థాపన సభలో సీఎం జగన్‌ పేర్కొన్నారు.


మూడేళ్లలో పూర్తి చేసి ఉత్పత్తి పెడతామని వివరించారు. జగన్‌ పూనాది రాయి వేసి ఐదు నెలలు గడిచింది. ఇప్పటివరకు పునాది కూడా తవ్వలేదు. అక్కడ పరిశ్రమ నిర్మిస్తారనే ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. సీఎం జగన్‌ వేసిన శిలాఫలకం మాత్రం దర్శనమిస్తోంది. కాగా ఈ నెల 16న స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులపై ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీ షన్మోహన్‌, చైర్మన్‌ మధుసూధన్‌ రెడ్డి, మఖ్య సలహాదారుడు, పారిశ్రామికవేత్త రాజోలి వీరారెడ్డితో కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సమీక్షించారు. ప్రహరీ గోడ, రోడ్లు, నీటి వసతి వంటి పనులు తక్షణమే చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. మూడేళ్లలో స్టీల్‌ ఉత్పత్తి జరగాలంటే పనులపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST